ప్రకృతికి కృతజ్ఞత

Gratitude to natureరాజు నిద్ర లేచాడు. గోడకేసి చూశాడు. సమయం ఉదయం 8 గంటలైంది. పక్క మీద నుంచి కిందకు దిగాడు. అమ్మా! అని పిలిచాడు.
గదిలోకి వచ్చిన తల్లి ‘ఏం నాయనా! ఆదివారం బడి లేకపోతే హాయిగా ముసుగు తన్నటమేనా! అన్నది.
‘నిద్ర బాగా పట్టిందమ్మా!’ అన్నాడు.
‘నీతో కబుర్లు చెబుతుంటే నా పనులు ఆగిపోతాయి. ఇప్పుడు నేను పూజ చేసుకునే సమయం. నువ్వు పండ్లు తోముకుని, స్నానం చేసి రా’ అన్నది.
‘ఎందుకమ్మా!’ అన్నాడు రాజు.
‘నువ్వు నేను చెప్పినట్లు విను. త్వరగా స్నానం చేసి పూజకు పూలు కోసుకుని రా’ అన్నది.
రాజు చకచకా స్నానం చేసి తల్లి దగ్గర సజ్జ(బుట్ట) తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ రకరకాల పూలచెట్లు కనపడ్డాయి. రాజు పూలను చూస్తూ తనని తాను మైమరచిపోయాడు. సజ్జ పక్కనబెట్టి పూలు కోయసాగాడు. ఒక చేత్తో చిన్నకొమ్మలను వంచి రెండో చేత్తో పూలు కోసి సజ్జలో వెయ్యసాగాడు. సజ్జ పూలతో నిండిపోయింది. రాజు రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన పూలను కూడా కోయసాగాడు. ఇంతలో రాజుకు ఏవో మాటలు వినపడ్డాయి. చుట్టూ చూశాడు. ఎవరూ కనపడలేదు. మళ్ళీ పూలు కోయటంలో మునిగిపోయాడు. మళ్ళీ మాటలు వినపడ్డాయి. ఆ మాటలు సమీపం నుంచి వస్తున్నాయని గ్రహించాడు. చివరకు పూల చెట్లు మాట్లాడుకుంటున్నాయని తెలుసుకున్నాడు.
ఆశ్చర్యంతో వాటిని ఉద్దేశించి ‘మీకు మాటలు వచ్చా.. మాట్లాడుకుంటారా?’ అని ప్రశ్నించాడు.
అవి రాజుతో ‘మేము మాట్లాడుకుంటాం. చెట్లకు ప్రాణం వుందని జగదీష్‌ చంద్రబోస్‌ పరిశోధనలో తెలిసిందిగా! ఆయన ఇప్పటికీ బతికివుంటే చెట్లు మాట్లాడుతాయని కూడా చెప్పేవారు’ అన్నాయి.
రాజుకి వాటి మాటలు ఆశ్చర్యాన్ని.. ఆసక్తిని కలిగిస్తున్నాయి. వాటితో ‘మీరు ఎవరి గురించి.. దేని గురించి మాట్లాడుకుంటున్నా’రని అడిగాడు.
‘నీ గురించే’ అన్నాయి.
‘నా గురించా .. నేనేం చేశాను?’ అన్నాడు.
మొదటగా మల్లె, మందార, గులాబీలు మాట్లాడుతూ ‘మీ అమ్మగారు ప్రతిరోజూ మమ్మల్ని దేవుళ్ళ చిత్రపటాలకు అలంకరించి పూజ చేస్తారు’ అన్నాయి.
‘నేను కూడా అమ్మ పూజ కోసం కోసుకెళుతున్నా కదా!’ అన్నాడు రాజు.
దానికి పూలు మాట్లాడుతూ ‘మీ అమ్మ గారు పూజకు పూలు కోసుకెళతారు. కానీ కొన్ని పూలు వదిలేస్తారు. నీలా మొత్తం పూలన్నీ కోయరు’ బాధగా అన్నాయి మల్లె, మందార, గులాబీ.
‘కోస్తే తప్పేంటి?’ అన్నాడు రాజు.
దానికి ఆ పూలు ‘మీరే భగవంతుని పూజించాలా.. మేం వద్దా?’ అని ప్రశ్నించాయి.
దానికి రాజు పెద్దగా నవ్వసాగాడు.
‘అదేంటి! ఎందుకు నవ్వుతున్నావు?’ అన్నాయి ముక్తకంఠంతో పూలు.
‘మీరేంటి .. పూజేంటి?’ అన్నాడు రాజు.
దానికి అవి ‘మీరు పూలతో దేవుని అలంకరించి భక్తితో పూజించి కోరికలు కోరతారు. మేము కూడా మమ్మల్ని పుట్టించి మాకు గాలి, నీరు, సూర్యరశ్మిని అందజేస్తున్న ప్రకతిని పూజిస్తాం. ప్రకతి లేకపోతే మేం లేం. మేం ఎక్కడికీ కదలలేం. అందువల్ల ఉన్నచోటు నుంచే మీరు కోయగా మిగిలిన పూలతో దేవునికి కతజ్ఞతలు చెప్పుకుంటాం’ అన్నాయి.
రాజుకి ఆశ్చర్యం వేసింది. దాంతో అతనికి తానెంత పొరపాటు చేసింది అర్థమైంది. వెంటనే చెట్ల పైనుంచి చేతులు తీసేశాడు. మల్లె, మందార, గులాబీలతో ‘మీరిచ్చే పూలతోనే దేవుని పూజించి కోరరాని కోరికలు కోరతాం. అలాంటి చెట్ల మీద ఒక్క పువ్వూ లేకపోతే మీరెంత బాధపడతారో తెలిసింది. నన్ను క్షమించండి’ అన్నాడు రాజు.
మన మధ్య క్షమాపణలు ఏంటి? మీరూ, మేమూ పూజించేది భగవంతుడినే. భగవంతుడు అంటే ప్రకతి.. ప్రకతి అంటే భగవంతుడు. రేపటి నుంచి నాలుగు పూలను చెట్ల మీద వదిలేస్తే తాము కూడా ప్రకతిని ఆరాధిస్తామని చెప్పాయి. అందమైన పూలతో కళకళలాడేలా చేస్తున్న ప్రకతికి కతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత తమకు వుందని మల్లె, మందార, గులాబీ అన్నాయి. వాటి మాటలతో ఏకీభవించిన రాజు కోసిన పూలతో అమ్మ వద్దకు వెళ్ళాడు.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, ,
9492309100.

Spread the love