Saturday, July 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగులకు ఆరోగ్య భరోసా

ఉద్యోగులకు ఆరోగ్య భరోసా

- Advertisement -

29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు వర్తింపు
886 ప్రయివేటు ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం
సీజీహెచ్‌ఎస్‌ ప్యాకేజీల కింద 1,816 రకాల చికిత్సలు :ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఇది మైలురాయి : దామోదర రాజనర్సింహ
ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం

జేఏసీ నేతలకు డిజిటల్‌ఆరోగ్య కార్డుల అందజేత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా, నమ్మకం కలిగిస్తూ, ఎలాంటి భయాందోళనలు లేని ఆరోగ్య భద్రతా వ్యవస్థను అందించాలనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ‌మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చుల కోసం అప్పులపాలై, వాటిని తీర్చలేక సతమతమవుతున్న దుస్థితిని గమనించామని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చి, వారికి సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అంబేద్కర్‌ రాష్ర్ట సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మతో కలిసి ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఉద్యోగ జేఏసీ నేతలకు డిజిటల్‌ ఆరోగ్య కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ పథకమే నిదర్శనమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, వారి సంక్షేమం, ఆరోగ్య భద్రతను చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

సుమారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన 29.80 లక్షల మంది కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రయివేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) ప్యాకేజీ రేట్లకు అనుగుణంగా 1,816 రకాల వైద్య, శస్త్రచికిత్సలను ఈ పథకం కవర్ చేస్తుందని ‌చెప్పారు. ఈ పథకం పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమాన భాగస్వామ్యంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం ‘ట్రస్ట్’ను ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఆరోగ్య భద్రత కోసం సకల జనుల సమ్మెతో సహా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం శూన్యమని విమర్శించారు. పదేండ్లపాటు ఉద్యోగుల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసిందన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ‌మంజూరు చేస్తోందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచామని అన్నారు. అర్హులైన 1.06 కోట్ల కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -