ఘనంగా బోనాల ఉత్సవాలు

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-బేగంపేట్‌
బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామనీ, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద వచ్చే నెల 9వ తేదీన నిర్వహించే బోనాలు, 10వ తేదీన నిర్వహించే రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు నిర్వహణ, ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ ఆషాడ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారనీ, నాటి నుంచి అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామనీ, లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు అరకొర ఏర్పాట్లు చేసేవారని పేర్కొన్నారు. మన సంస్కతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రజలు సంతోషంగా, గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతోనే ప్రైవేట్‌ ఆలయాలకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందనీ, ఇందుకు ఈ ఏడాది రూ.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. బోనాల ఉత్సవాలకు ముందే ఈ ఆర్ధిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఆలయ కమిటీల నిర్వహకులు తమ దరఖాస్తులను త్వరితగతిన దేవాదాయ శాఖ అధికారులకు అందజేయాలని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసి ఇక్కడకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు వివరించారు. బంగారు బోనం చేయించి అమ్మవారికి సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది కూడా వెయ్యి మంది సాంస్కతిక శాఖ కళాకారుల ప్రదర్శనతో అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్టు చెప్పారు. బోనాల సందర్బంగా 9వ తేదీన తెల్లవారు జాము నుండే మహిళలు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తారని తెలిపారు. వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని వీధులు, ప్రధాన రహదారుల్లో స్ట్రీట్‌ లైట్‌ లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, బోనాలు తీసుకొచ్చే వారి కోసం ప్రత్యేక క్యూ లైన్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. శివ సత్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిపేందుకు శాంతి భద్రతల నిర్వహణకు పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం తాత్కాలికంగా సీసీ కెమెరాలను అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జనరేటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. ఆలయానికి వచ్చే రహదారుల్లో వాహనాలను మళ్ళించే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులను మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్‌ హెల్త్‌ క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్య సమాజ్‌, దక్కన్‌ మానవ సేవా సమితి, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తదితర స్వచ్చంద సంస్థల సభ్యులు ప్రతి ఏడాదీ బోనాల సందర్బంగా భక్తులకు తమ సేవలను అందిస్తారని ప్రశంసించారు. స్వచ్చంద సేవకులు, ఆలయ కమిటీ సభ్యులకు ఫోటోలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులను అందజేస్తామని చెప్పారు. బోనాల ఉత్సవాలను వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వీక్షించే విధంగా వివిధ టీవీ చానళ్ళలో ప్రత్యక్ష ప్రసారం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయ పరిసరాల్లోని భక్తుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్దం వివిధ ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తారని చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, వాటర్‌ వర్క్స్‌ ఎండీ దాన కిషోర్‌, కార్పొరేటర్‌లు సుచిత్ర, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ అత్తిలి అరుణ గౌడ్‌, ఆలయ ట్రస్టీ కృష్ణ, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ జ్యోతి, డిప్యూటీ కమిషనర్‌ రామక్రిష్ణ, మహంకాళి ఆలయ ఈఓ మనోహర్‌ రెడ్డి, నార్త్‌ జోన్‌ డీసీపీ చందనా దీప్తి, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ రంగారావు, అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వసంత, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మహంకాళి ఏసీపీ రమేష్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకట్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రవీంద్ర మోహన్‌, ట్రాన్స్‌ కో ఎస్‌ఈ రవి కుమార్‌, టూరిజం సీఈ వెంకటరమణ, సాంస్కతిక శాఖ అధికారి నాగరాజు, ఆర్టీసీ రాణిగంజ్‌ డిపో మేనేజర్‌ లక్ష్మి ధర్మా, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌, ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ రాధాకృష్ణ, భారత్‌ స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌ చందర్‌, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love