Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజీవో నెం.9ను తక్షణమే ఉపసంహరించుకోవాలి

జీవో నెం.9ను తక్షణమే ఉపసంహరించుకోవాలి

- Advertisement -
  • ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల మంజూరుకు సంబంధించిన‌ ప్రభుత్వ జీవో నెం.9లోని నూతన నిబంధనలు పూర్తిగా విద్యార్థి వ్యతిరేకమైనవని, వాటిని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు బుధ‌వారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజులు ఒకప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల సంక్షేమం పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం వాస్తవానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థలపై అదనపు భారం మోపే చర్యగా మారిందని వారు విమర్శించారు. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ఫీజు మొత్తాన్ని వారం రోజుల్లోగా కళాశాలలకు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రికవరీ చేస్తామని పేర్కొనడం అత్యంత నిరంకుశ చర్య అని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, సమాచార లోపం లేదా ఇతర అనివార్య కారణాలతో ఆలస్యం జరిగితే విద్యార్థులను బాధ్యులను చేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలను యథాతథంగా కొనసాగించడం వల్ల వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు పథకం పరిధి నుండి బయటపడే ప్రమాదం ఉందన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తన బాధ్యతను విద్యార్థులపైకి నెట్టివేసి, ఫీజుల చెల్లింపును విద్యార్థుల ద్వారానే జరపాలని నిర్ణయించడం వల్ల కళాశాలల్లో అనవసర సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఫీజులు చెల్లించలేదనే పేరుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, వేధింపులకు గురిచేయడం ,సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధింపులు చేయడం వంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దరఖాస్తు తేదీల ఆధారంగా విడతల వారీగా 75 రోజులలోపు నిధులు విడుదల చేస్తామనడం విద్యార్థుల సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తుందని, ఏడాది పొడవునా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని విమర్శించారు.

అందువల్ల విద్యార్థుల నుండి ఫీజుల రికవరీ అనే నిరంకుశ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత విధానంలోనే విద్యాసంస్థల ఖాతాల్లోకి నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను జమ చేయాలని, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు ఉపకార వేతనాల కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలిగించే అన్ని నిబంధనలను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.విద్యార్థి వ్యతిరేక జీవో నెం.9ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -