మైలవరం మహిళా రైతు విజయ ప్రస్థానం

Victory of Mylavaram women farmerరజినీ రెడ్డి… ఎం.కాం చేసి జీవనోపాధి కోసం ఎన్ని ప్రైవేటు ఉద్యోగాలు చేసినా ఏదీ సంతృప్తినివ్వలేదు. ‘ఇది కాదు నేను చెయ్యాల్సిన పని, నా కిష్టమైన పని’ అనుకుంది. మనసు మూలల్లో దాగివున్న కోరిక తన కర్తవ్యాన్ని, అభిరుచిని తట్టిలేపింది. మట్టితో పెనవేసుకున్న తన అను బంధాన్ని మనసుతో దర్శించింది.అదే ఆమెకు ఆరో ప్రాణమైన వ్యవసాయం. అంతే ఇక మరో ఆలోచన లేకుండా ఊరిబాట పట్టి సాగు మొదలుపెట్టింది.
రజినీ కరీంనగర్‌ జిల్లా, గన్నేరువరం మండలం, మైలవరం గ్రామంలో పుట్టి పెరిగింది. వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నప్పటినుండి పొలం పనులంటే ఎంతో ఇష్టం. సెలవు రోజుల్లో తల్లిదండ్రులకు సహాయపడేది. తర్వాత ఉన్నత విద్య, వివాహం ఆమె జీవితాన్ని మరో మలుపుకి తీసుకు వెళ్ళాయి. ఎన్నో కంపెనీల్లో ఉద్యోగాలు చేసింది. కానీ ఏవీ ఆమెకు తృప్తినివ్వలేదు. దాంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. దానికి భర్త రమణా రెడ్డి సహకారం కూడా తోడయింది. ఆయనకూ ఊరన్నా, వ్యవసాయం అన్నా ఎంతో మమకారం.
సమాజ సేవ చేయాలనుకున్నారు
కొంత కాలం ఉన్నత విద్య, ఉద్యోగం కారణంగా దెన్మార్క్‌లో ఉండి తిరిగి హైదరాబాద్‌ వచ్చి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన రమణా రెడ్డికి ఎప్పుడూ ఏదో వెలితిగా అనిపించేది. నెల తిరిగేసరికి నాలుగంకెల జీతం చేతిలో పడ్తున్నా, ఇంకా జీవితంలో ఏదో శూన్యత, అసంతృప్తి. అప్పుడే సహచరి ప్రపోజల్‌ అతన్ని ఆలోచింపచేసింది. అయితే ఆ వ్యాపారం కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉండ కూడదు అనుకున్నారు ఆ దంపతులు. అందులో సేవా దృక్పథం సమ్మిళితం కావాలనుకున్నారు. తమ వంతు సమాజ సేవ చేయాలనుకున్నారు. అందుకే ఇద్దరూ ఊరి బాట పట్టారు. సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం, దేశీ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభించారు.

కల్తీలేని ఆహారం…
ముందుగా తమకున్న కొద్దిపాటి భూమిలో సేంద్రీయ విధానంలో వరి పండించి మంచి దిగుబడిని సాధించారు. వ్యా పార అవసరాల కన్నా, తమ కుటుంబ అవస రాలకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించారు. కల్తీ లేని, హానికారక మందుల్లేని బియ్యం, దేశీ ఆవు పాలు, పాల పదార్థాలు, పండ్లు, కూరగాయలు తమ కుటుం బ అవసరాలకు సరిపోగా, మరో పది, పదిహేను కుటుంబాలకు అందించడం ఎంతో తృప్తినిచ్చింది అంటారు రజినీ. రానురాను దీన్ని మరింత విస్త రించి మరికొన్ని కుటుంబాలకు సేవలందిస్తున్నారు రజినీ.
ప్రజారోగ్య దిశగా….
కొద్దిపాటి భూమిలో సేంద్రీయ విధానంలో వరి సాగు చేస్తున్నా, మిగతా ఎకరం భూమిలో ఏదైనా నూతనంగా, ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక పంటను సాగుచేస్తే బాగుండు అనిపించింది ఆమె కు. దాని ఫలితమే పాలీ హౌజ్‌లో తెల్ల చేమంతి వనాలను పెంచడం. తెలంగాణ రాష్ట్రంలో, అందునా కరీంనగర్‌ జిల్లా ఓ మారుమూల పల్లెలో ఓ సన్నకారు మహిళా రైతు ఈ చేమంతి పంట పండించాలనుకోడం ఓ వినూత్న ప్రయోగం మాత్రమే కాదు అందుకు తగినంత గుండెబలం కూడా కావాలి. ప్రభుత్వ సబ్సిడీపై ప్రాజెక్ట్‌ మొదలు పెట్టిన ఆమె మహారాష్ట్ర నుండి చేమంతి మొక్కలు తెచ్చి పెంచారు. అయితే మొదట్లో తోట నష్టాల్ని మిగిల్చింది. మళ్లీ ఆశావహ దృక్పథంతో జిల్లా ఉద్యానవన అధికారి సూచనలతో, మదర్‌ ప్లాంట్‌ తయారు చెయ్యడం నేర్చుకున్నారు. ఆ విధానంతో ఈసారి పూల తోట రాబడిని సాధించారు. అసలైతే 1,50,000 పూల మొక్కలు నాటితే ఒక పంటలో 15,000 గుచ్ఛాలు రావాలి. కానీ అధిక వర్షాల వల్ల అంత దిగుబడి పొందలేకపోయారు. కానీ క్రమంగా పంటలోని మెళకువలు తెలుసుకుని 9,000 గుచ్ఛాలను తేగలిగారు.
మార్కెట్‌ విస్తరించుకుంటూ…
తాను పండించిన పూలను తనే స్కూటీపై వేసు కుని ఇల్లిల్లూ తిరిగి మార్కెట్‌ చేసుకునే దశ నుండి పెద్ద మొత్తంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, నాందేడ్‌ వంటి నగరాలకు మార్కెట్‌ను విస్తరించుకోగలిగింది రజినీ. ఇప్పుడు ఆమె పేరు జిల్లాలో మార్మోగుతుంది. ఉత్తమ, విశిష్ట మహిళా రైతు బిరుదుతో పాటు అనేక అవార్డులూ, రివార్డులు వరించాయి. జిల్లా ఉన్నతా ధికారులు ఆమె పూలతోట సాగును, సేంద్రీ య విధాన పద్ధతులను చూడడానికి క్యూ కట్టారు. ఇది ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది.
విప్లవాత్మకం…
వ్యవసాయం చెయ్యడం ఒక విశిష్ట కళ. అందరి వల్లా ఇది సాధ్యం కాదు. అందునా సేంద్రీయ వ్యవసాయం ఇంకా సవాళ్ల తో కూడుకున్నదే. మహిళలు అతి తక్కువగా ఉండే ఈ రంగం లో విశిష్ట మహిళా రైతుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందడం నిజంగా విప్లవాత్మకం. అయితే తన విజయ ప్రస్థా నంలో తనకు అడుగడుగునా తన జీవన సహచరుడు, ఇద్దరు పిల్లలు అండగా నిలబడ్డారని ఆమె అంటున్నారు. ఒక స్త్రీ అభి వృద్ధికి కుటుంబ తోడ్పాటు చాలా అవసరమని ఆమె అంటున్నారు.
కుటుంబం నుండి సమాజం కోసం
తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం తాను స్వయంగా పరిశోధించి, తయారు చేసిన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పొడి, ఆధునిక పద్ధతిలో, ఉత్తమ వ్యాపార విలువలతో సమాజానికి అందిస్తే బావుంటుందని ఆలోచించారు. ఆ ఆలోచనే ఆమె వ్యాపా రంలో, సేంద్రీయ వ్యవసాయంలో మరో ముందడుగు వెయ్యడానికి తోడ్పడింది. 75% సబ్సిడీతో, ప్రభుత్వ చేయూతతో మునగాకు పొడి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. తమ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే మునగ పంట సాగు చేస్తూ నైతిక విలువలతో, ఉన్నత ప్రమాణాలతో వ్యవసాయాన్ని వ్యాపారంగా, ఉపాధిగా మలుచుకున్న ఈ ఆదర్శ మహిళా రైతు ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
మునగాకు ప్రయోజనాలు
– మునగాకులో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
– ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు అధికంగా విటమిన్‌ సీ ఉంటుంది.
– అరటిపండ్ల కంటే 15రెట్లు అధికంగా పొటాషియం ఉంటుంది.
– ఈ ఆకులో క్యాల్షియం, ప్రోటీన్‌, ఐరన్‌, అమైనో యాసిడ్స్‌ ఉంటాయి.
– ఇవి అనారోగ్యాన్ని నయం చెయ్యడానికి కండరాలను నిర్మించడానికి సహాయ పడతాయి.
– రోగ నిరోధక వ్యవస్థను రక్షించగల అనేక పదార్థాలు ఈ ఆకులో ఉన్నాయి.
– మునగాకు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో రక్త పోటును తగ్గించ గలదని, శరీరంలో కొవ్వును తగ్గించగలదు అని నిరూపితమైంది.
– మునగాకు ద్రవం, వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
– మునగాకు లో ఉండే ఇన్సులిన్‌ లాంటి ప్రోటీన్‌ లు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి.
– ల్యాబ్‌ పరీక్షలలో ఆకు పదార్థాలు పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను మందగించేలా చేశాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
– మునగాకు లోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపితమైంది.
– డా. వాణీ దేవులపల్లి, 9866962414

Spread the love