గేమ్ ఛేంజర్స్

Game changers– ఎంపీ ఎన్నికల్లో రెబల్‌ నేతలే కీలకం
– ఈ సారి ఎన్నికల్లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశం
– రాజకీయ విశ్లేషకుల అంచనాలు
– 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్పష్టం
– కొన్ని స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులవిజయం
– మరికొన్ని స్థానాల్లో ఓట్ల చీలిక
– ఏ పార్టీకీ దక్కని స్పష్టమైన మెజారిటీ
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు సహా ఇతర పార్టీలు సైతం తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ, కాంగ్రెస్‌లు దాదాపుగా అన్ని సీట్లకూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికారమే పరమావధిగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను చేస్తున్నాయి. అయితే, ఒక్క స్థానానికి ఒకే పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటం పార్టీలకు తీవ్ర తలనొప్పులు తెస్తున్నాయి. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నాయి.టికెట్‌ దక్కిన అభ్యర్థుల సంగతి సరే కానీ.. ఆ అవకాశం లభించని క్యాండిడేట్లు మాత్రం పార్టీల ఆదేశాలను సైతం లెక్క చేయటం లేదు. రెబల్‌లుగా మారుతూ ఎలాగైనా అసెంబ్లీ బరిలో నిలిచి గలవాలని చూస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లాగే ఈ ఎన్నికల్లోనూ రెబల్‌ అభ్యర్థులే కీలకంగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భోపాల్‌ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 109 స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్‌ 114 సీట్లను దక్కించుకున్నది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కావా ల్సిన సీట్ల సంఖ్య 116. దీంతో రెండు ప్రధాన పార్టీలకూ సరిపడా మెజారిటీ రాకపోవటంతో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు రెబల్‌ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ రెబల్‌ అభ్యర్థులే రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడటానికి పరోక్ష కారణమయ్యారనీ, ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా మారారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెబల్‌ అభ్యర్థులు గేమ్‌ఛేంచర్లుగా మారనున్నారని అంటున్నారు.
ఇప్పుడూ అదే భయం
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు మినహా యించి మొత్తం 228 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిం చింది. అయితే, పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అంటున్నారు. అధికారంలో ఉంటూ వస్తున్న బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు రెబల్‌ అభ్యర్థుల పోటీ గట్టి ఎదురుదెబ్బ తాకేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అనేక స్థానాల్లో రెబల్‌ అభ్యర్థులు గెలవనప్పటికీ.. పార్టీల ఓట్లను చీల్చటం.. పరోక్షంగా అభ్యర్థుల ఓటమికి కారణమ వుతున్నారని అంటున్నారు. 2018 ఎన్నికల్లో అనేక పార్టీల నుంచి అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడి పోయిన సందర్భాలనూ వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ కంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు రెబల్‌ అభ్యర్థుల నుంచి బెడద ఎక్కువగా ఉన్నదని అంటున్నారు. కాంగ్రెస్‌ కూడా మొత్తం 230 స్థానాలకు గానూ 229 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే, టికెట్‌ దక్కని వారు దాదాపు 40 కంటే ఎక్కువ స్థానాల్లో తాము రెబల్‌గా పోటీ చేయనున్నట్టు తెలిపారు.

Spread the love