టెక్‌ స్టార్టప్‌లకు నిధుల కటకట

– గతేడాది నిధుల్లో 77% పతనం
– పెట్టుబడులకు ఇన్వెస్టర్ల అనాసక్తి
– విస్తరణలో సవాళ్లు
– 2023లో కొత్తగా 480 సంస్థల ఏర్పాటు
న్యూఢిల్లీ: భారత టెక్‌ స్టార్టప్‌లు నిధుల సమీకరణలో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మోడీ సర్కార్‌ కార్పొరేట్లకు ఇస్తున్న ఆర్థిక ప్రాధాన్యత స్టార్టప్‌లకు ఇవ్వడం లేదని పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వెంచర్‌ కాపిటలిస్టు పెట్టుబడిదారులు భారత స్టార్టప్‌లకు పెట్టుబడులను సమకూర్చడంలో వెనక్కి తగ్గుతున్నారు. స్టార్టప్‌ నిధులు, వాటి సవాళ్లపై టెక్నాలజీ ఇండిస్టీ బాడీ నాస్కామ్‌, గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ జిన్నోవ్‌ ఓ కీలక నివేదికను వెల్లడించింది. ఆ వివరాలు.. గతేడాది దేశంలో దాదాపు 480 కొత్త డీప్‌టెక్‌ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రపంచంలోనే భారత్‌ మూడవ అతిపెద్ద స్టార్టప్‌ల హబ్‌గా మారింది. మరోవైపు ఈ స్టార్టప్‌ల నిధుల సమీకరణపై నీలినీడలు కమ్ముకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. డీప్‌టెక్‌ స్టార్టప్‌లు అనేవి సాంకేతికత లేదా ఇంజనీరింగ్‌ పురోగతులపై ఆధారపడి విప్లవాత్మక పరిష్కారాలను అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసినవి.
‘ఇండియాస్‌ డీప్‌టెక్‌ డాన్‌: ఫోర్జింగ్‌ ఎహెడ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రధానంగా స్టార్టప్‌లు మూడు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నిధుల సమీకరణ, నైపుణ్యవంతుల కొరత, అంతర్జాతీయ విస్తరణ ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ”భారత్‌లో ప్రస్తుతం 3600 పైగా డీప్‌టెక్‌ స్టార్టప్‌లు ఉన్నాయి. వాటిలో 480 గతేడాది స్థాపించబడ్డాయి. 2022లో స్థాపించబడిన డీప్‌టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ” అని నివేదిక పేర్కొంది. కాగా ఆ సంస్థల హామీలు, లక్షాలు నిధుల కొరత వల్ల నెరవేరలేకోతున్నాయి. కొన్ని ఇతర ప్రముఖ డీప్‌టెక్‌ పర్యావరణ వ్యవస్థల్లోని స్టార్టప్‌లతో పోలిస్తే, భారత డీప్‌టెక్‌ స్టార్టప్‌లు ప్రతి దశలోనూ మధ్యస్థ పెట్టుబడిలో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నిధుల కొరత కొన్ని ఆశాజనకమైన టెక్‌ స్టార్టప్‌ల సామర్థ్యం పెంపును పరిమితం చేస్తుంది. దీంతో ప్రపంచ టెక్‌ స్టార్టప్‌లతో పోటీపడలేక పోతున్నాయి.” అని నాస్కామ్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
కేవలం రూ.7100 కోట్లతో సరి..
గడిచిన ఐదేళ్లలో భారత టెక్‌ స్టార్టప్‌లు 10 బిలియన్ల (రూ.83వేల కోట్లు) నిధులు సమీకరించాయి. 2023లో కేవలం 850 మిలియన్‌ డాలర్ల (రూ.7100 కోట్లు) నిధులు అందుకున్నాయి. 2022లోని 3.7 బిలియన్‌ డాలర్ల (రూ.30వేల కోట్లు)తో పోల్చితే.. గతేడాది నిధుల్లో 77 శాతం పతనం చోటు చేసుకుంది. అదే విధంగా 2022తో పోల్చితే 2023లో ఆర్థిక ఒప్పందాల్లో 25 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది 74 టెక్‌ స్టార్టప్‌లు కృత్రిమ మేధా (ఎఐ) ఆధారంగా నెలకొల్పబడ్డాయి. ఎఐ ఆధారిత స్టార్టప్‌ల్లో 86 శాతం నిధులను సమీకరించాయి.
మెగా డీల్స్‌ జీరో..
2022తో పోలిస్తే 2023లో భారతదేశ డీప్‌టెక్‌ స్టార్టప్‌ల కోసం ఫండింగ్‌ రౌండ్‌లలో పాల్గొనే పెట్టుబడిదారుల సంఖ్య 60 శాతానికి పైగా పడిపోయింది. ఇంతకుముందు నిధులను అందించిన అనేక మంది పెద్ద ప్రపంచ పెట్టుబడిదారులు అనాసక్తి చూపడం ఈ క్షీణతకు కారణం. ”2022లో తొమ్మిది పెద్ద ఒప్పందాలతో పోలిస్తే 2023లో మెగా డీల్‌లు అసలు లేకపోవడంతో పెద్ద టికెట్‌ పెట్టుబడులపై పెట్టుబడిదారుల ప్రాధాన్యత తగ్గుముఖం పట్టిందని స్పష్టం అవుతుంది” అని నివేదిక పేర్కొంది. డీప్‌టెక్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటి ప్రతిఫలం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి రావడం అతిపెద్ద సవాలు అని వెంచర్‌ కాపిటలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
బహుముఖ విధానం అవసరం..
పెట్టుబడిదారులు తక్కువ మొత్తం పరిమాణాలు, తక్కువ రిస్క్‌తో సీడ్‌ స్టేజ్‌ డీప్‌టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్ట పడటంతో నిధుల పరిమాణం మరింత క్షీణించింది. ”ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి టెక్‌ స్టార్టప్‌ల అభివృద్థికి భారత్‌కు బహుముఖ విధానం అవసరం. ఇన్నోవేషన్‌ క్లస్టర్‌లను గుర్తించి బలోపేతం చేయాలి. మూలధనం, పటిష్టమైన మౌలిక సదుపాయాల లభ్యతను సులభతరం చేయాలి. నేషనల్‌ డీప్‌టెక్‌ స్టార్టప్‌ పాలసీ (ఎన్‌డిటిఎస్‌పి) అమలును వేగవంతం చేయాలి. స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నిధులు, వాటి పెరుగుదలకు మద్దతునిచ్చే మార్కెట్‌ పర్యావరణ వ్యవస్థ, వాణిజ్యీకరణకు సహాయపడే బలమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి.” అని నాస్కామ్‌, గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ జిన్నోవ్‌ తన రిపోర్టులో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Spread the love