పాస్‌పోర్ట్, ఆధార్, ఓటరు కార్డులున్నా నో యూజ్
వీటిలో ఏ ఒక్కటీ నేరుగా
పౌరసత్వ ధ్రువీకరణ కాదు
దేశ ప్రజల్లో అయోమయ పరిస్థితి
సర్ వివాదంలో కేంద్రం,
ఈసీ ముందు అనేక ప్రశ్నలు
దేశంలో పౌరసత్వం, ఓటు హక్కుపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలో పలు రాష్ట్రాల్లో చేపడుతోన్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ నేపథ్యంలో కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒకే ప్రశ్న తలెత్తుతోంది. ‘పాస్‌పోర్ట్ ఉంది. ఆధార్ ఉంది. పాన్‌కార్డు ఉంది. ఓటర్ల కార్డూ ఉంది. దశాబ్దాలుగా ఓటు వేస్తున్నాం. పన్నులు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ భారత పౌరుడినని నిరూపించుకోవాలంటే చూపాల్సిన ఏకైక పత్రం ఏది?’ అనేది వారి మెదళ్లను తొలుస్తోంది. పౌరసత్వాన్ని నిరూపించే ‘ఏకైక సిటిజెన్‌షిప్ సర్టిఫికెట్’ ఇప్పటికీ భారత్‌లో లేని విషయాన్ని విశ్లేషకులు, నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిదే ప్రశ్న కేంద్రం, ఎన్నికల సంఘం, పౌరసత్వ వ్యవహారాలను పర్యవేక్షించే అధికార యంత్రాంగాలనూ వెంటాడుతోంది.
న్యూఢిల్లీ : ఒకవైపు ‘డిజిటల్ ఇండియా’ అంటూ ప్రతి పౌరుడి వివరాలనూ డిజిటల్ వ్యవస్థల్లో నిక్షిప్తం చేసినట్టు కేంద్రంలోని మోడీ సర్కారు చెప్తోంది. మరోవైపు ఆధార్ పౌరసత్వ పత్రం కాదని స్పష్టం చేస్తోంది. పాస్‌పోర్టు భారతీయులకే జారీ అవుతున్నా.. అది కేవలం ప్రయాణ పత్రం (ట్రావెల్ డాక్యుమెంట్) మాత్రమేనని చట్టాలు చెప్తున్నాయి. ఓటరు కార్డు పౌరులకు మాత్రమే లభిస్తున్నా.. అది కూడా పౌరసత్వ ధ్రువీకరణ కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఇది దేశ పౌరుల్లో భయాందోళ నలను, అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. ఈ దేశంలోనే పుట్టి, పెరిగి, ఓటు వేసి, పన్నులు చెల్లిస్తున్న తాము పౌరసత్వం నిరూపించుకోవ డం కోసం అనేక పరీక్షలను, ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నా యని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీయులకు సిటిజన్‌షిప్ సర్టిఫికెట్..
మరి ఇక్కడే పుట్టిన వారికి?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..విదేశీయులు ఎవరైనా భారత పౌరస త్వం పొందితే వారికి అధికారిక పౌరసత్వ ధ్రువప త్రం జారీ అవుతోంది. కానీ ఈ దేశంలో పుట్టి పెరిగిన కోట్లాది మంది భారతీయుల వద్ద అలాంటి ప్రత్యేక ధ్రువపత్రం లేకపోవడం గమనార్హం. అంటే జన్మహక్కు ద్వారా పౌరులైనవారే తమ పౌరసత్వాన్ని నిరూపించే విషయంలో ఎక్కువ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘం కొన్ని మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. తాము భారత పౌరులం అని నిరూపించే ఒక అధికారిక ధ్రువ పత్రం ఎక్కడ? సర్ వంటి ప్రక్రియల్లో తమ పౌరసత్వ నిరూపణ కోసం అనేక పత్రాలను సమకూర్చుకోవడంలో సాధారణ పౌరులు పడుతున్న పాట్లకు బాధ్యులెవరు? అని వారు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం స్పష్టమైన ప్రమాణాన్ని ప్రకటించాలి
ఈ దేశంలోనే పుట్టిన ప్రజల నుంచి మరిన్ని ఆధారాలు కోరే ముందు.. పౌరసత్వానికి స్పష్టమైన, దేశవ్యాప్త ప్రమాణాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే.. పౌరసత్వం అనేది చట్టాలలో ఉన్న ఒక భావనగా మిగిలిపోతుందేమో గానీ, సాధారణ భారతీయుడి చేతిలో ఉండే హక్కుగా మారదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జన్మహక్కు ద్వారా ద్వారా పౌరులైనవారికి కూడా అవసరమైతే చూపించగలిగే ఏకైక పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వాలు ఎందుకు తీసుకురాలేకపోయాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి రుజువు ఏదని అడిగితే ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సంబంధిత యంత్రాంగాల వద్ద స్పష్టమైన సమాధానం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.



