నవతెలంగాణ -పరకాల
పరకాల పట్టణంలోని మమతానగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు నిత్య అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కాలనీలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
ఉత్సవాల ముగింపు సందర్భంగా నరేన్ రాక్‌స్టార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలంపాటలో మాటూరి రాజేందర్ దంపతులు రూ.45,116కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు స్వామివారి సన్నిధిలో పూజలు, అభిషేకాలు అందుకున్న లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోవడంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా నరేన్ రాక్‌స్టార్ యూత్ సభ్యులు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాన్ని మాటూరి రాజేందర్ దంపతులు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వారి కుటుంబంపై గణపతి స్వామి కటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
తొమ్మిది రోజుల పాటు గణేష్ మండపం వద్ద నిర్వహించిన నిత్య అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చివరి రోజు కాలనీవాసులు ఆటపాటలతో సందడి చేస్తూ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలు, యువత సందడి నడుమ నిమజ్జన కార్యక్రమం ఘనంగా ముగిసింది.



