ఆహా… పదేండ్లు ఏమీ ‘అవినీతిలేని’ పాలన!

ఆహా... పదేండ్లు ఏమీ 'అవినీతిలేని' పాలన!2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇప్పటివరకు పదేండ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అనేక అవినీతి చర్యలకు, కుంభకోణాలకు పాల్పడింది. మేము అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలనందిస్తాం’ అని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని బీజేపీ,ఎన్డీయే ప్రభుత్వం పదేండ్ల తర్వాత కూడా ”మేము ఎటువంటి అవినీతిమచ్చలేని, నీతివంతమైన పాలన అందించాము, తిరిగి మాకే పట్టం కట్టండి” అని ప్రచారం చేసుకుంటున్నది. నిజంగా పదేండ్లపాటు జరిగిన పాలన అవినీతి లేని పాలనేనా? అనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
1.”మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో అక్రమం గా దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి, ప్రతి భారతీయుని ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాం” అని ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిన మోడీ ఒక్క రూపాయి నల్లధనాన్ని దేశానికి తిరిగి రప్పించలేదు. సరికదా కనీసం నల్లధనం దొంగల పేర్లు కూడా వెల్లడించలేదు. నిజంగా అవినీతి పరులతో కుమ్మక్కవ్వని ప్రభుత్వమైతే అవినీతిపరులను ఆ విధంగా వదిలేసేదా? కనుక అవి నీతి లేని పాలన స్వచ్ఛమైన పాలన అందించామని చెప్పుకోవడమంటే నేతి బీరకాయలో నెయ్యి చందమే కదా.
2.దేశంలో అవినీతికి పాల్పడిన, పాల్పడుతున్న అనేకమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలపైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా దాడులు చేయించి, బెదిరించి, భయపెట్టి ఆ తర్వాత వారిని తమ పార్టీలో చేర్చుకొని నీతివంతులుగా సర్టిఫికేట్‌ ఇవ్వడమే కాకుండా, తదుపరి వారిపై ఇతరత్రా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా వదిలేశారు కదా! గురువింద గింజ సామెత గుర్తురావడం లేదా?
3. ”అవినీతి, కుంభకోణాల మయంగా మారిన యూపీఏని ఓడిస్తేనే దేశానికి విముక్తి” అని ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన బీజేపీ, మోడీ ప్రభుత్వం మొదటి విడత పాలనలోనే ఎలక్టోరల్‌ బాండ్స్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా అవినీతిని చట్టబద్ధం చేసింది. ఈ బాండ్ల ద్వారా బీజేపీకి మొత్తం రూ.8252 కోట్లు సమకూరాయి. అవినీతిపరుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి, పెద్ద మొత్తంలో నిధులను దండుకున్నదనే విషయం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్‌బీఐ, ఎలక్షన్‌ కమిషన్‌ బయటపెట్టిన వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
సహజంగా విరాళాలంటే స్వచ్ఛందంగా ఇచ్చేవి. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు గురైన 41 కంపెనీల నుంచి బీజేపీకి 2471 కోట్ల రూపాయలు విరాళాలు అందాయి. వాటిలో 1698కోట్లు దాడుల అనంతరం మూడునెల్లలోపు ఇచ్చినవే. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో చందాలు ఇచ్చిన కంపెనీలకు మూడు లక్షల 70 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు బీజేపీ ప్రభుత్వాలు కట్టబెట్టాయంటే క్విడ్‌ ప్రోకో ఏమేరకు జరిగిందనేది అర్థం కావడం లేదా! ఇంతకాలం అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందించామని చాతి చరుచుకునే వారి బండారం తేటతెల్లమైంది కదా! ఫార్మాస్యూటికల్‌ రంగానికి చెందిన 35 కంపెనీలు బీజేపీకి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విరాళాలను అందించాయి. పరిశోధనలో ఆ కంపెనీలు నాసిరకం మందులను తయారుచేస్తున్నట్లు తేలింది. అవి చేస్తున్న తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి ఈ విరాళాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు పొందిన కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడింది. నిఫ్టీ, సెన్సెక్స్‌ లాంటి లిస్టెడ్‌ కంపెనీలు తాము కొన్న ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌లో 81 శాతం బీజేపీకి విరాళంగా ఇచ్చాయి. మరో 35 బూటకపు(షెల్‌) కంపెనీలు 143 కోట్ల విరాళాలు అందజేశాయి. అసలు లాభాలే రాని కంపెనీలు, తమకొచ్చిన లాభాలకన్నా కూడా ఎక్కువగా విరాళాలు అందించిన కంపెనీలు ఉన్నాయంటే ఈ వ్యవహారంలో ఎంతటి అవినీతి, క్విడ్‌ ప్రోకో జరిగిందో ఊహించుకోవచ్చు.
ఎలక్టోరల్‌ బాండ్స్‌తో సంబంధం లేకుండానే 2013-23 సంవత్సరాల మధ్య వివిధ రాజకీయ పార్టీలకు అందిన 7762 కోట్ల విరాళాల్లో ఒక్క బీజేపీకే 5000 కోట్ల రూపాయలందాయి. ఇంకా పీఎం కేర్స్‌ ఫండ్‌ పేరుతో కూడా బీజేపీ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను కూడా బయటకు లాగాల్సి ఉంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా ఒక్క బీజేపీకే లబ్ది చేకూరలేదు, అన్ని పార్టీలకు విరాళాలు అందాయి, కాబట్టి ఇది అవినీతి కాదని సమర్ధించుకోవడం గర్హనీయం. ఏమైనా ఈమొత్తం వ్యవహారంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా విరాళాలు తీసుకోని కమ్యూనిస్టు పార్టీల పట్ల జనానికి విశ్వాసం పెరిగింది. ‘మేము అవినీతి లేని పాలన అందించాం’ అని చెప్పుకునే పాలకుల నిజస్వరూపం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బహిర్గతమయ్యాక వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఉదయ భాస్కర్‌, 9490300669

Spread the love