Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దపల్లి జిల్లా ఐకేపీ కేంద్రంతో ధాన్యం బస్తాలు దగ్ధం

పెద్దపల్లి జిల్లా ఐకేపీ కేంద్రంతో ధాన్యం బస్తాలు దగ్ధం

- Advertisement -

కరీంనగర్ జిల్లా కాసింపేట శివారులో అగ్నిప్రమాదం
నవతెలంగాణ -జూలపల్లి/గన్నేరువరం
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో చేతికొచ్చిన పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఆరుగాలం కష్టం కాస్తా అగ్నిపాలవడంతో సదరు రైతు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాపూర్ గ్రామ శివారులోని రైతు వేదిక సమీపంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్లు ఒకదానికొకటి తాకడంతో (షార్ట్ సర్క్యూట్) ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ నిప్పురవ్వలు కాస్తా క్షణాల వ్యవధిలో వ్యాపించాయి. అక్కడ ఉన్న రైతు కనకం శంకరయ్యకు చెందిన ధాన్యం బస్తాలు సుమారు 130 వరకు కాలిపోయాయి. మంటలను గమనించిన రైతులు, గ్రామస్తులు వెంటనే నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అప్పటికే వరి ధాన్యం బస్తాలు కాలిపోయాయి. ఎంతో ఆశతో కల్లానికి తెచ్చుకున్న పంట ఇలా కండ్ల ముందే బుగ్గిపాలవడంతో బాధిత రైతు గుండె పగిలి కన్నీరుమున్నీరుగా విలపించాడు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ వైర్లను సరిచేయాలని ఎన్ని సార్లు వేడుకున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన పంట చేతికందకుండా పోవడంతో ఆ రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ , రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, అబ్బాపూర్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామ శివారులోఁ బట్టపల్లికుంటపైన ఉన్న రైతుల వ్యవసాయ భూముల వద్ద ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వడ్లూరు, పారువెల్ల, కాసింపేట శివారులో బొజ్జ రాములు, ఓరుగంటి సంపత్ కు చెందిన వ్యవసాయ భూములు, పక్కనే పారువెల్లకు చెందిన రైతుల భూములున్నాయి. వరి పొలంలో నుంచే మంటలు చెలరేగి సుమారు 10 ఎకరాలు కాలుకుంటూ సంపత్ కు చెందిన బోరు, సర్వీస్ వైరు, స్టార్ట్ డబ్బా, ఆస్తిక్ పైపు, 10 స్ప్రింకర్లు పైపులు కాలిపోయి సుమారు రూ 1.50 లక్షల నష్టం జరిగింది. బొజ్జ రాములుకు చెందిన 200 గడ్డి కట్టలు, 10 స్ప్రింక్లర్లు పైపులు, పెద్ద టార్పలైన్ కవర్లు రెండు, కేసింగ్ పైపు దగ్ధమయ్యాయి. దుడ్డే మత్యువాతపడింది. దాంతో సుమారు రూ.1లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -