గోవా టూర్‌ కొంపముంచిందా..?

గోవా టూర్‌ కొంపముంచిందా..?– క్యాంపు రాజకీయాలతో మారిన బలాబలాలు : లక్షలు చేతులు మారిన వైనం!
– 12 మంది ఎమ్మెల్యేలుండి ‘చే’ జార్చుకున్న ఎమ్మెల్సీ సీటు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గోవా టూర్‌ కాంగ్రెస్‌ కొంపముంచినట్టు తెలుస్తోంది. క్యాంపు రాజకీయాలతో బలాబలాలు మారిపోయాయి.. ఈ క్రమంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టూ ఆరోపణలున్నాయి. ఓటు వేస్తారనే అతి నమ్మకంతో కాంగ్రెస్‌ నేతలు గట్టిగా ప్రయత్నించకపోవడం.. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ సొంత జిల్లాలో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నా.. ఎమ్మెల్సీని గెలుచుకోలేక పోయిందన్న అపవాదును మూటగట్టుకుంది.
ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక. అధికార మార్పిడి జరగ్గానే మెజార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు సంకేతాలిచ్చారు. దాంతో ఎమ్మెల్సీ స్థానం తమదేనని కాంగ్రెస్‌ అనుకున్నా.. దానికి తగ్గ ప్రయత్నాలు చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందనే చర్చ బీఆర్‌ఎస్‌లోనూ కొనసాగింది. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఖంగుతిన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపునకు గోవా టూరు కలిసి వచ్చిందని కార్యకర్తలే చెప్పడం విశేషం.ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవడానికి బీఆర్‌ఎస్‌ చేయని ప్రయత్నం అంటూ లేదు. ‘మీరు బీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే గతంలో మీరు చేసిన నిర్వాకాలన్నీ బయట పెడుతామని’ స్థానిక ప్రజాప్రతినిధులను హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ‘మీ జాతకాలు మా చేతుల్లో ఉన్నాయి’ అని బెదిరించి ఓటేయించుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. గోవా టూర్‌ పేరుతో వీరి కుటుంబాలను యాత్రలకు తీసుకెళ్లి ప్రలోభపెట్టారు. లక్షల రూపాయలు చేతులు మారినట్టు ప్రచారం ఉంది. దాంతో కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెప్పిన వారు సైతం బీఆర్‌ఎస్‌కే ఓటేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో పక్కా ఆలోచన చేయకుండా ప్రజాప్రతినిధులను తమవైపే ఉండేలా నాయకత్వం చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా.. మిగతా వారి నుంచి జరగలేదు. ప్రధానంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తామని చెప్పినా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల చేరికలపై ఏమాత్రం స్పందించ లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌్‌లోకి వస్తామని చెప్పినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు జడ్చర్ల, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గెలుపు కోసం చేసిన ప్రయత్నాలేమీ లేవనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తమదే కాబట్టి.. ఎమ్మెల్సీ స్థానం కూడా గెలుస్తామన్న ఎక్కువ అంచనాతో కనీస ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ గెలుపుకోసం తీవ్ర కృషి చేశారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 1439 ఓట్లు ఉన్నాయి. వారిలో మెజార్టీ సభ్యులు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారే అయినా.. అందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి 762 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్య్ర అభ్యర్థి సుదర్శన్‌గౌడ్‌కు ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్‌, ఎమ్మెల్యేలు మొత్తం 1000 మంది ప్రతినిధుల్లో మెజార్టీ సభ్యులు మొదట కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత వీరికి వివిధ రకాల ప్రలోభాలు.. బెదిరింపుల వల్ల బీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్టు సమాచారం.
శిబిరాల వల్ల మారిన రాజకీయ పరిణామాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ శిబిరాల రాజకీయాలు నడిపింది. ఏ ఒక్కరిని వీడకుండా ఎన్నికలకు 15 రోజుల ముందే శిబిరాలకు తరలించి మానసికంగా వారిని మార్చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఓటర్లు చేజారకుండా జాగ్రతలు తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రాష్ట్రంలో అధికారం జారిపోయిన తర్వాత మొదటి ఎన్నిక కాబట్టి ఎట్టి పరిస్థితులోనూ ఓడిపోరాదని అహర్నిషలూ కృషి చేశారు. కాంగ్రెస్‌ మాత్రం ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచిన ధీమాతో ఉండి ప్రచారం చేయలేదు. స్థానిక నాయకులను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఓటమి చవిచూసిందని చర్చ నడుస్తోంది.

Spread the love