Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి

అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి

- Advertisement -

కేంద్రం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి : నిరసనలో ఎస్‌‌కేఎం నేతలు
‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతు, ప్రజా వ్యతిరేక భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ, జక్కుల వెంకటయ్య, భగవంతు, వి. నాగిరెడ్డి, చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..​​మన దేశ ఆర్థిక రంగానికి, కోట్లాది మంది జీవనోపాధికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను మరింత కోలుకోలేని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ శక్తులతో కలిసి ప్రమాదకరమైన అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ​విదేశీ బహుళజాతి కంపెనీల, ధనిక దేశాల ప్రయోజనాల కోసం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పై సంతకాలు చేయడానికి కేంద్రం సిద్ధంకావడాన్ని తప్పుబట్టారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే మన దేశ వ్యవసాయ సార్వభౌమత్వం దెబ్బతింటుందని హెచ్చరించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు తమ దేశాల్లోని కార్పొరేట్ రైతులకు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తాయనీ, దీనివల్ల అక్కడ పంటల ఉత్పత్తి వ్యయం చాలా తక్కువని తెలిపారు. ఆ దేశాల నుంచి పాలు, డెయిరీ ఉత్పత్తులు, గోధుమలు, వరి, నూనెగింజలు, పత్తి, కూరగాయలు పన్నులు లేకుండా మన దేశంలోకి వస్తే అవి ఇక్కడి మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయనీ, ఫలితంగా మన స్థానిక రైతులు పండించిన పంటలకు కొనేవారే ఉండరని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం, ప్రభుత్వం స్వదేశీ రైతుల నుంచి మద్దతు ధరకు పంటలను సేకరించడాన్ని మార్కెట్ నియమాలను ఉల్లంఘించడమేనని ధనిక దేశాలు వాదిస్తాయని హెచ్చరించారు. ఈ ఒప్పందాలపై సంతకం చేస్తే భవిష్యత్తులో మన దేశంలో వరి, గోధుమలు లేదా ఇతర పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చే చట్టబద్ధమైన హక్కు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు శాశ్వతంగా మూతపడతాయని హెచ్చరించారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటం వల్ల మన దేశంలో ఆహార కొరత ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదముందని చెప్పారు. నిరుపేదలకు రేషన్ ద్వారా అందుతున్న ఉచిత బియ్యం, గోధుమల పంపిణీ వ్యవస్థ పూర్తిగా రద్దవుతుందని తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల మేధో సంపత్తి హక్కులు కఠినతరం అవుతాయనీ, దీనివల్ల రైతులు తమ సొంత విత్తనాలను దాచుకునే, వాడుకునే హక్కును కోల్పోతారని వివరించారు. విదేశీ దిగుమతుల పోటీని తట్టుకోలేక, మార్కెట్‌లో సరైన ధర రాక రైతు మరింత అప్పుల్లో మునిగిపోతాడనీ, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమేమని హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పైనా సంతకాలు చేయొద్దని డిమాండ్‌ ‌చేశారు.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు ఉత్పాదక వ్యయంపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధరకు చట్టబద్ధ గ్యారెంటీ కల్పించాలనీ, దేశంలోని చిన్న, సన్నకారు రైతుల, కౌలు రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ ఒకేసారి పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను దూరం చేసే విద్యుత్ ప్రయివేటీకరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ​కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి, పంట నష్టపరిహారం, బ్యాంక్ రుణాలు, మద్దతు ధర అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాద్ రావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేష్, ఎస్వీ.రమ, పద్మశ్రీ, శ్రీకాంత్, సుధాకర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, సీయూటీఐ నాయకులు ప్రదీప్, రైతు సంఘాల నాయకులు నరేంద్ర ప్రసాద్, ప్రభులింగం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -