షహనాయి సందేశం

Shahnai's messageహిందువుల శుభకార్యాలన్నింటా ఓ మనోరంజక మైన మంగళవాద్యం తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటుంది. చాలా కుటుంబాల్లో పూజలు చేస్తున్నప్పుడు కూడా ఏ సెల్‌ఫోన్‌ నుంచో లేదా ఏ సౌండ్‌ సిస్టమ్‌ నుంచో ఈ ప్రఖ్యాత సంగీత స్వరఝరి సర్వసాధారణం. విశేషమేమి టంటే అది సచ్చా ముసల్మాన్‌, భారతరత్న ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ షహనాయి వాద్యం. ఇదే కదా మతతత్వానికి తావులేని వ్యక్తిగత మతాచరణ. ఇలా స్వచ్ఛంగా, విశ్వాసంతో వ్యక్తిగత మతాచరణ చేసే వాళ్ళు ఎవరూ మతతత్వవాదులు కాదు, కాలేరు. వారి దృష్టి దేవుడి మీదనే ఉంటుంది తప్ప ద్వేషం మీద, ద్వేషపూరితమైన ప్రచారం మీద ఉండదు. ఎవరికైనా ఈ విద్వేష ప్రచారయావ ఉందంటే వారు మతతత్వవాదిగా మారుతున్నారని అర్థం. నిజానికి ఈ సమాజంలో మతాచారకులే ఎక్కువ. అయినా నేడు మతతత్వం పెచ్చరిల్లు తుండటం ఒక విషాదం. ఈ విషాదానికి కారణం మతరాజకీయాలే అనే అభిప్రాయా లను కాదనలేం. సాక్షాత్తూ ప్రధానమంత్రే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతుంటే దేశం ఎటుపోతుంది?
ఈ దేశానికి మత ప్రమేయం లేని రాజకీయాలను నిర్దేశిస్తోంది భారత రాజ్యాంగం. అందుకు భిన్నంగా సాగుతోంది ప్రధాని వ్యవహారం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ప్రసంగాలను పరిశీలించిన వారెవరికైనా ఈ విషయం బోధపడుతుంది. ప్రత్యేకించి ఈ ఎన్నికల సమయంలోనే వచ్చిన శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో ఈ తరహా విద్వేష ప్రసంగాలకు ఆయన మరింత పదును పెట్టారు. ”రాముడిని వ్యతిరేకించే వారంతా ఓట్లడగడానికి వస్తున్నారు” అంటూ పదేపదే వల్లించారు. ప్రతిపక్షాలన్నీ అయోధ్య రామాలయ నిర్మాణానికి, ఇటీవలి ప్రాణప్రతిష్టకు వ్యతిరేకమైనవిగా ప్రవచిస్తున్నారు. నిజానికి ప్రతిపక్షాలేవీ రాముడికి వ్యతిరేకం కాదు. మందిర నిర్మాణానికి ముందున్న వివాదాలు, ఆలయప్రతిష్ట జరిగినతీరు పట్లే అభ్యంతరాలూ అభిప్రాయాలూ ఉన్నాయి తప్ప… రాముడి పట్ల ఎవరికీ ఏ వ్యతిరేకతా లేదు. ఉన్నదల్లా రాముడు రాజకీయం కాకూడదన్న ఆకాంక్ష మాత్రమే. కానీ దీనిని వక్రీకరిస్తూ ప్రజల్లో చీలికలు తీసుకొచ్చేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా ప్రధాని ప్రచారం సాగిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాముడిని ఒక ప్రచార అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే కాదు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కూడా పూర్తి విరుద్ధం. దీన్ని గుర్తుచేస్తూ సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ఎన్నికల సంఘానికి ఆధారాలతో కూడిన లేఖ రాశారు. ఇప్పటివరకూ చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం ఈ లేఖకు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇప్పుడు కేవలం ఆలయాలే కాదు, ఆహారం కూడా రాజకీయ ప్రచార సాధనంగా మారడం వైచిత్రి! అప్పుడెప్పుడో ”జబ్‌ తక్‌ సమోసా మే రహేగా ఆలూ, బీహార్‌ మే రహేగా లాలూ” అంటూ లాలూప్రసాద్‌ యాదవ్‌ చమత్కరించారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆహారంలో కూడా మతకోణాలు వెతకడం, ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం ప్రధానికి పరిపాటిగా మారింది. దక్షిణాది ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉప్మా తనకు ఇష్టమైన తమిళ ఆహారం అని, పొట్టలో తేలికగా, సులభంగా జీర్ణం కావడానికి తను పొంగల్‌ను కూడా ఇష్టపడతానని చెపుతారు. ఉప్మా అంటే తనకు చెప్పలేనంత ఇష్టమున్నట్టు ఫోజులిస్తారు. దానిని ఆయన పరివారం సామాజిక మాధ్యమాలలో తెగ ప్రచారం చేస్తుంది. కానీ బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తన ప్రచారంలో రోటీ, చేపలు తింటున్న వీడియోను పోస్ట్‌ చేయడంపై మాత్రం దాడి చేస్తుంది. నవరాత్రులలో మాంసాహారం తినడం హిందూ ధర్మానికి అపరాధమని ఆరోపిస్తున్నది. (ఈ వీడియో నవరాత్రులకు ముందు చిత్రీకరించినదని తేజస్వి స్పష్టం చేశారు) తానేమో స్వచ్ఛమైన శాఖాహారినంటూ ఉప్మా తింటూ ప్రధాని మోడీ ఫోజులిస్తారు, ఈశాన్య రాష్ట్రాల్లోని బీజేపీ నేతలంతా గొడ్డు మాంసాన్ని తెగ లాగించేస్తారు. దీనిపై మాత్రం ఆయన నోరు విప్పరు.
ఆహారం విషయంలోనైనా ఆచారాల విషయంలోనైనా ఎవరి ఇష్టాలు వారివి. కాదనే హక్కు ఎవరికీలేదు. కానీ ప్రత్యర్థులను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ఏ అంశాన్నీ వదలడం లేదు. అవినీతి, అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ చేస్తున్న మతరాజకీయమిది. ఈ మతతత్వానికి ఏ మతస్తులూ బలికాకూడదు.
భారతరత్న ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ హజ్‌ యాత్ర చేసిన సచ్చా ముసల్మాన్‌. కానీ ఉదయాన్నే గంగా నదిలో స్నానం చేసి, తన షహనాయికి ఆ నదీ జలాలతో సంప్రోక్షణ చేసిన తర్వాతనే రోజువారీ కార్యక్రమాలు మొదలు పెట్టేవారు. ఒకసారి అమెరికాలో నిర్వహించిన కచేరీలో పాల్గొన్న కొందరు సంపన్నులు ”ఉస్తాద్‌… మీరు ఇక్కడనే ఉండిపోండి. మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం” అన్నారట. దానికి ఆయన ”మీరు నా కోసం స్వర్గాన్నే సృష్టించగలరు. కానీ కాశీలో ఉన్న గంగా మాయిని తేగలరా?” అన్నారట. గంగా మాయితో హిందువులకే కాదు బిస్మిల్లాఖాన్‌ లాంటి సచ్చా ముసల్మాన్‌లదీ విడదీయలేని అనుబంధం. ఇదే భారత దేశ సమ్మిళిత సహజీవన సంస్కృతి. మతతత్వం మన సంస్కృతి కాదు. శతాబ్దాలుగా దేశం సంతరించుకున్న ఈ విలువలు ఇవ్వాళ విచ్ఛిన్నమవుతున్నాయి. వీటిని కాపాడుకోవడానికి, సమున్నతంగా నిలబెట్టుకోవడానికి ఈ ఎన్నికలు ఓ అవకాశం.

Spread the love