పట్టణాల్లోనే ఉన్నట్టు సమాచారం
అత్యధికంగా 818 మంది మావోయిస్టులు లొంగిపోయింది మన రాష్ట్రంలోనే
మిగిలినవారు కూడా త్వరలో సరెండరవుతారు : ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డీజీపీ ప్రకటన
ఆయుధాలతో సహా లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి దండకారణ్యంలో లేరనీ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తమకు సమాచారం ఉందని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు భార్య జోడె లక్ష్మీబాయి, మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, మరో ఇద్దరు రాష్ట్రానికి చెందిన నాయకులు సేతు, శేఖర్‌లను కూడా లొంగుబాటులో నడపడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. శనివారం 47 మంది మావోయిస్టులు, 32 ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట ఆయన కార్యాలయంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివధర్‌రెడ్డి మాట్లా డుతూ.. ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడంతో ఈ సంఖ్య ఇదే చివరిది కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లొంగిపోయినవారంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవా రేననీ, వీరిలో ఒకరు రాష్ట్ర కమిటీ సభ్యులు, నలుగురు డివిజన్ కమిటీ సభ్యులు, 22 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, మిగతావారంతా క్యాడర్ అని అన్నారు. వీరు స్వాధీనపర్చిన ఆయుధాలలో ఒక ఎల్‌ఎంజీ, నాలుగు ఏకే 47లు, మూడు ఇన్సాస్‌లతో సహా రైఫిళ్లు, పిస్టళ్లు, రివాల్వర్, ఎయిర్‌గన్‌లతో సహా 32 ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే 200 కిలోల మందుపాతరలను పేల్చేందుకు ఉపయోగించే ల్యాండ్‌మైన్ వైర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు.
వీరిపై రూ.1.50 కోట్ల నగదు రివార్డు
వీరందరిపై రూ.1.50 కోట్ల నగదు రివార్డు ఉందనీ, ఈ డబ్బులను వీరి అకౌంట్లు తెరిచాక వారి ఖాతాల్లో వేస్తామన్నారు. ప్రాథమికంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చెక్‌లను అందజేస్తున్నామన్నారు. స్వాధీనపర్చిన ఆయుధాలపై కూడా కేంద్రం నిబంధనల మేరకు వెపన్‌ను బట్టి అదనంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీరంతా ఇక్కడే ఎందుకు లొంగిపోయారనే ప్రశ్నకు.. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీంల రూపంలో అందజేస్తున్న చేయూత, వైద్య సౌకర్యాలకు వీళ్లు ఆకర్షితమై మనవద్దే లొంగిపోతున్నారని డీజీపీ చెప్పారు.
అజ్ఞాతంలో నలుగురు మాత్రమే
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ఆయన స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో తెలంగాణలో 818 మంది మావోయిస్టులు లొంగిపోగా 334 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు. 2023లో తెలంగాణకు చెందిన 125 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండగా.. ప్రస్తుతం నలుగురు మాత్రమే మిగిలినట్టు చెప్పారు.
ఆ ప్రకటనపై అధికారుల దృష్టి
ఈ 47 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ఎస్‌ఐబీ ఐజీ సుమతితో పాటు ఆ విభాగానికి చెందిన అధికారులు తీవ్రంగా కృషి చేశారని ఆయన అభినందించారు. దండకారణ్యంలోని మారుమూల ప్రాంతాల్లో వేళ్లతో లెక్కించదగిన మావోయిస్టులు కొందరు మిగిలిపోయి ఉండొచ్చనీ, వారు కూడా లొంగిపోయి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస చేయూతను అందుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. కాగా లొంగిపోయిన మావోయిస్టులంతా ద్రోహులంటూ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రకటనపై అక్కడి అధికారులు పరిశీలనలు జరుపుతున్నారనీ, తాము కూడా దృష్టిని సారించామని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రేహౌండ్స్ డీజీపీ అనిల్ కుమార్, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేశ్‌భగవత్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.
గణపతి దండకారణ్యంలో లేడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



