అవినీతికి మూలాధారం బీజేపీ

అవినీతికి మూలాధారం బీజేపీ– సాధారణ ఎన్నికలపై సీపీఐ(ఎం),వామపక్షాల వైఖరి ఏమిటి?
పదేళ్ల మోడీ పాలనలో భారత లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌, అస్తిత్వ ముప్పునెదుర్కొంటున్న తరుణంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమాఖ్య వ్యవస్థ, సామాజిక న్యాయాల్ని కూల్చుతున్న తీరును భారతదేశం చూస్తున్నది. పార్లమెంట్‌లో ఆధిక్యత, రాజ్యాధికారాలను దుర్వినియోగపర్చడం ద్వారా శ్రామికుల హక్కుల్ని హరించేందుకు, అసమాన సమాజాల్లో భారత్‌ను ఒక సమాజంగా మార్చేందుకు, ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించి, విషపూరిత మతతత్వ భావ జాలాన్ని రుద్దడానికి నిరంకుశ, మతతత్వ మోడీ పాలన ఫాసిస్ట్‌ విధానాల్ని ఉపయోగిస్తున్నది. ”ప్రజలమైన మనం” ఓటు ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక, ప్రజాస్వామిక లక్షణాన్ని రక్షించగలమా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.
అవినీతిని సమర్ధించేందుకే ‘ఇండియా’ కూటమి ఐక్యంగా ఉందన్న బీజేపీ వైఖరి పై మీ స్పందన ఏమిటి?
ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. ‘ఇండియా’ కూటమిలో కొన్ని పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు అవినీతి కేసులు బనాయిస్తే, ఆ నాయకులు బీజేపీలో చేరిన వెంటనే ఆ ఆరోపణలన్నీ మాయమవుతాయి. దేశంలో అవినీతికి మూలం, మోడీ నాయకత్వంలోని బీజేపీ అనేది వాస్తవం.
వామపక్షాలు, దాని ఎన్నికల ఎత్తుగడలు, బీజేపీ ఓటమి లక్ష్యంలో తమ పాత్రను పోషిస్తాయా? కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య పోటీ, పశ్చిమ బెంగాల్‌లో త్రిముఖ పోటీ ఉంది. ఇవి, బీజేపీని ఓడించే లక్ష్యాన్నెలా నెరవేరుస్తాయి?
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రిపబ్లిక్‌ లౌకిక ప్రజాస్వామిక స్వభావాన్ని కాపాడేందుకు, బీజేపీని ఓడించే లక్ష్యంతో ఇటీవల ‘ఇండియా’ కూటమి, ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య వైరుధ్యాలున్నాయి. అయితే అలాంటి వైరుధ్యాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఇలాంటి వైరుధ్యాల కారణంగానే బీజేపీ బలహీనపడి, ఎన్నికల్లో ఓటమి పాలైంది. రాజకీయాలంటే అంక గణితం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. కేరళలో సీపీఐ(ఎం) నేతత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతత్వంలోని యూడీఎఫ్‌ మధ్యనే పోటీ నెలకొన్న ఫలితంగా బీజేపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి మాత్రమే లబ్ది చేకూర్చుతుంది. త్రిముఖ పోటీలోని వామపక్షాలు-కాంగ్రెస్‌ల కలయిక బీజేపీ, తణమూల్‌ కాంగ్రెస్‌లను ఎదుర్కొంటుంది. ఈ త్రిముఖ పోటీ, బీజేపీ ప్రయోజనం పొందకుండా అడ్డుకుంటుంది. ఢిల్లీలో, ఇతరచోట్ల ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన ఉన్నప్పటికీ పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు విడిగా పోటీచేస్తున్నాయి. ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఓటమికి ఎన్నికల సర్దుబాట్లు జరుగుతున్నాయి.
జేడీ(యు), ఆర్‌ఎల్డీ, పల్లవి పటేల్‌ అప్నాదళ్‌, ప్రకాష్‌ అంబేద్కర్‌ వీబీఏల నిష్క్రమణ, ఎన్సీపీలోని చీలికను మీరు పెద్ద తిరోగమనంగా చూస్తారా? ఎంత వరకు విపక్షాల కూటమి పుంజుకుంటుంది?
‘ఇండియా’ కూటమి నాయకులంతా కలిసి ఉండడం వల్ల (చాలా ముఖ్యం అయినప్పటికీ) మాత్రమే ఈ కూటమి ఐక్యంగా ఉండటం కాదు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ప్రజల మధ్య ఐక్యతే ఈ కూటమి ఐక్యతలోని ముఖ్యమైన అంశం. దీనిని ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో చూశాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రజల ఆకాంక్షే, ఎమర్జెన్సీ ప్రతిఘటనను బలోపేతం చేసి, అన్ని పార్టీల నాయకులు ఏకం అయ్యేలా ఒత్తిడి తెచ్చింది. ఆ దష్టితో చూస్తే, ‘ఇండియా’ కూటమి క్షేత్రస్థాయి నుంచి పుంజుకుంటున్నది. ”భారత్‌ ఐక్యంగా ఉంటుంది, ‘ఇండియా’ గెలిస్తుంది” అనే ప్రజాదరణ పొందిన నినాదమే దీనికి నిదర్శనం.
‘ఇండియా’ కూటమికి ఒక ఉమ్మడి మ్యానిఫెస్టోను తీసుకొచ్చే అవకాశం ఉందా? అత్యంత ధనికుల పైన, సంపదపైన పన్నులు, వారసత్వ పన్ను విధించాలనీ, ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ గురించి, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు లాంటి సూచనలు మీ మ్యానిఫెస్టోలో సూచించారు. మీ భాగస్వామ్య పార్టీలు వీటిని అంగీకరించకపోవచ్చేమో?
‘ఇండియా’ కూటమిలోని పార్టీలకు ప్రత్యేకమైన మ్యానిఫెస్టోలుండడం సహజం. ఎన్నికలు సమీపించే సమయానికి కేంద్రంలో ఏర్పడబోయే ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం చేపట్టే కనీస ప్రాథమిక చర్యలతో ఒక ఉమ్మడి ఎజెండాను విడుదల చేస్తారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌, 1999లో ఎన్డీయే లేదా 2004 లో యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడినపుడు జరిగిన విధంగానే, ఒకసారి ప్రభుత్వం ఏర్పడినపుడు ఒక ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందిస్తారు. కొన్ని పార్టీలకు, కొన్ని సమస్యలపై ప్రత్యేక వైఖరులు ఉన్నప్పటికీ ‘ఇండియా’ కూటమిలోని పార్టీలన్నీ కలిసి ఒక అంగీకారానికి వచ్చిన కనీస ఉమ్మడి ఒప్పందం ఒకటి ఉంటుంది.
ఈడీ చర్యల్ని నిరోధించాలని, పీఎంఎల్‌ఏ, ఉపా చట్టాల్ని రద్దు చేయాలని మీ పార్టీ మ్యానిఫెస్టోలో పిలుపునిచ్చింది. ఈ రెండు చట్టాల్ని యూపీఏ పాలనలో మరింత కఠినతరం చేశారని మీ పార్టీ గుర్తించింది. అవినీతిని, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మాత్రమే ఈ చట్టాల్ని వినియోగిస్తున్నట్టు బీజేపీ చెపుతున్నది. ఈ చట్టాల దుర్వినియోగం గురించి మాత్రమే ‘ఇండియా’ కూటమి ఆందోళన చెందుతుందా? లేక దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు నిబంధనల పుస్తకం నుండి వాటిని తొలగించాలని కోరుకుంటుందా?
మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణల ద్వారా ఈ రెండింటినీ ఆయుధాలుగా ఉపయోగించారు కాబట్టి ఈడీ చర్యల్ని నిరోధిస్తూ, పీఎంఎల్‌ఏ, ఉపా చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది.ఈ రెండు చట్టాలు (బెయిల్‌ పొందడానికి) అనాగరికమైన నిబంధనలు కలిగి ఉన్నాయి. ఈ రెండు కలిసి న్యాయశాస్త్ర సూత్రాన్ని, న్యాయాన్నందించే ప్రాథమిక నియమాన్ని తలకిందులు చేశాయి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేంతవరకు, నేరం రుజువయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషి అని మనకు న్యాయశాస్త్రం తెలియ జేసింది. నేడు, ఒక వ్యక్తి తాను నిర్దోషి అని రుజువు చేసుకునేంత వరకు, దోషిగానే ఉంటాడు. ఈ కారణంగానే ఎలాంటి అభియోగాలు మోపబడకుండానే ప్రజలు జైళ్ళలో మగ్గుతున్నారు. భీమా కోరేగావ్‌ కేసులో వలె ఛార్జ్‌ షీట్‌ వేయకుండానే అనేకమంది పౌరులు సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంటున్నారు. కాబట్టి ఈ అనాగరిక నిబంధనలు పోవాలి.
2024లో భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయా? ఈ సవాల్‌ను ఎదుర్కోవడంలో ప్రతిపక్షాల వ్యూహం ఏమిటి?
అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే స్వేచ్ఛగా, నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన అంశం. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడం ద్వారా దానికి ఇప్పటికే తీవ్ర విఘాతం కలిగింది. ఇది బీజేపీకి భారీ ప్రయోజనాల్ని సమకూర్చింది. ఎన్నికల బాండ్లతో పాటు ఎలాంటి లెక్కలు, ఆడిట్‌ లేని, పూర్తి పారదర్శకత లేని ”పీ.ఎం కేర్స్‌” నిధులున్నాయి. ఇది ప్రధాని ఆధ్వర్యంలో ఒక ప్రయివేట్‌ నిధిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధి 10 వేల కోట్ల రూపాయలున్నట్లు సమాచారం. ఆ విధంగా బీజేపీ అవసరానికి మించిన ప్రయోజనాలు పొందింది. శక్తివంతులకు ప్రవర్తనా నియమావళి నమూనా వర్తించే పరిస్థితి లేదు.
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా నిధులను తీసుకోబోమని మీ పార్టీ ప్రకటించింది.దానికి కారణం ఏమిటి?
2017లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆర్థిక బిల్లులో భాగంగా చట్టవిరుద్ధంగా, రహస్యంగా పార్లమెంట్‌ ముందుకు తెచ్చినప్పుడు సీపీఐ(ఎం) వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఇతరులతో కలిసి నేను రాజ్యసభలో ప్రతిపక్షాన్ని నడిపించాను. దీనిని మేము రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేయడంగా పరిగణించి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఇలాంటి ప్రక్రియ ద్వారా నిధులను సమకూర్చుకునే పార్టీ కాదు సీపీఐ(ఎం) అని ప్రకటించాం.
ఎన్నికల బాండ్ల నిషేధం అందరికీ సమాన అవకాశాల కల్పనకు హామీ ఇస్తుందా? లెక్కల్లో చూపించని డబ్బు కూడా భారీగానే ఉందనే భావన ఉంది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగవిరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాలి. అయితే ఇంతకుముందే ఈ తీర్పు వచ్చి ఉండాల్సింది. పథకం వివరాలు స్పష్టంగా నిర్ధారించిన అంశాలు:
ఏ) ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి ఏజెన్సీల దుర్వినియోగం ద్వారా దోపిడీకి పాల్పడటం,
బీ) భారీ విరాళాలకు ప్రతిఫలంగా ప్రాజెక్టులు, అడ్డంకుల తొలగింపులు మంజూరుచేసే ప్రేమపూర్వక ఒప్పందాలు,
సీ) అనేక సంస్థలు తమ ఆస్తి అప్పుల పట్టికలో చూపిన లాభాల కంటే అనేక రెట్లు ఎన్నికల బాండ్లు కొనడంతో భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఈ మూడు అంశాలపై వీలైనంత త్వరలో స్వతంత్ర సంస్థల ద్వారా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) కోరుతుంది.
ఆదాయపు పన్నుల శాఖ మీ పార్టీకి నోటీసులు పంపడం దైనందిన చర్యల్లో భాగమా లేక వేధించే ఉద్దేశ్యమా?
సీపీఐ(ఎం) తిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను స్తంభింపజేయడం, ఎన్నికల సమయంలో పార్టీని వేధించేందుకు తీసుకున్న ముందస్తు చర్య. ఈ ఖాతా వివరాలు రాష్ట్ర స్థాయిలో ఏకీకతం చేయబడిన దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఖాతాల్లో భాగంగా ఉంది. ఇవి జాతీయ స్థాయిలో ఆదాయ పన్నుల శాఖకు, భారత ఎన్నికల కమిషన్‌కు చట్ట ప్రకారం సమర్పించడం జరుగుతుంది, వాటిని వారి వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. ఏడాది పొడవునా ఎలాంటి ఆక్షేపణలు కూడా వ్యక్తం కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఇలా జరగడం రాజకీయ ప్రేరేపితంగా అర్థం చేసుకోవాలి. త్రిస్సూర్‌ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేయడం యాదచ్ఛికమా? ఖాతా స్తంభింపచేసిన చర్యను ఖండిస్తూ, ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలకు భారత ఎన్నికల కమిషన్‌ ఎలా అనుమతించి, ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాల కల్పనకు ఎందుకు విఘాతం కలిగిస్తుందో అడుగుతూ లేఖను కూడా రాశాం.
(”ఫ్రంట్‌ లైన్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451

Spread the love