అతనిది మానసిక సమస్యే…

ఈ సమాజంలో మహిళల జీవితం అంటేనే సమస్యల వలయం. ఎటు నుండి ఎలాంటి సమస్య వచ్చి పడుతుందో ఊహించడం కష్టం. పెండ్లి తర్వాత చాలా మంది విషయంలో భర్త మంచిగా చూసుకుంటే అత్తమామలు, ఆడపడుచులు, తోటి కోడళ్ళు ఇలా ఎవరో ఒకరు సమస్యగా మారతారు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. కుటుంబంలో అందరూ ఆమెను ప్రేమగా చూసుకుంటారు. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు. కానీ అక్కున చేర్చుకోవల్సిన భర్త మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి కష్టమే వచ్చింది 27 ఏండ్ల సుజాతకు. తన సమస్య నుండి ఎలా బయట పడిందో, భర్తను ఎలా మార్చుకుందో ఈ వారం తెలుసుకుందాం…
సుజాతది పెద్దలు కుదిర్చిన వివాహం. పెండ్లయి నాలు గేండ్లు అవుతుంది. భర్త పేరు విజరు. వీరికి తొమ్మిది నెలల పాప ఉంది. విజరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబంలో అందరూ కలిసి మెలిసి ఉంటారు. అత్త, మరిది ఆమెతో ఎంతో అప్యాయంగా ఉంటారు. తోటి కోడలు, బావ మాత్రం వేరేగా ఉంటారు. అయినా సుజాత అంటే ఎంతో అభిమానం. ఆడపడుచు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ఆమె విజరు కంటే పెద్దది. సుజాతను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. ఆమెకు ఏం కావాలన్నా తనే ఇస్తుంది. అత్త కూడా కూతుర్ని ఎలా చూసుకుంటుందో కోడళ్లను కూడా అలాగే చూసుకుంటుంది. ఇప్పుడు సమస్య మొత్తం ఆమెకు భర్తతోనే.
పెండ్లయిన తర్వాత మూడు నెలలు అందరూ కలిసి మంచిగానే ఉన్నారు. తర్వాత విజరు ‘నేను కూడా అన్నయ్యలా వేరే కాపురం పెడతా’ అనడం మొదలుపెట్టాడు. అందరూ ఎంత వద్దని చెప్పినా వినిపించుకోలేదు. దాంతో అక్క వచ్చి ‘అన్నయ్య కంటే వదినకు గవర్నమెంట్‌ ఉద్యోగం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ నీ పరిస్థితి వేరు. వేరే కాపురం అంటే ఖర్చులు బాగా ఉంటాయి. నీ జీతం తక్కువ. అందులోనే ఇంటి కిరాయి కట్టుకోవాలి. ఇప్పుడంటే మీరిద్దరే. రేపు పిల్లలు పుడితే ఖర్చులు ఇంకా పెరుగుతాయి. ఇదంతా నీ వల్ల కాదు. నీకు అంతగా వేరు కాపురం పెట్టాలి అని ఉంటే తమ్ముడి పెండ్లి తర్వాత చూద్దాంలే. ఈలోపు నీ పెండ్లికి చేసిన అప్పు తీర్చుకో. ప్రతి నెలా ఐదు వేలు తెచ్చి అమ్మ చేతికివ్వు. అప్పు తీరిపోయిన తర్వాత ఓ చిన్న ఇల్లు కొనుక్కొని అందులో ఉండొచ్చు. ఇంటి అద్దె బదులు ఈఎంఐ కట్టుకోవచ్చు. అప్పుడు ఇల్లైనా మిగులుతుంది. ఇప్పుడు మాత్రం వేరు కాపురం అనే ఆలోచన పెట్టుకోకు’ అని చెప్పి వెళ్ళిపోయింది.
అక్క ఎంత చెప్పినా విజరుకి కలిసి ఉండటం నచ్చలేదు. ఎలాగైనా వేరే ఉండాలని మొండి పట్టుదల పట్టాడు. ఉద్యోగానికి వెళ్ళడం కూడా మానేశాడు. ఇంట్లో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. దాంతో ‘ఈ ఇంట్లో మీరే ఉండండి, నేనూ, తమ్ముడు వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం’ అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది. కానీ విజరులో మాత్రం మార్పు రాలేదు. చిన్న మాట అన్నా ఉద్యోగం మానేస్తున్నాడు. పెండ్లి తర్వాత ఇప్పటికి నాలుగైదు సార్లు ఇలాగే చెప్పాపెట్టకుండా మానే శాడు. దాంతో ఈ సారి వాళ్ళ సార్‌ సుజాతకు ఫోన్‌ చేసి ‘నువ్వు లెటర్‌ రాసి ఇస్తేనే, నేను విజరుని ఉద్యోగంలోకి తీసుకుంటాను’ అన్నాడు.
తన కుటుంబం కోసం సుజాత భర్త తరపున లెటర్‌ రాసి ఇచ్చింది. కానీ అతనిలో మార్పు లేదు. పైగా సుజాత బంగారం మొత్తం తాకట్టు పెట్టాడు. అప్పులు కూడా బాగా చేశాడు. ఆరు నెలల నుండి ఇంటి అద్దె కూడా కట్టడం లేదు. ఇలాంటి సమస్యల మధ్యనే వాళ్ళకు పాప పుట్టింది. అయినా విజరులో మార్పు లేదు. ఉద్యోగం పూర్తిగా మానేశాడు. ఇక భరించలేక నాలుగు నెలల ముందు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. వాళ్ళ ముందు ‘ఇకపై అప్పులు చెయ్యను. ఉద్యోగానికి కూడా వెళతాను’ అని చెప్పాడు. కానీ అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆఫీస్‌కి వెళ్ళడం లేదు. సుజాతకు భర్తను ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు. వాళ్ళ ఖర్చులన్నీ ఆడపడుచే చూసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలిసిన వారు చెబితే సమస్య పరిష్కారం కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. తన సమస్య మొత్తం చెప్పుకుని ‘ఇలాంటి వ్యక్తితో నేను జీవితాంతం ఎలా ఉండాలి’ అంటూ కన్నీరు పెట్టుకుంది.
మేము విజరుతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ పిలిపించాము. సుజాత చెప్పినట్టు కుటుంబ సభ్యులందరూ ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ‘మమ్మల్ని నమ్మి మా ఇంటికి వచ్చిన అమ్మాయిని మేము మంచిగా చూసుకోకపోతే ఎలా? నేను నా కోడళ్లను, కూతుర్ని ఒకేలా చూసుకుంటాను. అందుకే మేము ఉంటున్న ఇల్లు కూడా వదిలేసి మా పెద్దబ్బాయి దగ్గరకు వెళ్ళిపోయాము. సుజాత, తన బిడ్డ ఖర్చులన్నీ మా అమ్మాయే చూసుకుంటుంది. మా విజరు అసలేం పట్టించుకోవడం లేదు. మార్చాలని ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. రోజు రోజుకు మరీ మొండిగా తయారవుతున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇలా ప్రవర్తించే వారు మా కుటుంబంలో ఎవ్వరూ లేరు’ అంటూ విజరు తల్లి చాలా బాధ పడింది.
విజరుతో మాట్లాడితే ‘అతనిలో తప్పు చేస్తున్నాననే భావన ఏ మాత్రం కనిపించలేదు. ఏం అడిగినా మొండిగా సమాధానం చెబుతున్నాడు. ‘మాకు ఏ అవసరం ఉన్నా మా అక్క చూసుకుంటుంది’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ‘నీ భార్యా, బిడ్డలకు సంబంధించిన విషయాలు ఆమెందుకు చూసుకుంటుంది’ అంటే వినిపించుకోడు. అలా కొద్దిసేపు అతనితో మాట్లాడితే ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు మాకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పాము. వారికి కూడా అదే అనుమానం వచ్చినట్టు చెప్పారు. వెంటనే విజరుని సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్ళి కౌన్సెలింగ్‌ ఇప్పించమని, మంచి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్ళి మందులు వాడమని చెప్పాము.
మేము చెప్పిన ప్రకారమే వాళ్ళు ఓ డాక్టర్‌ని కలిశారు. విజరు సైకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్ళి కౌన్సెలింగ్‌ కూడా తీసుకుంటున్నాడు. ఇప్పటికి మూడు వారాలు అవుతుంది. విజరులో ఈ మధ్య కొద్దికొద్దిగా మార్పు వస్తుందని సుజాత చెప్పింది. భార్యా, బిడ్డల పట్ల బాధ్యతగా ఉంటున్నాడు. గతంలో వలె మొండిగా మాట్లాడడం లేదు. అయితే అతను పూర్తిగా మామూలు మనిషై ఉద్యోగానికి పోవడానికి ఇంకా మూడు నాలుగు నెలలు పట్టొచ్చని డాక్టర్‌ చెప్పారు. భర్తలో వస్తున్న మార్పుకు సుజాత చాలా సంతోషించింది. తమ్ముడి కుటుంబ ఖర్చులతో పాటు వైద్యం ఖర్చులు కూడా సుజాత ఆడపడుచే చూసుకుంటుంది. తమ్ముడి పట్ల ఇంత బాధ్యతగా ఉంటున్న ఆమెను మేము అభినందించాము. అందరూ ఇలా కోడలిని అర్థం చేసుకుంటూ, సొంత మనిషిలా భావిస్తూ, ఆమెకు అండగా నిలబడితే మహిళలు ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలరని సుజాత జీవితం నిరూపించింది.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love