నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై రూ.3.42 పైసలు, డీజిల్‌పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.110.88కు, డీజిల్ ధర రూ.98.96కి చేరింది.
ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు, తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి నుంచే పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తక్షణమే అమల్లోకి రానున్నాయి. స్థానిక పన్నులు ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఈ ధరల మార్పు స్వల్పంగా మారే అవకాశం ఉంది.



