గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి

– సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌ రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కోరారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ కోసం ఒక పోస్టుకు వంద మంది నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా వంద మందిని అనుమతించారనీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేతగా అసెంబ్లీ వేదికగా ఇదే అంశాన్ని డిమాండ్‌ చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా? అధికార పక్షంలోకి వస్తే మరోలా ఉండటమే మీ విధానమా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్‌ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్‌ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలపాలని డిమాండ్‌ చేశారు.
పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎక్కువ వ్యవధి ఉండే విధంగా షెడ్యూల్‌ సవరించాలని సూచించారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి తదనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 25 వేల పోస్టులతో మెగా డియస్సీని నిర్వహించాలనీ, నిరుద్యోగ భృతి కింద రూ.4 వేలు నెలనెలా చెల్లించాలని కోరారు. జీవో 46తో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.
పోచారం రాజీనామా చేయాలి : బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు ఏ .జీవన్‌ రెడ్డి, గణేష్‌ బిగాల డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి సిగ్గు లేకుండా పోచారాన్ని చేర్చుకున్నారని విమర్శించారు. ఆయన రైతుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లలేదని రాళ్ల (క్రషర్‌) కోసం వెళ్లారని విమర్శించారు. బాన్సువాడలో ఉప ఎన్నిక జరగడం తథ్యమనీ, మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love