నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన మంత్రి మోడీ ఆదివారం నాడు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఒలి దరాజలి దుస్త్లిక్’ (Oliy Darajali Dustlik)ను స్వీకరించారు. ఈ గౌరవం పట్ల తన కృతజ్ఞతలు తెలిపిన మోడీ, గ్లోబల్ సౌత్, మానవాళి శ్రేయస్సు కోసం భారత్, ఉజ్బెకిస్తాన్ కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.
అంతకుముందు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌లు ఉజ్బెకిస్థాన్‌లోని ‘కుక్సరోయ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్’ వేదికగా కీలక చర్చలు నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ఢోబాల్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్, ఇంకా ఇరు దేశాలకు చెందిన పలువురు సీనియర్ దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఈ చర్చల్లో ఇరు దేశాల నేతలు ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, సాంస్కృతిక సంబంధాలపై ఆయా రంగాల పురోగతిని సమీక్షించారు. భవిష్యత్తులో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేశారు.



