– రైతులపై అణచివేతకు ఎస్కేఎం ఖండన
– చర్చలు కోరుతూ ప్రధాన మంత్రికి లేఖ
– ఫిబ్రవరి 16న దేశవ్యాప్త నిరసనకు పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు సంఘాల ఢిల్లీ చలో మార్చ్‌ను నిరోధించడానికి మోడీ ప్రభుత్వం అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవడాన్ని, లాఠీచార్జి, రబ్బరు బుల్లెట్, టియర్ గ్యాస్ షెల్లింగ్, సామూహిక అరెస్టులకు పాల్పడటాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తీవ్రంగా ఖండించింది. రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ వేయడానికి డ్రోన్లను ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 16న దేశంలోని అన్ని గ్రామాలలో పంజాబ్‌లో రైతులపై జరిగిన దాడిని తీవ్రంగా నిరసించాలని, దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక/ సెక్టోరల్ సమ్మెను మరింత భారీగా విజయవంతం చేయాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. రైతుల శాంతియుత పోరాటంపై దాడి చేసేందుకు పోలీసులను, సాయుధ భద్రతా బలగాలను దింపడం పట్ల మోడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొంది. ప్రజాస్వామ్య సమాజంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధిని కాపాడే డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
తమ నిజమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చిన ప్రజలను ప్రభుత్వానికి, దేశానికి శత్రువులుగా పరిగణించవద్దని ఎస్కేఎం మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైతుల ప్రధాన డిమాండ్ ఎంఎస్పీ (సిం50 శాతం) 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ, ప్రస్తుత ప్రధానమంత్రి వాగ్దానం చేసి పదేండ్లు అయినా అమలు చేయలేదని విమర్శించింది.
తక్షణమే బలగాలను ఉపసంహరించుకోవాలని, ఢిల్లీ చలో నిరసనను నిర్వహించి రైతుల హక్కులను కాపాడాలని, రైతులు, కార్మికుల పోరాటాలను చర్చలతో పరిష్కరించాలని కోరుతూ ఎస్కేఎం ప్రధానికి లేఖ రాసింది. ఉమ్మడి డిమాండ్లపై ఐక్య సమస్య ఆధారిత పోరాటాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని భావసారూప్య సంఘాలకు విజ్ఞప్తి చేసింది.
ప్రధాని మోడీకి ఎస్కేఎం లేఖ
”రైతులు, కార్మికుల 21 పాయింట్ల డిమాండ్ చార్టర్‌కు మద్దతుగా ఫిబ్రవరి 16న పారిశ్రామిక / సెక్టోరల్ సమ్మె, గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా తాము మీకు మరోసారి లేఖ రాస్తున్నాము. మీరు 2021 డిసెంబరు 9న ఎస్కేఎంకిచ్చిన వాగ్దానం అమలు చేయాలి” అని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది.
”అన్ని పంటలకు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీ సి2ం50 శాతంతో సేకరణకు చట్టపరమైన హామీ, ఇన్పుట్ ఖర్చుల తగ్గింపుతో రుణమాఫీ, కొత్త విద్యుత్ బిల్లు ప్రకారం విద్యుత్ చార్జీల పెంపు లేదు, స్మార్ట్ మీటర్లు లేవు, వ్యవసాయానికి, గృహవసరాలకు, దుకాణాలకు ఉచిత 300 యూనిట్ల విద్యుత్, ప్రతి పంటకు జరిగిన నష్టానికి చెల్లించాల్సిన సమగ్ర పంట బీమా, ప్రధాన నిందితుడు అజరు మిశ్రా టెనిని జైలుకు పంపడంతో సహా లఖింపూర్ మారణహౌమానికి పాల్పడిన వారికి శిక్ష, పింఛన్లను నెలకు రూ. 10,000కు పెంచడం” వంటి సమస్యలను పరిష్కరించాలి.
”ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, వాటిని సకాలంలో పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసి నిర్వహించడంలో మీ ప్రభుత్వం విఫలమైంది. రైతులను ఇబ్బంది పెట్టే సమస్యలను పరిష్కరించే మీ రాజ్యాంగ బాధ్యత నుండి తప్పించుకోవడానికి రైతుల ఉద్యమం విభజించడానికి ప్రచారం చేయడానికి ఇతర సంఘాలతో మాట్లాడటానికి ప్రయత్నించిన మీ మంత్రులు ఎస్‌కెఎంతో మాట్లాడటానికి వెనుకడుగు వేశారు. రైతుల శాంతియుత నిరసనలపై మీ ప్రభుత్వం, హర్యానా, యూపీ నేతృత్వంలోని బీజేపీ అణచివేత చర్యలకు వడిగట్టాయి. సాధారణ రైతులపై భయానక వాతావరణాన్ని సృష్టించాయి” అని పేర్కొంది.
”పంజాబ్ సరిహద్దులో లాఠీచార్జి, రబ్బరు బుల్లెట్, బాష్పవాయువులను ప్రయోగించారు. అనేక మంది గాయపడిన రైతులపై జరిగిన అణచివేతను మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. దేశంలో కిసాన్ ఉద్యమం ఐక్యంగా, ఏక దృష్టితో ఉందని, అలాంటి నిరంకుశ, మితిమీరిన చర్యలను ప్రతిఘటిస్తుందని స్పష్టం చేయాలనుకుంటున్నాము”.
” కేంద్ర బడ్జెట్లు, శాఖాపరమైన కేటాయింపులతో వ్యవసాయంలో కార్పొరేట్ జోక్యానికి చురుగ్గా మద్దతిస్తున్న నేపథ్యంలో రైతుల దుస్థితిపై సానుభూతి చూపాలని ప్రధానిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఎస్కేఎం లేవనెత్తిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. దేశంలోని రైతుల డిమాండ్లను పరిష్కరించేందుకు చర్చను ప్రారంభించాలి” అని కోరింది.
”ఢిల్లీ చలో రైతుల నిరసనను అడ్డుకోవడం, అణచివేతకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ చర్యలపై మేము విచారం వ్యక్తం చేస్తాం. పంజాబ్ సరిహద్దులోని హైవేలపై కాంక్రీట్ బారికేడ్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలు ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ నిలిపివేయడం, 144 సెక్షన్ విధించడం. భయానక వాతావరణాన్ని సృష్టించడంతో అడ్మినిస్ట్రేషన్ సరిహద్దులను అడ్డుకుంది. నిరసనకారులను దేశ శత్రువులుగా భావించారు. పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు హర్యానా-పంజాబ్ సరిహద్దులను భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుల వలె అడ్డుకోవడం. ఢిల్లీ చలో రైతుల నిరసనలో పాల్గొనకుండా భోపాల్ వద్ద కర్ణాటక రైతులను అరెస్టు చేసి దాడులు చేయడంపై దారుణం” అని ఎస్కేఎం పేర్కొంది. ”రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన సమస్య ఆధారిత ఐక్య ఉద్యమంగా ఎస్కేఎం ఆవిర్భవించింది. ఈ ప్రక్రియలో రైతులు ఐక్యంగా ఉండి, కార్మికులు, ట్రేడ్ యూనియన్ ఉద్యమం క్రియాశీల మద్దతుతో మేము విజయం సాధించాం” అని తెలిపింది.