అమ్మ‌లు ఉద్యోగాల‌కు అర్హులే

Mothers deserve jobsఅమ్మైన తర్వాత ఉద్యోగాలు చేయడం మహిళలకు ఓ సవాల్‌ లాంటిదే. ఒత్తిడితో కూడిన జీవితాన్ని సమతుల్యం చేసుకోలేక తమ కెరీర్‌కు దూరం కావడమో లేదా కొంత కాలం విరామమివ్వడమో చేస్తుంటారు. తిరిగి ఉద్యోగంలో చేరడం అంత సులభం కాదు. అలాంటి అర్హత కలిగిన గృహిణులకు ఉద్యోగాలు, ఆర్థిక స్వేచ్ఛను ఇస్తున్న మహిళా పారిశ్రామికవేత్త శంకరి సుధార్‌. చెన్నైకి చెందిన ఆమెకు ‘స్టార్టప్‌ ఓవర్‌క్వాలిఫైడ్‌ హైజ్‌వైవ్స్‌’ స్థాపించాలనే ఆలోచన ఎందుకు, ఎలా వచ్చిందో తెలుసుకుందాం…
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైనా శంకరి సుధార్‌ ఐటి మేజర్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆమె జీవితం మలుపు తిరిగింది. మహమ్మారి సమయంలో ఆమెకు బిడ్డ పుట్టింది. సంస్థ ఆమెకు మద్దతు ఇచ్చినప్పటికీ అప్పుడే తల్లి అయిన ఆమె పని ఒత్తిడి వల్ల చాలా నీరసించేది. ఆ అలసటను భరించలేక పోయింది. దీని వల్ల సిజేరియన్‌ బాధ నుండి కోలుకోలేకపోయింది. దానికి తోడు ప్రసవానంతర డిప్రెషన్‌ ఆమెను నిరుత్సాహపరిచింది. దీంతో ఎనిమిదేండ్లు తన ఉద్యోగాన్ని వదిలేసి సొంతగడ్డపై దృష్టి పెట్టింది. అయితే పరిస్థితి మరింత దిగజారింది. ‘నేను పని నుండి నిష్క్రమించాలని, విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుందని అనుకున్నాను. అయితే నేను ఏమీ చేయకుండా నా సామర్థ్యాన్ని వృధా చేస్తున్నాననే భావన నన్ను ప్రతిరోజూ కుంగదీసేది. ఒక విచిత్రమైన శూన్యతను అనుభవించాను’ అని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి పట్టభద్రుడైన సుధార్‌ అంటుంది.
నేను ఒంటరిగా లేనని…
తనకు అనుకూలమైన పని వెతకడం ప్రారంభించింది. అయితే చాలా కంపెనీలు ఆమెను అంగీకరించలేదు. ఫ్రీలాన్సింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా కూడా ప్రయత్నించింది. అయితే అక్కడ విపరీతమైన పోటీ ఉంది. ‘నేను ఎప్పుడూ కోపంగా, భావోద్వేగంతో ఉండేదాన్ని. ఒక రోజు పత్రికలో ఒక వార్త చదివాను. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గృహిణులు భారతదేశంలోనే ఉన్నారు. అప్పుడు నేను ఒంటరిగా లేనని అర్థం చేసుకున్నాను. స్త్రీలకు చాలా తక్కువ అవకాశాలు వస్తున్నాయి’ ఆమె చెప్పింది. దీని గురించే తన తోటివారితో చర్చిస్తున్నప్పుడు, చాలా మంది స్త్రీలు ఇదే పరిస్థితిలో ఉన్నారని, వారి అర్హతలు ఎందుకు పనికిరావని బాధపడడం ఆమె గమనించింది.
తిరిగి ప్రవేశించడానికి
‘చాలా మంది మహిళలు ఉద్యోగాలకు అర్హులు. కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న మహిళలను యాజమాన్యం తీసుకోవాలనుకుంటుంది. అయితే వారు కొంత వెసులుబాటు కలిగి ఉంటే మాత్రమే. కంపెనీలు సమయం, ప్రదేశ సౌలభ్యాన్ని అందించగలిగితే, అవకాశాల కోసం సిద్ధంగా ఉన్న నైపుణ్యం కలిగిన మహిళలతో వాటిని కనెక్ట్‌ చేయవచ్చు’ అని ఆమె ఓవర్‌ క్వాలిఫైడ్‌ హౌస్‌వైవ్స్‌ పుట్టుకను వివరిస్తుంది. ఆగస్ట్‌ 2022లో ప్రారంభించబడిన ఈ ఓవర్‌క్వాలిఫైడ్‌ హౌస్‌వైవ్స్‌ ఇప్పటి వరకు 600 మంది మహిళలకు అవకాశాలను అందించింది. 2,500 మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో తిరిగి ప్రవేశించడానికి నైపుణ్యాన్ని ఇచ్చింది. 26,000 మంది మహిళలు తమ పేర్లను ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకున్నారు. ఇది వారిని 600 కంపెనీలతో కలుపుతుంది. ఇందులో ఎక్కువగా స్టార్టప్‌లు, ూవీజులు ఉన్నారు.
వేతనం తక్కువ ఇస్తామంటారు
సుధార్‌ తన వ్యక్తిగత పరిచయాలతో కొన్ని కంపెనీలను కలిసింది. అన్ని కంపెనీలు మహిళల పట్ల ఒకే విధమైన నిబద్ధతను ప్రదర్శించలేదు. ‘ఇది మహిళలకు మాత్రమే వేదిక అయినందున చాలా తక్కువ జీతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నన్ను సంప్రదించిన ఒక వ్యక్తి తనకు కంటెంట్‌ రైటర్‌ కావాలని, నెలకు రూ. 5,000 చెల్లిస్తానన్నాడు. ఇలాంటి వారి చాలా మంది ఉన్నారు’ ఆమె చెప్పింది. అయితే మొదటి నుంచీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సుధార్‌ తన ప్లాట్‌ఫారమ్‌లో డేటా ప్రాసెసింగ్‌, రీసెల్లింగ్‌ లేదా ఇన్సూరెన్స్‌ కొనుగోలు వంటి ఉద్యోగాలను చూడదు. మహిళల అర్హత కంటే చాలా తక్కువ చెల్లించడానికి ముందుకు వచ్చిన క్లయింట్‌లను ఆమె అంగీకరించదు. కంటెంట్‌ రైటింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ రోల్స్‌, అడ్మిన్‌ కార్యకలాపాల వంటి వాటితో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫారమ్‌ ఇప్పుడు వ్యాపార అభివృద్ధి, టెస్టింగ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వాటిల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తుంది.
ఉద్యోగాలు, ఆర్థిక స్వేచ్ఛ
ఓవర్‌క్వాలిఫైడ్‌ హైజ్‌వైవ్స్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లు మహిళలకు ఉద్యోగాలను కనుగొనడమే కాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడంలో సహాయపడతాయి. కాలేజీ తర్వాత ఐటీ మేజర్‌లో చేరిన భాగ్యశ్రీ పెండ్లి చేసుకోవాలని కుటుంబ ఒత్తిడి కారణంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఏడేండ్ల తర్వాత ఆమె ఉద్యోగం పొందేందుకు కష్టపడుతోంది. ‘ఓవర్‌ క్వాలిఫైడ్‌ గృహిణుల గురించి తెలుసుకుని పేరు నమోదు చేసుకున్నాను. నేను దేని కోసం వెతుకుతున్నానో నాకు కచ్చితంగా తెలియదు. కానీ నా అర్హతలు, అంచనాలకు సరిపోయే ఉద్యోగాన్ని కనుగొనడంలో నాకు సహాయం చేస్తున్నారు. వారు ఒక క్లయింట్‌తో ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. నా కెరీర్‌ను మొదటి నుండి ప్రారంభించే అవకాశం నాకు లభించింది’ ఆమె చెప్పింది.
మహిళలను ఆహ్వానిస్తున్నాం
చెన్నైకి చెందిన మార్టెక్‌ కంపెనీ 7 ఈగిల్స్‌ వ్యవస్థాపకులు అష్కర్‌ గోమెజ్‌ ప్లాట్‌ఫారమ్‌లోని ముగ్గురు మహిళలను నియమించుకున్నారు. ‘మహిళలు ఎల్లప్పుడూ కష్టపడి, నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. అలాంటి వారికి ఒక నెలపాటు వివిధ విధులపై శిక్షణ ఇచ్చారు. వర్క్‌ఫోర్స్‌లో మళ్లీ చేరేందుకు మక్కువ చూపుతున్న మహిళల కోసం మేము వెతుకుతున్నాం. ఇప్పటికే సోషల్‌ మీడియాలో వారి నైపుణ్యాలు, ఉద్దేశాలు, సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ నుండి ఎక్కువ మంది మహిళలను నియమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము’ అని ఆయన చెప్పారు. సుధార్‌ ప్లాట్‌ఫారమ్‌లోకి మరింత మంది మహిళలను ఆహ్వానించాలనుకుంటుంది. నైపుణ్యం, రీస్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లపై దృష్టి సారించింది. అలాగే మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించేలా మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నారు. ‘ఇది మరింత మంది మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ ఆమె ముగించారు.
ఆమె ఆసక్తిపై ఆధారపడి
‘మేము ఫ్రీలాన్సింగ్‌తో పాటు ఫుల్‌టైం ఉద్యోగాలు కల్పిస్తాం. అయితే ఇది ఉద్యోగం చేసే స్త్రీ ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆమె తన సమయాన్ని 8-9 గంటలు ఇవ్వగలిగితే ఆమె దరఖాస్తు వేరే విధంగా ప్రాసెస్‌ చేయబడుతుంది. మా వద్ద ప్రక్రియ కూడా సులభం. ఆసక్తి ఉన్న మహిళలు తమ రెజ్యూమ్‌తో పాటు మా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు, వారి అనుభవాలు, ఇతర వివరాలు, కెరీర్‌ బ్రేక్‌కు గల కారణాలను జాబితా చేయవచ్చు. డేటా ఆధారంగా, అవసరమైనప్పుడు మేము వారిని పిలుస్తాము’ అని ఆమె వివరిస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాల కోసం పీహెచ్‌డీలు చేసిన మహిళలు కూడా ఉన్నారని ఆమె అంటుంది. ఇది ఆమె హృదయం ద్రవించేలా చేసింది.
నైపుణ్యం ముఖ్యం
స్త్రీలు ‘పోషకులు, సంరక్షకులు, దాతలు’ అనే నానుడి వల్ల ఆమె పిల్లలను చూసుకోవడం తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తుంది. అధిక అర్హతలు ఉన్న తర్వాత కూడా మహిళలు తమకు తగ్గ పనిని పొందలేకపోతున్నారు. కంపెనీలు ప్రసూతి ప్రయోజనాలను అందజేసినా, పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో పనికి సంబంధించిన నిబద్ధత తక్కువగా ఉంటుందని కొందరు నమ్ముతారు. కొన్ని కంపెనీలు పిల్లలున్న స్త్రీల ప్రొఫైల్‌లను తిరస్కరిస్తాయి. అలాంటి వారికి ఓవర్‌ క్వాలిఫైడ్‌ హైజ్‌వైఫ్స్‌ సహకరిస్తుంది. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో రెగ్యులర్‌ సెషన్‌లను నిర్వహిస్తారు. మహిళలు విరామం తర్వాత కొత్త జ్ఞానం, నైపుణ్యాలను పొందడంలో సహాయపడతారు.

Spread the love