నవతెలంగాణ – ఆర్మూర్
దేశవ్యాప్తంగా వివిధ సెక్షన్ల ప్రజానీకం తమ మనుగడకోసం జరిపే పోరాటాలకు సంఘీభావంగా భారత అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన ఆట మాట పాటలతో ప్రజలను చైతన్యపరిచాలని భారత కార్మిక హమాఖ్య. (ఐ.ఎఫ్.టి.యు-శ్రామిక స్పందన) జాతీయ కార్యదర్శి షేక్ షావలి సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి అనుభంధ సాంస్కృతిక కళాకారులకు సూచించారు. ఆర్మూర్ రాజు అధ్యక్షతన శుక్రవారం మేడ్చల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో భారత అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(బీ ఏ.సి.ఎఫ్) ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇఫ్టూ జాతీయ కార్యదర్శి షేక్ షావలి హాజరై ప్రసంగించారు. ప్రజలపాట ప్రజా సంస్కృతిని ప్రతిబింబంచేలా ఉండాలని కోరారు. కామ్రేడ్ మావో అన్నట్లు ఎర్ర సైన్యానికి ఎంత ప్రాదాన్యత ఉంటుందో, ప్రజా ఉద్యమాల్లో విప్లవ సాంస్కృతిక సైనికులకు అంతే ప్రాధాన్యత ఉంటుందని గుర్తుచేశారు. కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి నిర్మించిన గోదావరిలోయ ప్రతిఘటనోద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు పుట్టుకొచ్చారని అన్నారు. విప్లవోద్యమంలో ఏర్పడ్డ చీలికలు సాంస్కృతిక ఉద్యమం విచ్ఛిన్నం అయ్యింందని అన్నారు. తద్వారా కళాకారులలో అవకాశవాద రాజకీయాలు తిష్టవేసుకొన్నాయని అన్నారు. ఉద్దండులైన ఎంతోమంది పేరుగాంచిన కవులు, కళాకారులు దోపిడీ సంస్కృతికి వంత పాడే భజనపరులుగా మారి, విప్లవ సంస్కృతిని నీరుగార్చారని ఎండగట్టారు. అనంతరం భారత అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ నూతన రాష్ట్ర కమిటీ కార్యవర్గం ఏర్పాటు అయ్యింది. అధ్యక్షులుగా కాంపాటి జీవన్, కార్యదర్శిగా ఇనుప సురేష్, కమిటీ సభ్యులుగా ఆర్మూర్ రాజు, ఎడ్ల రాజు, కటారి పళిని స్వామిని ఎన్నుకోవడం జరిగిందని పంపిన పత్రిక ప్రకటనలో వెల్లడించారు.