ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలి

Houses and house sites should be given– కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
– మియాపూర్‌లో మహిళల ధర్నా
నవతెలంగాణ-మియాపూర్‌
పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇస్తానన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు ప్రభుత్వ భూమిలో ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని 100, 101సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల మహిళలు పెద్దఎత్తున స్వతంత్రంగా శుక్రవారం తరలివచ్చారు. స్థలాలు ఆక్రమించుకుని అక్కడే బైటాయించారు.
సర్వే నెంబర్‌ 100, 101లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై కొన్నేండ్లుగా కోర్టులో కేసు విచారణలో ఉంది. అయితే శుక్రవారం సుమారు 30మందికిపైగా మహిళలు, చుట్టుపక్కల ప్రజలు ఒకేసారి భూమిలోకి వచ్చారు. అక్కడ ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న హెచ్‌ఎండీఏ అధికారులు పోలీసు బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ మహిళలు అక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వం గతంలో చెప్పిన మాదిరిగా ఇండ్లు ఇవ్వాలని కోరారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు.

Spread the love