పరిశ్రమల్లో ‘చితి’కి పోతున్నారు!

పరిశ్రమల్లో 'చితి'కి పోతున్నారు!ఏప్రిల్‌ 3న సాయంత్రం 5గంటలకు పెద్ద పేలుడు శబ్దాలు, దట్టమైన పొగలు, అరుపులు, ఆర్తనాదాలు చుట్టుపక్కల గ్రామాల భయాందోళనలు… కనుచూపు మేర ఏం కనిపించటం లేదు. ఏదో పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు పరిశ్రమల వద్దకు ఉరుకులు, పరుగులు. అయితే తమవారికి ఏమైందోననే ఆందోళన ఒకవైపు, మరోవైపు రక్షించేవారి కోసం ఎదరుచూపు? ఇలా ఏడుపులు,పెడబొబ్బలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ అక్కడకి రాలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అనే సందేహం రాకమానదు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో ఇటీవల రియాక్టర్‌ పేలిన ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు మరో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో అత్యధికంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులే ఉన్నారు. పరిశ్రమలో పేలుడు ఘటన జిల్లాలో సంచలనమైంది.ఒక్కసారిగా ప్రజానీకం ఉలిక్కిపడింది. వెంటనే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్పందించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ఉన్నఊళ్లో ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పరిశ్రమల్లో చితికిపోతున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి వేరే మార్గం లేక అరకొర సౌకర్యాల మధ్యే బతుకులీడుస్తున్నారు. వారికి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాల పట్ల యజమానులు నిర్లక్ష్యం చేయడంతో కార్మికులు నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. బతుకుదెరువు కోసం అయినవారితో వచ్చి స్వస్థలాలకు విగతజీవులుగా పోవడం కడు శోచనీయం.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పటాన్‌చెరు పేరుగాంచింది. ఈ పారిశ్రామిక ప్రాంతం మినీ ఇండియాను తలపిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించు కుంటున్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో సంగారెడ్డి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలో పటాన్‌చెరు, పాశమైలారం, బొల్లారం, కాజిపల్లి, గడ్డపోతారం, బోరపట్ల, కొండాపూర్‌, సదాశివపేట, జహీరాబాద్‌తో పాటు 24 పారిశ్రామికవాడలున్నాయి. జిల్లాలో 1300 పైగా భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల్లో 3 లక్షలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నవారే ఎక్కువ. పరిశ్రమల యజమానులు కార్మికుల రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం మూలానా ఈ రెండేండ్లలో జరిగిన ప్రమాదాల్లో 72 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదాలు అత్యధికంగా బల్క్‌ డ్రగ్స్‌ ఫార్మా కెమికల్‌ ఇండిస్టీస్‌లోనే ఉంటున్నాయి. వీటిలోనే 40 వరకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఇప్పటివరకు చనిపోయినవారిలో ఇక్కడే ఎక్కువ. ఈ ఘటనలు మచ్చుకు మాత్రమే. బయటకు రానివి, తెలియని ఎన్నో? 72 మంది కార్మికులు చనిపోయి, 225 మంది క్షతగాత్రులయ్యారని మీడియాలో ప్రసారమవుతున్నా పాలకుల్లో స్పందన లేదంటే కార్మికులంటే వారికి ఎంత చిన్నచూపో అర్థమవుతుంది.
పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల సంక్షేమం మరిచి ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నాయి. 2023 అక్టోబర్‌లో ఐడీఏ బొల్లారంలోని అమరల్యాబ్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా, రోజుకొకరు చొప్పున మరో ముగ్గురు మృతిచెందారు. ఏడాది క్రితం గడ్డ పోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్‌ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. మార్చి 4 నుంచి 10 వరకు జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగానే గుండ్లమాచనూర్‌ పరిధిలోని కొవలెంట్‌ పరిశ్రమలో ప్రమాదాలు జరిగి ఇద్దరు కార్మికులు మృతిచెందారు, మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఈ పరిశ్రమలో మూడుసార్లు ప్రమాదాలు జరిగి ఐదుగురి వరకు చనిపోయారు. గత నెల పాశమైలారం సిఎంహెచ్‌ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఒక కార్మికుడు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే యాజమాన్య లోపాలే ఎక్కువ కనిపించాయి. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులకు వారు ఆదేశాలిచ్చారు. అయినా నిత్యం ఏదో ఓచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. బొల్లారం అమర్‌ కెమికల్‌, పాశమైలారంలోని మోనాక్షి లైఫ్‌ సైన్సెస్‌, టైర్ల పరిశ్రమ, జిన్నారం మండలంలోని మైలాన్‌, లీ ఫార్మాలో భారీ ప్రమాదాలు జరిగాయి. ఫసల్వాది గణపతి షుగర్‌ పరిశ్రమలో కార్మికుడు మృతిచెందగా, బోర్పట్ల అరబిందోలో మరో కార్మికుడు చనిపోయాడు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా గడ్డపోతారం, బొల్లారం, సదాశివపేట, జహీరాబాద్‌ ప్రాంతాలలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. సేఫ్టీ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, యజమానుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రమాదాలు జరిగి విలువైన కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. పర్మినెంట్‌ నేచర్‌ ఆఫ్‌ వర్క్స్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులను పెట్టి పని చేయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ పట్టించుకోవడం లేదు.ఫై˜ౖర్‌ సేఫ్టీ సిబ్బంది కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? యజమానులను ఎందుకు శిక్షించడం లేదు? ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను సస్పెన్షన్‌ చేయకపోవడానికి కారణలేంటి? కార్మికుల రక్షణ గాలిలో దీపమేనా? కార్మికుల కుటుంబాలను నిత్యం వేధిస్తున్న ప్రశ్నలివి.
గడిచిన రెండేండ్ల కాలంలో 72 మంది కార్మికులు చనిపోతే దీనికి బాధ్యులెవరో ఇప్పటివరకు ప్రభుత్వం తేల్చలేదు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్‌ చేయడం లేదు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు చర్యలు తీసుకోని ఏ ఒక్క యాజమాన్యాన్ని శిక్షించింది లేదు. అంటే ఈ ప్రభుత్వం కార్మికుల కోసం కాదు, యజమానులు కోసమే పనిచేస్తున్నట్టు కనబడుతున్నది. ‘ప్రభుత్వం మా చేతులు కట్టేసిందని ఓ జిల్లా అధికారి మాట్లాడటం విచిత్రం’. పరిశ్రమల్లో కార్మికులతో పన్నెండు గంటలు పని చేయించుకుంటూ సేఫ్టీ, కనీస సౌకర్యాలు కల్పించకుంటే పర్యవేక్షించి యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడా కనిపించరేం? ప్రమాదం జరిగినప్పుడు కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలబడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, లేబర్‌ డిపార్ట్మెంట్‌, ఫైర్‌ సేఫ్టీ డిపార్ట్మెంట్‌ సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో ప్రమాదాలు నివారించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఘటనలన్నిటికీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. ఎందుకంటే కార్మికుల చట్టాలను పరిశ్రమ యజమానులకు అనుగుణంగా మార్చడం వల్లనే వారు అధిక పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్రం విధానాల్ని అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉండటం కూడా సరికాదు. ఎవరికి వాళ్లు స్వప్రయోజనాలు చూసు కుంటున్నారు .కానీ కార్మికుల ప్రయోజనాలను గాలికొదిలేశారు. కార్మికులకు న్యాయం జరగాలంటే సంఘటిత పోరాటం తప్ప మరో మార్గం లేదు. ‘పోరాడితే పోయేదేమీ లేదు…బానిస సంకెళ్లు తప్ప’ అన్న కార్ల్‌మార్క్స్‌ మాటలు గుర్తు చేసుకొని జిల్లాలో కార్మికవర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.
గొల్లపల్లి జయరాజు
9490098706

Spread the love