గంజాయి సరఫరా ముఠా అరెస్ట్‌

Ganja supply gang arrested– 336 కేజీల గంజాయి, డీసీఎం, మూడు సెల్‌ ఫోన్స్‌ స్వాధీనం
– వివరాలు వెల్లడించిన ఎస్పీ చందనా దీప్తి
నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌
గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. వారి నుంచి 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి డీసీఎంలో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌ విజయపూరి పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ సంపత్‌ సిబ్బందితో కలిసి ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. కూరగాయల ట్రేలతో వచ్చిన డీసీఎంను తనిఖీ చేసే క్రమంలో వాహనం నుంచి నలుగురు వ్యక్తులు దిగి పారిపోతుండగా పట్టుకున్నారు. డీసీఎంలో ఉన్న 168 పాకెట్లలో సుమారు 336 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీసీఎంను, మూడు సెల్‌ఫోన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా, వారు మహారాష్ట్రకు చెందిన జ్ఞానోబా అమోల్‌ ఘొరే, గణపతి బసవరాజ్‌ సోనాల్‌, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్‌ ఇషాకేగా చెప్పారు. జ్ఞానోబా అమోల్‌ ఘొరే డ్రైవర్‌గా పని చేసే సమయంలో నిజామాబాద్‌ జిల్లాకి చెందిన జయపాల్‌ పరిచయమయ్యాడు. జయపాల్‌ గంజాయి సరఫరా చేస్తుంటాడు. అదే క్రమంలో విజయనగరంలో గంజాయి తీసుకొని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ తాను చెప్పిన వ్యక్తికి సరఫరా చేస్తే లక్ష రూపాయలు ఇస్తా అనిజ్ఞానోబా అమోల్‌ ఘొరేకి చెప్పాడు. అందుకు అంగీకరించిన జ్ఞానోబాతో పాటు ముగ్గురువెళ్లారు. అక్కడ నుంచి గంజారు తీసుకుని వరంగల్‌ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు- మాచర్ల మీదుగా వస్తూ సాగర్‌ పోలీసులకు పట్టుబడ్డారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ చందనాదీప్తి చెప్పారు. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి విక్రయాల గురించిగానీ, సేవించే వ్యక్తుల గురించి, సరఫరా చేసేవారి గురించి తెలిస్తే డయల్‌ 100 ద్వారా సమాచారం అందజేయాలని సూచించారు.

Spread the love