కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక లైంగికదాడి
డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువు : మహిళా సంఘాలు
బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణేది? : ఆప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘోరం వెలుగు చూసింది. కదులుతున్న ప్రయివేటు బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు. మే 12 (సోమవారం)న జరిగిన ఈ ఘటన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెలుగులో వచ్చింది. బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళకు రక్షణ కరువుతుంటే..దేశ రాజధానిలో ఇలాంటి కిరాతకాలు జరగటం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని సీఎం రేఖాగుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆగ్రహాన్ని వెలిబుచ్చింది.
ఏం జరిగింది..?
ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. పితాంపురా మురికి వాడ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు మంగోల్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి నడు చుకుంటూ వెళ్తుండగా రాణిబాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సరస్వతి విహార్‌లోని బీ-బ్లాక్ బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో ఓ స్లీపర్ బస్సు అక్కడ ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని సమయం ఎంతైందని మహిళ అడిగింది. అయితే ఆ మహిళను ఆ వ్యక్తి బలవంతంగా బస్సులోకి లాగినట్టు పోలీసులు తెలిపారు.
రెండు గంటల పాటు బస్సులోనే దారుణం
ఆమెను లోపలికి లాగిన వెంటనే బస్సు తలుపులు మూసివేశారని బాధితురాలు ఫిర్యా దులో పేర్కొంది. అనంతరం బస్సు నాంగ్లో య్ మెట్రో స్టేషన్ సమీపంలో దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో రెండు గంటల పాటు తిరిగిందని వివరించింది. ఈ సమయంలో డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. బస్సులో కర్టెన్లు ఉండటంతో బయటివారికి లోపల ఏమి జరుగుతోందో కనిపించలేదని పోలీసులు తెలిపారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో నిందితులు గాయాలపాలైన మహిళను బస్సు నుంచి బయటకు తోసేసి అక్కడి నుంచి పరారైనట్టు బాధితురాలు వివరించింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బీహార్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు స్వాధీనం
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా రాణిబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 64(1) (లైంగికదాడి), 70(1) (సామూహిక లైంగికదాడి), 3(5) (ఉమ్మడి ఉద్దేశం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఉమేశ్, రాజేంద్రగా గుర్తించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు వెల్లడించాయి. నేరానికి ఉపయోగించిన బీహార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్టు తెలిపాయి. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
అలాగే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించినప్పటికీ బాధితురాలు నిరాకరించినట్టు వెల్లడించారు. తన భర్త క్షయవ్యాధితో బాధపడుతున్నారని, పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అందువల్ల ఇంటి వద్ద నుంచే చికిత్స కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
మళ్లీ నిర్భయ ఘటన
ఈ ఘటనపై ప్రతిపక్ష ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దేశానికి పెద్ద అవమానం అంటూ బీజేపీపై ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ విమర్శలు గుప్పించారు. ‘‘పెద్ద అవమానం. నిర్భయ ఘటన మళ్లీ జరిగింది. 30 ఏండ్ల మహిళను రాత్రి సమయంలో బస్సులోకి ఎక్కించి దారుణానికి పాల్పడ్డారు’’ అని సౌరభ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఢిల్లీలో మరో నిర్భయ
- Advertisement -
- Advertisement -


