Saturday, July 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపౌర మౌలిక సదుపాయాలే టార్గెట్

పౌర మౌలిక సదుపాయాలే టార్గెట్

- Advertisement -

ఏడుగురు మృతి
అమెరికా సైనిక స్థావరాలపై
ఇరాన్ ప్రతిదాడులు
నవ తెలంగాణ – జనరల్ డెస్క్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా సేనలు ఇరాన్ సైనిక స్థావరాలపై వరుసగా ఆరో రోజు రాత్రి కూడా దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా శుక్రవారం మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై ప్రతి దాడులు చేసింది. తొలిసారిగా సిరియాపై ప్రత్యక్ష దాడికి దిగింది. ఇరాన్ సైనిక సామర్ధ్యాలను మరింతగా దెబ్బతీసేందుకు ఖెష్మ్ దీవి, బందర్ అబ్బాస్‌తో పాటు కీలక నౌకాదళ, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సైన్యం తెలిపింది. ‘ఫైటర్ జెట్లు, ఏరియల్ డ్రోన్లు, యుద్ధ నౌకలు అనేక ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడి చేశాయి. తీర గస్తీ స్థావరాలు, వైమానిక రక్షణ ప్రాంతాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, సముద్రయాన సామర్ధ్యాలను దెబ్బతీశాం’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో వివరించింది. ఓడరేవు నగరమైన ఛాబహార్ సమీపంలోని పసబందర్ ప్రాంతంపై అమెరికా జరిపిన దాడిలో ఓ పౌరుడు మరణించాడు. అమెరికా తాజా దాడులు పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సాగాయి. ఐదు బ్రిడ్జిలు, బందర్ ఖమిర్‌లోని రైల్వే స్టేషన్, ఇరాన్‌షెహర్ విమానాశ్రయంపై దాడులు జరిగాయని ఇరాన్ మీడియా చెప్పింది. బందర్ ఖమిర్‌లోని బ్రిడ్జిలపై జరిగిన దాడులలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాకు చావు దెబ్బ
​ఇరాన్ సైనికుల మరణాలకు ప్రత్యక్ష ప్రతీకారంగా సిరియాలోని ఒక అమెరికా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఆకస్మిక సైనిక దాడి చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. “పిల్లలను చంపే అమెరికా సైన్యం దుర్మార్గపు చర్యలకు ప్రతిస్పందనగా, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ యోధులు ‘ఆపరేషన్ నస్ర-2’ 11వ దశను ప్రారంభించారు. ‘యా అబా అబ్దిల్లా అల్-హొస్సేన్’ అనే పవిత్ర నినాదంతో పనిచేస్తూ, ఇరాన్‌షహర్‌లోని బంపూర్‌లో అణచివేతకు గురై అమరులైన సైనికులకు ఈ మిషన్‌ను అంకితం చేస్తూ, మా దళాలు సిరియాలోని అల్-తాన్ఫ్ ప్రాంతంలో ఉన్న శత్రువు ప్రత్యేక కార్యకలాపాల కమాండ్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేశాయి.” అని తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం, ఇరాన్‌షహర్‌లో ముందు రోజు రాత్రి మరణించిన సైనికులకు ప్రతీకారంగా జరిపిన ఈ దాడిలో ఒక రాడార్ వ్యవస్థను , అనేక ప్రత్యేక కార్యకలాపాల హెలికాప్టర్లను విజయవంతంగా ధ్వంసం చేయడంతో పాటు, అమెరికా బలగాలకు భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ప్రాంతీయ ఇంధన కారిడార్ల విషయంలో ఐఆర్‌జీసీ ఒక గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, “హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ మన ధైర్యవంతులైన యోధుల చేతుల్లోనే పటిష్టంగా ఉంది. అమెరికా దురాక్రమణ కొనసాగినంత కాలం, ఈ ప్రాంతం నుంచి ఒక్క చుక్క చమురు లేదా గ్యాస్ కూడా ఎగుమతి చేయబడదు” అని పేర్కొంది.

హార్ముజ్‌లో 
నిలిచిపోయిన 
నౌకల రవాణా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జలసంధిని ఇరాన్ మూసివేయగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -