10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్మారు..?

– హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలి
– హైదరాబాద్‌ ఆటగాళ్లు లేకుండా సన్‌ రైజర్స్‌ జట్టు : ఎమ్మెల్యే దానం నాగేందర్‌
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
”హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లకు టికెట్లు దొరక్కపోవడం దారుణం.. 10 నిమిషాల్లో 45వేల టికెట్లు ఎలా అమ్ముడయ్యారు..? సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారులు లేకపోవడం అన్యాయం.. మళ్లీ మ్యాచ్‌లో ఇలా జరిగితే.. ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరక్కుండా అడ్డుకుంటాం” అని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఐపీఎల్‌ టికెట్లు మొత్తం బ్లాక్‌లో అమ్ముతున్నారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను డీఎన్‌ఆర్‌ అకాడమీని నడుపుతున్నానని.. బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. అయితే ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు టికెట్లు దొరకడం లేదన్నారు. అందుకు ప్రధాన కారణం హెచ్‌సీఏ అన్నారు. కాంప్లమెంటరీ పాస్‌లు బ్లాక్‌లో అమ్ముతున్నారన్నారు. హెచ్‌సీఏ తీరుపై చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. రానున్న మ్యాచ్‌లకు బ్లాక్‌ టికెట్ల దందా జరగకుండా చూడాలని కోరారు. ఇక.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో హైదరాబాద్‌ క్రీడాకారులు ఒక్కరూ లేకపోవడం దారుణమన్నారు. కనీసం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కూడా హైదరా బాద్‌ ఆటగాడు లేడన్నారు. సన్‌ రైజర్స్‌ ఫ్రాంచైజీపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. వచ్చే ఏడాది నుంచి సన్‌ రైజర్స్‌ జట్టులో ఒక్క హైదరాబాద్‌ ఆటగాడైనా లేకపోతే ఉప్పల్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడనివ్వమన్నారు. అవసరమైతే స్టేడియం వద్ద ధర్నా చేస్తానని.. కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదన్నారు.

Spread the love