శ్రామిక మహిళలంతా ఏక‌మై

All working women are unitedమేడే… ఎనిమిది గంటల పనికై సాగిన పోరాటానికి చిహ్నం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కదం తొక్కిన కార్మికుల ఘన చరిత్ర. 138 ఏండ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ వీరోచిత పోరాటంలో మహిళల పాత్ర కీలకం. ఆనాడు బట్టల మిల్లుల్లో పెద్ద ఎత్తున పని చేసే మహిళలు సైతం ఈ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు. త్యాగాలు చేసి ఎన్నో హక్కులు సాధించుకున్నారు. ఆ హక్కులన్నీ కాలరాయబడుతున్న తరుణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. నేడు మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు శ్రామిక మహిళలంతా ఐక్యతతో మరింత చైతన్యంతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ మేడే గుర్తుచేస్తోంది.
భారత్‌ నేడు 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. ఇందులో 65శాతం జనాభా యువత కావడం వల్ల ఆర్థిక వృద్ధికి పూర్తి అవకాశాలున్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడం ఒక సమస్యగా మారింది. గత రెండు దశాబ్దాల్లో శ్రామిక మహిళల సంఖ్య రికార్డు స్థాయికి పడిపోయింది. శ్రామిక శక్తిలో మహిళలు 37శాతం మాత్రమే ఉన్నారు. అంటే భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు తక్కువగానే ఉంది. అంటే ఐదుగురిలో ముగ్గురికి పైగా మహిళలు పనికి దూరంగా ఉంటున్నారు.
ఆధిపత్య కాంప్లెక్స్‌
భారతదేశం పురుషాధిక్య సమాజం. కారణంగా మహిళల మనుగడలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా గృహ హింస, భ్రూణహత్యలు, నిరక్షరాస్యత, వివక్ష వంటి అనేక సమస్యలను ప్రతిచోటా ఎదుర్కొంటున్నారు. ఎవరైనా దీని నుండి తప్పించుకుంటే ఆమెకు కార్యాలయంలో లైంగిక వేధింపులు తప్పవు. దీని వెనుక ఒక కచ్చితమైన కారణం ఉంది. ఇది ఉన్నత స్థానంలో కూర్చున్న మనిషిలో ఆధిపత్య కాంప్లెక్స్‌. ఇది అసంఘటిత రంగం లేదా స్థానిక స్థాయిలో పనిచేసే వ్యక్తుల విషయంలో మాత్రమే కాదు బహుళ జాతీయ కంపెనీలలో, సివిల్‌ సర్వెంట్‌ కార్యాలయంలో కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ప్రత్యేకించి మన దేశంలో మాత్రమే లేదు. చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
మరింత దిగజారిపోయింది
దేశంలో శ్రామిక శక్తిలో భాగమౌతున్న మహిళల్లో 95 శాతం మంది ఎటువంటి చట్టాలు వర్తించని అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. కరోనా తర్వాత శ్రామిక మహిళల స్థితి మరింత దిగజారిపోయింది. వర్క్‌ ఫ్రం హౌం ఫలితంగా పని గంటలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో పని చేసే వారిలో మహిళల సంఖ్య బాగా పెరిగిపోయింది. 8 గంటల పని విధానం చివరకు ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా కనుమరుగైపోయింది. ఆర్టీసీ, బ్యాంకులు, విద్యా, వైద్యం ఇలా ఏ రంగంలో చూసినా మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని చోట్ల 24 గంటలు పని చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. కొందరికి కనీసం ప్రసూతి సెలవులు కూడా వర్తించడం లేదు. ఇక షాపుల్లో సేల్స్‌ గర్ల్స్‌గా పని చేస్తున్న మహిళల పరిస్థితి మరింత దారుణం. పని చేసినంత సేపు నిలబడే ఉండాలి. వీరి జీతాలు అత్యంత దుర్భరంగా ఉంటున్నాయి. ఇలాంటి వారికి కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూర్చునే హక్కును కల్పించాయి. అలా అన్ని రాష్ట్రాలు చేస్తే కొంతైనా వెసులుబాటు దక్కుతుంది.
చట్టాలు నిర్వీర్యం
నేడు దేశాన్ని పాలిస్తున్న మతోన్మాదులు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా కార్మికులు మరిన్ని సమస్యల్లోకి నెట్టివేయబడుతున్నారు. కార్పొరేట్లతో జత కట్టిన పాలకులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. పోరాటాలు చేసి సాధించిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. కార్మికులను కార్పొరేట్లకు బానిసలుగా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే జరిగితే శ్రామిక మహిళలపై దీని ప్రభావం మరింత ఉంటుంది. కనుక అందరూ ఐక్యంగా కార్పొరేట్లకు తొత్తులుగా మారిన మతోన్మాద పాలకులను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భయంతో బతుకుతున్నాం
కాంట్రాక్ట్‌ స్వీపర్‌గా ఐదేండ్ల నుండి చేస్తున్నాను. విద్యానగర్‌, మసీదు రోడ్డు, బ్యాంకు రోడ్డు నేను పని చేసే ప్రాంతాలు. పొద్దున 5:30 నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు వీధులు ఊడుస్తూ ఉంటాను. ఇన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం, కానీ ప్రభుత్వం మాకు జీతాలు పెంచడం లేదు. నేను చేరినప్పుడు నా జీతం 12000/- ఇప్పుడు పదిహేను వేలు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే మా జీతాలు సరిపోవడం లేదు. మాలాగా మా పిల్లల జీవితాలు అవ్వకూడదు అని కోరుకోవడం తప్పా? నాకు భర్త లేడు. కిందటి ఏడాది క్యాన్సర్‌తో చనిపోయాడు. నాకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. ఎలా బతకాలి అని ప్రతి రోజూ భయంతో కూడుకున్న దిగులు. మేము రిటైర్‌ అయ్యాక పెన్షన్‌ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేము మనుషులమే. మాకూ కుటుంబం ఉంది. మా కష్టాన్ని చూసి ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించాలి. కొందరు పనిలోకి ఎంతో దూరం నుంచి వస్తారు. బస్సులు అందుబాటులో లేకపోతే ఆటోలో రావాలంటే మా జీతం ఆటో కిరాయిలకే సరిపోతుంది. ఒక్కరోజు పనిలోకి వెళ్ళకుంటే జీతం కట్‌ చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా శ్రమను గుర్తించాలి.
– ఎన్‌.లలిత, అంబర్‌ పేట.
ప్రభుత్వం ఆదుకోవాలి
నేను 24 ఏండ్లుగా స్వీపర్‌గా చేస్తున్నాను. నేను పర్మినెంట్‌ ఉద్యోగిని. విద్యానగర్లోని మసీదు రోడ్డులో పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తున్నాను. ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం 6000. ఇప్పుడు 18,000. అన్ని కటింగ్‌లు పోను 15,500 చేతికి వస్తుంది. నా భర్త మేస్త్రీగా పని చేసేవాడు. 13 ఏండ్ల కిందట బిపి ఎక్కువై చనిపోయాడు. అప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లలను పెంచుకుంటూ వచ్చాను. కరోనా సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. కుటుంబం నుంచి కూడా నాకు ఎటువంటి సహాయం అందలేదు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా ఉదయం పూట 5.30 గంటలకి పనిలో ఉండాలంటే ఆ సమయంలో బస్సులు అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆటోలో వస్తే ఒక్కొక్కరికి 200 అవుతుంది. పండుగలు వచ్చినప్పుడు మమ్మల్ని కనీసం హాఫ్‌ డే అన్నా పంపిస్తే పండుగ చేసుకోగలుగుతాం. మంచి యూనిఫామ్‌ కూడా మాకు లేదు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న కోటు మా ఆడవాళ్ళకి ఎందుకూ పనికిరాదు. అది వేసుకుంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనికి సమయానికి రాకపోతే జీతంలో కోత విధిస్తారన్న టెన్షన్‌ అనుక్షణం అనుభవిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం మాకు తగిన సహాయం చేయాలని కోరుకుంటున్నాం.
– హంస, హయత్‌నగర్‌

Spread the love