మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి

పిల్లల్ని పాఠశాలలకు, కళాశాలలకు పంపించే తల్లిదండ్రులారా.. పరీక్షలు అయిపోయాయి. వాటి ఫలితాలు రాకముందే మీరు మీ పిల్లలకి ధైర్యమివ్వండి, ఎందుకంటే మనం ప్రతి ఏడాది చూస్తున్నదే. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజే ఆత్మహత్యల న్యూస్‌ టీవీల్లో, తెల్లవారి పేపర్లలో చూస్తున్నాం. దయచేసి పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారని తిట్టడం గాని, మార్కులు తక్కువ వచ్చాయని కోప్పడటం గాని, అలాగే ర్యాంకులు రాలేదని పిల్లల్ని అవహేళన చేయడం గాని, ఇలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే మార్కులే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిల్‌ అయినంత మాత్రాన మన జీవితమే ఆగిపోదు. ఇంకా చాలా దారులు ఉన్నాయనే దైర్యాన్ని పిల్లలకివ్వండి. ఇదంతా గురువులే చెప్పాలి కదా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వేసవి సెలవుల్లో గురువుల దగ్గర పిల్లలు ఉండరు, తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు. కాబట్టి ఇది మన బాధ్యత. ‘నేను ఫెయిల్‌ అయినా మా తల్లిదండ్రులు నన్నేమనరు’ అనే విశ్వాసం పిల్లలకు కలిగేలా చేయాలి. ఉదాహరణకు సచిన్‌ టెండూల్కర్‌ టెన్త్‌ ఫెయిల్‌ అయ్యాడు. కానీ ఏనాడు బాధపడలేదు. తన పని తను చేస్తూ పోయాడు, ఈరోజు ప్రపంచంలోనే క్రికెట్‌ లో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్రలో నిలిచాడు. అత్యున్నత భారతరత్న కూడా అందుకున్నాడు. ఇలాంటి క్రీడాకారులు కావచ్చు, లేదా చదువులేని వారు సాధించిన విజయాలు కావచ్చు. వారి గురించి చెప్పండి. ఈ పరీక్షల్లో పాస్‌ అవ్వకపోతే మళ్లీ రాసి పాస్‌ కావచ్చనే విషయాన్ని వారికి అర్థం చేయించగలిగితే ఆత్మహత్యలనేవి ఉండవు. మీరు సంపాదించిన ఆస్తి ఎవరికోసం, మీ పిల్లల కోసం, మీరు తీసుకున్న కారు, బైక్‌ ఎవరికోసం, అంతా మీ పిల్లల కోసమే కదా? మీ పిల్లలు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే చుట్టు పక్కల వారి దగ్గర, బంధువుల దగ్గర అవమాన పడాల్సి వస్తుందని వారికి చెబితే గనుక తల్లిదండ్రులకు తానే అవమానం చేశానని సుసైడ్‌ చేసుకునే అవకాశాలుం టాయి. అందుకని జీవితంలో ఏదైనా సాధించాలంటే చదువుక్కొటే ప్రాముఖ్యం కాదు. మనిషన్నాక ఏదో ఒక టాలెంట్‌ కచ్చితంగా ఉంటుంది. దాన్ని వారినుంచి వెలికితీసి ఆ రంగంలోనే రాణించేలా ప్రోత్సహించాలి. లేదంటే ఎందులో వీక్‌గా ఉన్నాడో, ఎక్కడ ఫెయిల్యూర్‌ కనిపిస్తుందో దాని పట్ల శ్రద్ధ పెరిగేలా చూడాలి. కానీ పరీక్షలో ఫెయిలైతే ఇంటికి రావద్దని, తలదించే పనులు చేయద్దని, మంచి ర్యాంకు రాకుంటే బాగుండదని హెచ్చ రిస్తే గనుక వారి మనసుల్లో అవి నాటుకు పోతాయి. ఒకవేళ పరీక్షల్లో తప్పితే తల్లిదండ్రులు ఏమంటా రోననే భయం వారిని వెంటా డుతుంది. ఆ ఆందోళన నుంచే ఏదైనా అఘాయిత్యానికి ఒడిగడితే కన్నీటిశోకం తప్ప మిగిలేది ఏమీ ఉండదు. అందుకే పిల్లల మనసును గాయపరచకుండా వారిని అర్థం చేసుకుని మనల్ని వారు అర్థం చేసుకునేలా వెన్నుతట్టి ప్రోత్సహించండి.
– జాడే లక్ష్మణ్‌
9542390483

Spread the love