ప్రభుత్వ వైద్యులు సాధారణ ప్రసవాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి..

– విధులలో సమయపాలన పాటించాలి
– సీజనల్ వ్యాధులపై దృష్టి సారించండి
– జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్ :
వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్ నుండి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో ఏ ఒక్కరు వ్యాధుల బారిన పడకుండా చూడాలని, ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలినట్లయితే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి చికిత్స అందించాలని, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ బృందాలతో మెడికల్ బృందాలు సమన్వయం చేసుకొని వెళ్లాలని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా నిరంతరం అందించే సేవలలో ఎలాంటి ఆటంకం లేకుండా అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఎవరైనా అనధికారికంగా విధులకు గైహాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ప్రతి ఆరోగ్య కేంద్రానికి ఆయా అంశాలపై లక్ష్యాన్ని నిర్దేశించడం జరుగుతుందని, ముఖ్యంగా మండల బృందాల ద్వారా అవుట్ పేషెంట్ల సంఖ్యను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు తప్పనిసరిగా వైద్యం కోసం వచ్చిన రోగుల నుండి మొబైల్ నెంబర్ను రిజిస్టర్ చేసుకోవాలని, ఓపిని పద్ధతి ప్రకారం నిర్వహించాలని తెలిపారు.ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని, సిజేరియన్లు తగ్గించాలని అన్నారు. గ్రామ స్థాయి నుండి ఆశ వర్కర్ సరైన విధంగా పనిచేయాలని గ్రామ స్థాయి బృందంతో కలిసి పని చేయాలని ఆదేశించారు .ప్రతి గర్భిణి తప్పనిసరిగా వైద్యారోగ్య కేంద్రంలో నమోదు కావాలని, ఒకవేళ ఏఎన్సీ జరగకుండా నేరుగా కాన్పుకు వచ్చినట్లయితే సంబంధిత ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావాలు నమోదు కావడంపై ఈ అంశాన్ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ప్రస్తావిస్తూ గర్భస్రావాలు కావడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, ఉప కేంద్రాలు సైతం క్రమ పద్ధతిలో పనిచేయాలని, ఇకపై వైద్య ఆరోగ్యశాఖ సంబంధించి ప్రతి రెండు వారాలకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు సరైన వైద్యం అందించడమే కాకుండా, మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్యశాఖ పనిచేయవలసిన అవసరం ఉందని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళ్యాణ చక్రవర్తి, డిసి హెచ్ఎస్ మాతృనాయక్ తదితరులు హాజరయ్యారు.

Spread the love