సగం అద్దెకు…సగం ఇంటికి

Half for rent...half for home– అద్దె భవనాల్లో అంగన్‌వాడీల అవస్థలు
– 10 నెలల అద్దె.. మూడు నెలల వేతనాలు పెండింగ్‌
– అధిక పని ఒత్తిడితో సతమతం
– ఇబ్బందుల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
అద్దె గదుల్లో నడుస్తున్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం నుంచి అద్దెలు రావడం లేదు. భవన యజమానుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక.. వచ్చిన జీతాల్లో నుంచే సగం అద్దెకు.. సగం ఇంటికి.. అన్నట్టు వారు సర్దుబాట్లు చేసుకుంటూ నడుపుతున్నారు. ఓ వైపు అద్దె భవనాల అద్దె కట్టలేక.. మరోవైపు సొంత భవనాలున్న కేంద్రాల్లోనూ సరైన వసతులు లేక సతమతమవుతున్నారు. మరోపక్క అందులో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకూ మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు పలు రకాల పనుల ఒత్తిడితో మానసికంగా కుంగిపోతున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా చొరవ చూపడం లేదని అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు చెబుతున్నారు.
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 793 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 751 మంది టీచర్లు, 741 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఆరేండ్ల వయసు పిల్లలు 90,361 మంది, గర్భిణులు, బాలింతలు 17,123 మందితో కలిపి మొత్తం 1,07,484 మంది ఉన్నారు. కుత్బుల్లాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో 311 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 47,028 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉన్నారు. మేడ్చల్‌ పరిధిలో 211 అంగన్‌వాడీ కేంద్రాల్లో 39,463 మంది, అల్వాల్‌ పరిధిలోని 271 అంగన్‌వాడీ కేంద్రాల్లో 20,993 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఉన్నారు.
సొంత భవనాల్లేక..
జిల్లాలోని 793 అంగన్‌వాడీ కేంద్రాల్లో 212 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇవి కాకుండా దాతలు ఉచితంగా ఇచ్చిన 138 భవనాల్లో కూడా అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మిగిలిన 443 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కుత్బుల్లాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో 311 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 277 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అల్వాల్‌ పరిధిలో 271 కేంద్రాలకుగాను 143 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మేడ్చల్‌ పరిధిలో 211 కేంద్రాలకు గానూ 23 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
తాగునీటి కొరత.. మరుగుదొడ్ల సమస్య..
దాదాపు 100కుపైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు తదితర సౌకర్యాల్లేవు. ఇందులో మేడ్చల్‌ ప్రాజెక్టు పరిధిలో 211 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా 77 కేంద్రాల్లో తాగునీటి కొరత వెంటాడుతోంది. ఇక అల్వాల్‌ ప్రాజెక్టు పరిధిలో 40 కేంద్రాల్లో నీటి సమస్య నెలకొంది. అలాగే జిల్లాలోని దాదాపు 100కుపైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు. ఇందులో మేడ్చల్‌ ప్రాజెక్టు పరిధిలో 78, అల్వాల్‌ ప్రాజెక్టు పరిధిలో 51, కుత్బుల్లాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో 40 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల వసతి లేదు. అద్దె భవనాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇచ్చే అద్దె చాలా తక్కువ కావడంతో టాయిలెట్స్‌ కట్టించి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
పెండింగ్‌..
జిల్లాలో 443 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నాయి. ఈ అద్దె భవనాలకు 10 నెలలుగా సర్కార్‌ అద్దె డబ్బులు చెల్లించకపోవడంతో టీచర్లు, ఆయాలు ఇంటి యాజమానుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. టీచర్లకు వచ్చే రూ.13,650 వేతనంలో రూ.4వేల వరకు అంగన్‌వాడీ సెంటర్‌ అద్దె చెల్లించి మిగిలిన రూ.రూ.9,650తో కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు కూడా మూడు నెలలుగా వేతనాలు అందలేదు.
అధికారుల వేధింపులు
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను మహిళా సూపర్‌వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ ఇవ్వకుండా, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడకుండా ఓటర్‌ ఐడీ, ఎలక్షన్‌ డ్యూటీ, మిషన్‌ భగీరథ లాంటి పనులు చేయాలని, లేదంటే మెమోలు జారీ చేస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా వరుసగా మూడు మెమోల జారీ అనంతరం విధుల్లో నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలకు డబ్బులు ఇవ్వడం లేదు. 24 గంటలూ అందుబాటులోకి ఉండాలని, కొన్ని సందర్భాల్లో రాత్రి 12 గంటల వరకు పని చేపిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ‘కడుపుకు అన్నం తింటున్నావా..? గడ్డి తింటున్నావా..? ఏం పీకడానికి వస్తున్నావు’ అని అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. బుక్స్‌, జిరాక్స్‌ తదితర ఖర్చులను కూడా తామే భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. కూరగాయలు, గ్యాస్‌ బిల్లులు ఇవ్వడం లేదు. గుడ్లు సకాలంలో అందడం లేదని చెబుతున్నారు.
వేధింపులను అరికట్టాలి
ఉన్నికృష్ణన్‌, సీఐటీయూ కోశాధికారి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా
అంగన్‌వాడీ సెంటర్లలో పని చేస్తున్న టీచర్లు, ఆయాలపై జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారుల వేధింపులను అరికట్టాలి. వచ్చిన వేతనంతో సగం అంగన్‌వాడీ కేంద్రాల అద్దెకు, మిగతా సగం కూరగాయలు, గ్యాస్‌, ఇతరత్రాలకు ఖర్చు చేస్తూ కాలం వెల్లదీస్తుంటే.. అధిక పని ఒత్తిడి, మానసికంగా ఇబ్బందులు పెట్టడం సరికాదు. వెంటనే 10 నెలల అద్దె, మూడు నెలల వేతనాలు చెల్లించాలి. సౌకర్యాలే సరిగా కల్పించలేని సర్కార్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది.

Spread the love