అమరావతి : స్కిల్ కేసులో నిందితుడైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటికి ఆపరేషన్ పేరుతో మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాక బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ ఏపీ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం వాదనలు ముగిశాయి. చంద్రబాబుకు పలు షరతులు విధించాలన్న పిటిషన్‌పై ఈ నెల 3న తుది ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రకటించారు. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలైన వెంటనే బెయిల్ షరతులను ఉల్లంఘించారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఆనారోగ్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే రాజకీయ ర్యాలీ నిర్వహించారని చెప్పారు. మీడియాతో కూడా మాట్లాడారని, కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారని చెప్పారు. చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్‌పీలు ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి నిఘా విభాగం ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులను చంద్రబాబు వెంట ఉంచాల్సిన అవసరం ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిఘా వేరు, నేరుగా అధికారులు ఉండే సమర్పించే నివేదిక వేరని అదనపు ఏజీ జవాబు చెప్పారు.