ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తాం

– మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
నవతెలంగాణ- కోహెడ 
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మండల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంబేద్కర్ చేరస్తా వరకు ర్యాలీగా చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ గార్డెన్ లో కార్యకర్తలతో మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో గ్రామాల వారిగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను అమలు పరుస్తామని, మొదటి దశగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. బి ఆర్ ఎస్ నాయకులు ఓటమిని ఓర్చుకోలేకనే ఆరోపణలు మోపుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు సైతం ఉచితంగా పంపిణీ చేసిన తీరును బిఆర్ఎస్ ప్రభుత్వం తట్టుకోవడం లేదన్నారు. కాలేశ్వరం బ్రిడ్జిలో జరిగిన అవినీతిని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ లో సైతం అనేక అవినీతి జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలబడుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం పట్ల ఇతర పార్టీలు జీర్ణించుకోవడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్వరాజు శంకర్, శెట్టి సుధాకర్, బందెల బాలకిషన్, మోహన్ రెడ్డి, వేల్పుల వెంకటస్వామి, చింతకింది శంకర్, దొమ్మాట జగన్ రెడ్డి, ముంజ తిరుపతి, కొంకటి దామోదర్, గూడ స్వామి, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love