వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి నాలుగు అత్యున్నత పురస్కారాలు

నవతెలంగాణ – హైదరాబాద్: వైరా కృషి విజ్ఞాన కేంద్రానికి నాలుగు అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పాండిచ్చేరి పరిధిలో కేవీకేల పర్యవేక్షణ కేంద్రమైన అటారి పరిధిలో మొత్తం 72 కేవీకేలు ఉన్నాయి. ఆయా కేవీకేల పనితీరుపై ఈనెల 25 నుంచి 27 వరకు ఏపీ రాజమండ్రిలోని జాతీయ పొగాకు పరిశోధన కేంద్రంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా చివరి రోజు గురువారం ఉత్తమ పనితీరు కనబరిచిన కేవీకేలకు పురస్కారాలు అందించారు. వీటిలో భాగంగా వైరా కేవీకేకు ఆదాయ ఉత్పత్తి, డేటాబేస్, పలు మాధ్యమాల ద్వారా రైతులకు సమాచారం అందించడం, నేరుగా వరి విత్తే పద్ధతిని ప్రోత్సహించే అంశాలపై నాలుగు పురస్కారాలను ప్రకటించారు. అటారి జోన్‌ 10 డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌కే మతూర్‌ చేతుల మీదుగా పురస్కారాలను కేవీకే ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ కె.రవికుమార్‌ అందుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం పరిధిలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాల నిర్వహణలో ఇతర విభాగాల పనితీరులో వైరా కేవీకేకు మొదటి స్థానం లభించిందని డాక్టర్‌ కె.రవికుమార్‌ స్పష్టం చేశారు.

Spread the love