– పాకిస్థాన్ పర్యటనపై రాజీవ్ శుక్లా
కాన్పూర్ : భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. 2008 నుంచి పాకిస్థాన్ పర్యటనకు భారత జట్టు వెళ్లటం లేదు. ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే పాకిస్థాన్‌తో పోటీపడుతుంది. వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫికి పాకిస్థాన్ వేదికగా నిలువనుంది. 2023 ఐసీసీ వరల్డ్‌కప్‌కు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. భారత్ సైతం చాంపియన్స్ ట్రోఫి కోసం పాక్‌కు వస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ విషయంలో ఒకే మాటపై నిలబడుతూ వస్తోంది!. పాకిస్థాన్ సహా ఏ దేశ పర్యటనకు అయినా భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వెళ్తామని చెబుతోంది. బీసీసీఐ సీనియర్ ఆఫీస్ బేరర్ రాజీవ్ శుక్లా మరోసారి ఈ విషయం స్పష్టం చేశాడు. కాన్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు సందర్భంగా రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి కోసం పాకిస్థాన్‌కు వెళ్లటంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ పర్యటనలకు మాకు ఓ విధానం ఉంటుంది. విదేశీ పర్యటనలకు భారత జట్టు వెళ్లాలా? వద్దా? అనే అంశం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ అదే పాలసీ ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ పాటిస్తుంది’ అని రాజీవ్‌శుక్లా తెలిపారు.