బడి ఎలా నడపాలి?

How to run a school?– బడిబాటకు ఇచ్చిన వెయ్యి తప్ప.. ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌
– రిజిస్టర్లు, డస్టర్లు, చాక్‌పీస్‌లు, ఇతర కొనుగోళ్లకు ఇబ్బందులు
– ప్రారంభంలోనే సర్కారు బడులను వెంటాడుతున్న నిధుల కొరత
– స్కూల్‌ గ్రాంట్స్‌ ఆల్యసంగా ఇస్తే.. పారదర్శకత లోపించే అవకాశం
– ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే సర్దుబాటు చేయాల్సిన దుస్థితి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన విద్యా సంవత్సరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటతో ఉత్సాహంగా ప్రారంభం అయింది. బడిబాట కార్యక్రమాలతో సర్కారు బడుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ఇంకా పూర్తి కాలేదు. పాఠశాలలు ప్రారంభమై.. క్లాసులు నడుస్తున్నప్పటికీ.. నిధుల కొరత వెంటాడుతుంది. స్కూల్స్‌కు ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ ఇవ్వకపోవడంతో రిజిస్టర్‌లు, స్టేషనరీ లాంటి వస్తువులు కొనేందుకు ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక స్కూల్‌ గ్రాంట్స్‌ ఆలస్యంగా ఇవ్వడం వలన పారదర్శకత లోపించే అవకాశముంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వడం వల్ల అవసరమైన వస్తువులను కొని పాఠశాలను విజయవంతంగా నడిపే అవకాశం ఉంటుంది. నూతన ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో 1-15 మంది విద్యార్థులుంటే.. రూ.12,500 మంజూరు చేస్తారు. 16 నుంచి 100 లోపు ఉంటే రూ.25 వేలు, 100 నుంచి 250 మందిలోపు ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి లోపు ఉంటే రూ.75 వేలు, వెయ్యికి పైగా ఉంటే రూ.లక్ష వరకు నిధులు వస్తాయి. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీసులు, బోర్డుల మరమ్మతులు, డస్టర్లు, హాజరు పట్టిక రిజిస్టర్లు, స్టేషనరీ, విద్యుత్తు, సామగ్రి బిల్లులు, జనవరి, ఆగస్టులో జెండా వందనం కార్యక్రమ నిర్వహణ ఖర్చులు, విద్యార్థులకు బహుమతులు, ఇలా పాఠశాలకు అవసరమైనవి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం స్కూల్‌ గ్రాంట్లను ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో పాఠశాలల ఎస్‌ఎంసీ ఖాతాల్లో జమ చేస్తోంది. మూడు విడుతల్లో అందజేసే ఈ నిధులను జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, ప్రాథమిక బడుల నిర్వహణకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఎస్‌ఎంసీల రద్దుతో హెడ్‌మాస్టరు, ఒక సీనియర్‌ ఉపాధ్యాయులు కలిసి అవసరమైన ఫండ్స్‌ డ్రా చేసేందుకు అవకాశమిచ్చారు. కానీ పాఠశాలలు ప్రారంభమై.. క్లాసులు జరుగుతున్నా నేటికీ పాఠశాల గ్రాంట్స్‌ విడుదల చేయలేకపోవడంతో ప్రభుత్వ స్కూళ్లను నిధులు కొరత వెంటాడుతోంది.
అరకొర వసతులతోనే విద్యార్థుల కాలం వెళ్లదీత
ఈ విద్య సంవత్సరం బడిబాట కార్యక్రమం కోసం స్కూల్‌ అకౌంట్‌ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు జమ చేసింది. దీంతో బడిబాటకు కావాల్సిన కరపత్రాలు, బ్యానర్లకు వాటిని హెడ్‌మాస్టర్లు ఖర్చుచేశారు. బడి నిర్వహణకు కావాల్సిన గ్రాంట్స్‌ మంజూరు చేయలేదు. దాంతో పాఠశాలల ప్రారంభం రోజున అవసరమయ్యే చాక్‌పీస్‌లు, డస్టర్లు, రిజిష్టర్‌లతో పాటు పారిశుధ్య నిర్వహణకు అవసరమయ్యే ఫినాయిల్‌, బ్రేష్‌, తదితర సామగ్రి వంటివి సొంత డబ్బులతో కొనుగోలు చేశారు. అంతేకాకుండా పాఠశాలల నిర్వహణ నిమిత్తం గతంలో నియమించిన స్కావెంజర్‌లను తీసివేసిన గత ప్రభుత్వం ఆ బాధ్యతను పంచాయతీలు, మున్సిపాలిటీలు, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. అయితే ఇప్పటికే పనిభారంతో ఇబ్బంది పడుతున్న జీహెచ్‌ఎంసీ, పంచాయతీలు, మున్సిపల్‌ కార్మికులు కేవలం పాఠశాలల ప్రాంగణాలు తప్ప.. పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో పాఠశాలలు కంపుకొట్టే స్థితికి చేరుకుంటున్నాయి. గత విద్యాసంవత్సరం నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో జిల్లాలోని అనేక పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఫలితంగా అరకొర వసతుల నడుమే విద్యార్థులు కాలం వెళ్లదీశారు. బడుల ముగింపు సమయంలో నిధులు రావడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఈ ఏడాదైనా స్కూల్‌ గ్రాంట్స్‌ మంజూరు విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తక్షణమే 50శాతం స్కూల్‌ గ్రాంటు విడుదల చేయాలి :ఏ.శ్యామ్‌ సుందర్‌, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్‌, హైదరాబాద్‌ జిల్లా
రిజిస్టర్‌లు, స్టేషనరీ లాంటి వస్తువులు కొనాలంటే ప్రధానోపాధ్యాయులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. స్కూల్‌ గ్రాంట్స్‌ ఆలస్యంగా ఇవ్వడం వలన పారదర్శకత లోపించే అవకాశం ఉంది. పారదర్శకంగా నిధుల ఖర్చు జరగాలంటే పాఠశాలల నిర్వహణకు కనీసం 50 శాతం నిధులు వెంటనే విడుదల చేయాలి. ఈ నిధులు విద్యసంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వడంతో అవసరమైన వస్తువులను కొని పాఠశాలలను విజయవంతంగా నడిపే అవకాశం ఉంటుంది. నూతన ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి.

Spread the love