బకాయిల కోసం పాత
సర్పంచుల పాట్లు
2019 నుంచి 2024 వరకు రూ.500 కోట్ల బకాయిలు
మూడేండ్లుగా ఎస్‌ఎఫ్‌సీ నుంచి విడుదల కాని నయా పైసా
ఎన్నికల ముందిచ్చిన హామీని నిలబెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు
రూ. 500 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా .
2019 నుంచి 2024 మధ్య వారి గత పదవీకాలంలో గ్రామ సభల ద్వారా తాగునీటి సౌకర్యాల కల్పన, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యం ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం స్వంత నిధులతో పనులు చేపట్టారు. వీటికి సంబంధించిన మెజర్‌మెంట్ బుక్ (ఎంబీ) నమోదు ప్రక్రియను పంచాయతీరాజ్ అధికారులు పూర్తి చేసినప్పటికీ, బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఫలితంగా ఏడేండ్లుగా సర్పంచులు పాత బిల్లుల కోసం
ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ గ్రామం మాది. గ్రామాభివృద్ధి మా బాధ్యత. ఎన్నికల ముందిచ్చిన అభివృద్ధి హామీలు నిలబెట్టుకోవాలని మాజీ సర్పంచులు తమ పదవి కాలంలో తాపత్రయ పడ్డారు. పనులు పూర్తయ్యాక ఎలాగు బిల్లులొస్తాయనీ మరీ అప్పులు చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, తాగునీటి మోటార్ల ఏర్పాటు, పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, పారిశుధ్య పనులు చేపట్టారు.
2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వెచ్చించిన మొత్తాల్లో 90శాతంపైగా అప్పటి సర్పంచ్‌లే సొంతంగా భరించారు. కొంతకాలం పాటు చెల్లింపులు ఆశాజనకంగానే జరిగాయి. 2020-2021లో కరోనా విజృంభణ తర్వాత రెండేండ్ల పాటు బిల్లుల చెల్లింపులన్నీ ఆగిపోయాయి. అవి క్రమంగా పెరిగి పాలకవర్గాల గడువు ముగిసే నాటికి రూ.1,200 కోట్లకు చేరాయి. ఇందులో ఉపాధి హామీ, ఇతర పనులకు సంబంధించి సగానికి పైగా బిల్లులు చెల్లించగా, ఇంకా దాదాపు రూ.500కోట్ల దాకా పెండింగులో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 33 నెలలు గడుస్తున్నా గ్రామపంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నుంచి, గాని స్టేట్ డెవలప్ మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్) నుంచి గాని చిల్లి గవ్వ ఇవ్వలేదు. 7 నెలల క్రితం కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టిన అనంతరం గ్రామాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఆ నిధుల నుంచి గత పాలకవర్గం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో 50 శాతం చెల్లించాలని ఉన్నతాధికారులు సూచించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. రెండో సారి సర్పంచ్‌గా ఎన్నికైన గ్రామాలతో పాటు అక్కడక్కడా కొన్ని పంచాయతీల్లో మాత్రమే నామ మాత్రంగా బిల్లులను చెల్లించారు. 90 శాతానికి పైగా గ్రామ పంచాయతీల్లో పాత సర్పంచుల పదవీ కాలంలో చేపట్టిన పనులను పక్కన పెట్టి ప్రస్తుత పాలకవర్గాలు తమ హయాంలో చేపట్టిన పనులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత వర్సెస్ కొత్త
రాష్ర్టంలోని మెజార్టీ గ్రామపంచాయతీల్లో పాత, కొత్త సర్పంచ్‌ల మధ్య పంచాయితీలు నెలకొంటున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి వాగ్వాదం చోటు చేసుకుంటోంది. తాము అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామనీ, కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చిన నిధులను పెండింగ్ బిల్లులు చెల్లింపుల కింద ఇవ్వాలని పాత సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకే నిధులన్నీ కేటాయిస్తే అభివృద్ధి ఏం చేయాలంటూ కొత్త సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కొత్త పనులు ప్రారంభించకుండా కేవలం పెండింగ్ బకాయిలు తీర్చడానికే తాము కొత్తగా పదవుల్లోకి వచ్చామా అంటూ కొత్త సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల చేయాలి
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసి, పాత సర్పంచుల బిల్లులను చెల్లించాలి. కొత్తగా గెలిచిన సర్పంచులకు 15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప ఇప్పటి వరకు సర్కార్ రూపాయి విడుదల చేయలేదు. గ్రామపంచాయతీలకు పన్నుల రూపంలో రావాల్సిన స్టాంప్ డ్యూటీ, సీనరేజ్, వివిధ లైసెన్స్‌ల పన్నుల వాటాను కూడా సకాలంలో జీపీ ఖాతాలో జమ చేయడం లేదు. వాటిని ఫ్రీజ్ చేసి ఇతర పనులకు సర్కార్ మళ్లీస్తోంది. 2026 జనాభాకనుగునంగా తలసరి గ్రాంట్‌ను పెంచి వెంటనే జీపీలకు నిధులను విడుదల చేయాలి.
చంద్రారెడ్డి, సర్పంచ్, వెలిమినేడు, చిట్యాల మండలం, నల్లగొండ
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాత సర్పంచుల పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి 33 నెలలు గడస్తున్నా ఎస్ఎఫ్ సీ నుంచి గాని, ఎస్ డీఎఫ్ నుంచి గాని ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. చాలా మంది సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్థి పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
సుర్వి యాదయ్య గౌడ్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు
ఏడేండ్లుగా ఎదురుచూపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



