ఫ్రెంచ్‌ కింగ్‌ అల్కరాజ్‌ ఫైనల్లో జ్వెరెవ్‌పై గెలుపు

ఫ్రెంచ్‌ కింగ్‌ అల్కరాజ్‌ ఫైనల్లో జ్వెరెవ్‌పై గెలుపు– ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2024
పారిస్‌ (ఫ్రాన్స్‌) : స్పెయిన్‌ యంగ్‌ బుల్‌, వరల్డ్‌ నం.3 కార్లోస్‌ అల్కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఐదు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన టైటిల్‌ పోరులో జర్మనీ స్టార్‌, వరల్డ్‌ నం.4 అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై మెరుపు విజయం సాధించాడు. నాలుగున్నర గంటల పోరులో 6-3, 2-6, 5-7, 6-3, 6-2తో కార్లోస్‌ అల్కరాజ్‌ గెలుపొందాడు. నాల్గో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)కి ఉత్కంఠ టైటిల్‌ పోరులో పరాజయం తప్పలేదు.
మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో అల్కరాజ్‌ తొలి సెట్‌ను 6-3తో గెల్చుకుని ముందంజ వేశాడు. కానీ వరుసగా రెండు సెట్లను 6-2, 7-5తో సొంతం చేసుకున్న జ్వెరెవ్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్లాడు. మూడు సెట్ల అనంతరం 2-1తో నిలిచిన జ్వెరెవ్‌ టైటిల్‌కు ఒక్క సెట్‌ దూరంలో నిలిచాడు. ఈ సమయంలో అల్కరాజ్‌ అద్భుతంగా ఆడాడు. ఒత్తిడిలో గొప్పగా పుంజుకున్నాడు. 6-1, 6-2తో చివరి రెండు సెట్లను సొంతం చేసుకుని ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు. అల్కరాజ్‌ 3 ఏస్‌లు కొట్టగా, జ్వెరెవ్‌ 8 ఏస్‌లు కొట్టాడు. అల్కరాజ్‌ 9 బ్రేక్‌ పాయింట్లతో సత్తా చాటగా.. జ్వెరెవ్‌ ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించాడు. పాయింట్ల పరంగా 93-73తో అల్కరాజ్‌ పైచేయి సాధించాడు. అల్కరాజ్‌ గేమ్‌ పాయింట్లలోనూ 25-19తో పైచేయి సాధించాడు. అల్కరాజ్‌ 52 విన్నర్లతో మెరువగా.. జ్వెరెవ్‌ 38 విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. జ్వెరెవ్‌ 60 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో కొకొ గాఫ్‌ తొలి టైటిల్‌ సాధించింది. చెక్‌ భామ కేథరిన్‌తో కలిసి 7-6(7-5), 6-3తో ఇటలీ పావొలిని, ఎర్రానిలపై విజయం సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లారా, రోజర్‌ జోడీ టైటిల్‌ సొంతం చేసుకుంది. మెన్స్‌ డబుల్స్‌లో పావిక్‌, మార్సెలో విజేతలుగా నిలిచారు.

Spread the love