ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు నీరసం, చిరాకు వస్తుంటుంది. శరీరంలోని శక్తి మొత్తం సూర్యుడు లాగేసుకుంటాడు. ఇలాంటి సమయంలో చల్లని పానీయాలు ఎంతో హాయినిస్తాయి. అందుకే వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందేందుకు డీహైడ్రేషన్ బారిన పడకుండా చాలామంది మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం వంటివి తాగుతుంటారు. అలాగే మరికొందరు నిమ్మకాయతో షర్బత్ తయారు చేసి సేవిస్తుంటారు. ఎన్ని తాగినా వేసవి తాపం అంత తేలిగ్గా తగ్గేది కాదు. కాబట్టి దాహం తీరడంతో పాటు తక్షణ శక్తిని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఇలాంటి పానీయాలు ప్రయత్నిస్తే మంచిది.
సోంపుతో షర్బత్
కావాల్సిన పదార్థాలు: సోంపు – కప్పు, పటిక బెల్లం ముక్కలు – అరకిలో, యాలకుల పొడి – అరటీస్పూన్, నిమ్మ ఉప్పు – చిటికెడు, నానబెట్టిన సబ్జా గింజలు – తగినన్ని.
తయారు చేసే విధానం: ముందుగా ఒక చిన్న గిన్నెలో సోంపు తీసుకొని బాగా కడగాలి. తర్వాత అందులో 750ఎంఎల్ వరకు నీరు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాతి రోజు నానబెట్టుకున్న సోంపు నీటిని మరో బౌల్‌లోకి వడకట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వడకట్టిన సోంపుని వేసుకోవాలి. ఆపై సోంపు నానబెట్టుకున్న నీటిని వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెపై జాలీగంటెలో శుభ్రమైన పల్చని క్లాత్ ఉంచి దానిలో మిక్సీ పట్టుకున్న సోంపు పేస్ట్‌ని వేసి బాగా పిండితే అందులోని సారమంతా దిగిపోతుంది. సోంపు పేస్ట్‌లోని సారాన్నంతా బాగా పిండుకున్నాక ఆ పిప్పిని పడేయాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకొని వడకట్టిన సోంపు సారాన్ని పోసుకోవాలి. ఆపై అందులో పటిక బెల్లం ముక్కలు వేసుకొని కలుపుతూ లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడు మిశ్రమం పైన మురికిలా ఒక తేట వస్తుంది. దాన్ని గరిటెతో తీసేస్తుండాలి. అప్పుడే పాకం చక్కగా వస్తుంది. అది మరిగి కాస్త చిక్కగా మారిందనుకున్నాక యాలకుల పొడి వేసుకొని కలిపి మరికాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం మరిగి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి 20 నిమిషాల సమయం పట్టొచ్చు. సోంపు మిశ్రమం చక్కగా మరిగి లేత తీగ పాకం వచ్చిందనుకున్నాక చివర్లో నిమ్మ ఉప్పు వేసుకొని కలిపి దింపేసుకోవాలి. ఆ తర్వాత పాకాన్ని పూర్తిగా చల్లార్చుకుంటే సోంపు షర్బత్‌కి కావాల్సిన స్క్వాష్ రెడీ అయినట్లే. అనంతరం దీన్ని ఏదైనా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే కనీసం రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.
సోంపు షర్బత్ ఎలా చేసుకోవాలంటే?
గాజు గ్లాసులో రెండు టేబుల్ స్పూన్ల సోంపు స్క్వాష్ తీసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు, చల్లని నీరు పోసుకొని కలుపుకోవాలి. చివర్లో ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలు. ఒకవేళ మీకు నచ్చితే కలర్ ఫుల్‌గా కనిపించడానికి కొద్దిగా గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు. అంతే, మండుటెండల్లో కూల్ కూల్‌గా పొట్టకు హాయినిచ్చే సోంపు షర్బత్ రెడీ!
రాగి అంబలి
రాగి అంబలి కోసం ముందురోజు రాత్రే రాగిపిండిని నానబెట్టుకోవాలి. రాగిపిండి చక్కగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి తడి చేతితో చిన్న రాగిముద్దను చేతిలోకి తీసుకోవాలి. అప్పుడు రాగిపిండి చేతికి అంటనట్లయితే అది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. రాగిపిండిని మట్టిపాత్రల్లో రాత్రంతా ఊరనివ్వడం వల్ల అంబలి చల్లగా, రుచికరంగా ఉండి వేసవిలో తాగేకొద్దీ తాగాలనిపిస్తుంది. అదే రాగి ముద్దలను స్టీలు గిన్నెల్లో నానబెడితే పిండి కాస్త పులుపెక్కే ఛాన్స్ ఉంటుంది.
కావల్సిన పదార్థాలు: రాగి పిండి – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, సన్నని కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని కరివేపాకు తరుగు – కొద్దిగా, ఉల్లిగడ్డ తరుగు – పిడికెడు, అల్లం తరుగు – కొద్దిగా, పచ్చిమిర్చి సన్నని తరుగు – టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద ఆ గిన్నెను ఉంచి పాత్రను రాగి పిండి వదిలేసే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. వాస్తవానికి రాగిపిండి మూడు నాలుగు పొంగులు రాగానే చిక్కగా మారుతుంది. అంత మాత్రాన పిండి చక్కగా ఉడికినట్టు కాదు. ఇలా తాగడం వల్లనే కడుపులో మంట, పుల్లటి తేన్పులు, అరగనట్టు అనిపిస్తుంది. కాబట్టి నిదానంగా మధ్యమధ్యలో కలుపుతూ రాగి పిండి పాత్రను వదిలేసే వరకు చక్కగా ఉడికించుకోవాలి. అందుకోసం 15 నుంచి 18 నిమిషాల సమయం పట్టొచ్చు. రాగిపిండి చక్కగా ఉడికి, కలిపితే గరిటెకు అంటుకోకుండా జారిపోతుందో అప్పుడు గిన్నెను దింపి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మట్టిపాత్రలో ముప్పావు భాగం వరకు(ఒకటిం పావు లీటర్) నీరు తీసుకోవాలి. తర్వాత చల్లారిన రాగి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, మట్టిపాత్రలో తీసుకున్న నీటిలో వేసుకోవాలి. ఆపై మూతపెట్టి రాత్రంతా ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం ద్వారా శరీరానికి, పొట్టకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. తర్వాత రోజు నానబెట్టుకున్న ఆ ముద్దలను చేతితో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వీలైతే జాలీ గంటెతో వడకట్టుకొని మరో గిన్నెలోకి పోసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని తరకలు లేకుండా బాగా చిలుక్కోవాలి. తర్వాత దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జావలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసి రెండు మూడుసార్లు బాగా చిలుక్కోవాలి. తర్వాత సన్నని కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకోవాలి. అలాగే చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను చేతితో నలిపి వేసుకోవాలి. ఇక చివర్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
తర్వాత గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన, ఆరోగ్యవంతమైన రాగి అంబలి మీ ముందు ఉంటుంది. ఈ అంబలిని క్రమంతప్పకుండా రోజూ తాగి చూడండి. శరీరంలోని వేడి చాలా వరకు తగ్గిపోతుంది.
పచ్చిమామిడితో
కావాల్సిన పదార్థాలు: పచ్చిమామిడి కాయలు – రెండు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పులు, యాలకుల పొడి – అరటీస్పూను, ఐస్ క్యూబ్స్ – కొన్ని.
తయారీ విధానం: ఇందుకోసం ముందుగా తాజా, గట్టిగా ఉండే పచ్చిమామిడి కాయలను శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత అందులో స్టాండ్‌ని ఉంచి దానిపై మామిడి కాయలు ఉన్న గిన్నె పెట్టాలి. ఆపై మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామిడికాయలు ఉడికేలోపు మిక్సీలో బెల్లం తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గిన్నెలో ఉడికించుకున్న మామిడికాయలను ప్లేట్‌లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. అవి చల్లారాక టెంక తీసేసి మెత్తగా ఉడికిన మామిడి గుజ్జును చేతితో బాగా మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం పేస్ట్‌ని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక అందులో యాలకుల పొడి వేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్‌లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవిధంగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ గుజ్జును ఎయిర్ కంటైనర్‌లో వేసుకొని మూతపెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కనీసం 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది.
డ్రింక్ తయారీ: ముందుగా గ్లాసులలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో మిక్స్‌ని ఒకటి లేదా రెండు టీస్పూన్లు వేసుకొని కూల్ వాటర్ పోసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని ‘పచ్చిమామిడికాయ డ్రింక్’ రెడీ!
తాటి ముంజలతో మ్యాంగో స్మూతీ
కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు – నాలుగు, మామిడి పండు – ఒకటి, పాలు – కప్పు, పంచదార – రెండు చెంచాలు, ఐస్‌క్రీం – రెండు స్పూన్లు, ఐస్‌ముక్కలు – ఎనిమిది.
తయారీ విధానం: ఇందు కోసం ముందుగా తాటి ముంజలపై ఉండే పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడి పండుని కూడా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసు కొని పక్కనుంచాలి. ఇప్పుడు మిక్సీజార్ తీసు కొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామి డి పండు ముక్కలు, ముంజలు సగం, పాలు, పంచదార, ఐస్‌క్రీం వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని గ్లాసుల్లోకి తీసుకొని మిగిలిన ముంజల ముక్కలు, కొద్దిగా ఐస్‌క్రీం, ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే కూల్ కూల్‌గా కమ్మని ‘ముంజల మ్యాంగో స్మూతీ’ రెడీ!