– ముంబయితో ఢిల్లీ అమ్మాయిల ఢీ నేడు
– మహిళల ప్రీమియర్ లీగ్ 2025
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అత్యంత నిలకడగా రాణించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మెగ్ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు చేరుకున్నారు. తొలి సీజన్‌లో ముంబయి ఇండియన్స్, రెండో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతిలో భంగపడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముచ్చటగా మూడోసారి టైటిల్ వేటకు సిద్ధమైంది. 2023 సీజన్ ఫైనలిస్ట్‌లు 2025 సీజన్ అంతిమ సమరానికి సై అంటున్నారు. తొలి రెండు ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి వ్యూహాత్మకంగా ఎటువంటి మార్పులు చేస్తుండో చూడాలి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్, శిఖా పాండే, జెస్ జొనాసెన్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు.. నటాలీ సీవర్, మాథ్యూస్ హేలీ, అమేలీ ఖేర్‌లు ముంబయి ఇండియన్స్‌కు కీలకం కానున్నారు. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో నేడు రాత్రి 8 గంటలకు డబ్ల్యూపీఎల్ ఫైనల్ ఆరంభం కానుంది.