– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-ములుగు డెస్క్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని సవరించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. వాజేడు మండలం మండపాకలో వ్యకాస రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటి జాగాలు, ఇండ్ల నిర్మాణం, సాగుభూమి, ధరణి సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించాలని అన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం దేశవ్యాప్తంగా అక్టోబర్ 11వ తేదీ నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ఉపాధి హామీ చట్టాన్ని దూరం చేయాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే బడ్జెట్లో నిధుల తగ్గింపు, పని ప్రదేశాల్లో ఆన్‌లైన్ హాజరు నమోదు, ఆధార్ ప్రతిపాదన ద్వారా కూలీలకు డబ్బులు, జాబ్ కార్డుల తొలగింపు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్న కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వాల విధానాల వల్ల అసంఘటిత రంగంలో పనులు దొరక్కపోవడంతో పేదల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డు ఏరివేత పేరుతో పేదలకు రేషన్ బియ్యం దక్కకుండా చేస్తుందన్నారు. కేవైసీ మరో రెండు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.నాగయ్య వెంకట్రాములు, నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, కనకయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి ప్రసాద్, బి రెడ్డి సాంబశివ, గ్యానం వాసు తదితరులు పాల్గొన్నారు.