25-3-1925 తేదిన గోదావరి తీరాన అమరవరములో ‘గౌతమి ఆశ్రమం’ ఏర్పాటు చేశారు. దానితో పాటు పాల్వంచ సంస్థానంలోని ప్రజలందరికీ విజ్ఞాన నిలయాన్ని అందుబాటులో ఉంచేందుకు ఒక గ్రంథాలయాన్ని, ఒక పత్రికా పఠన మందిరం, ఆంధ్ర విద్యా ప్రబోధ కరంబగు ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహుకరించారు. వీటితోపాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలు మౌలిక సదుపాయాలు కల్పించారు.
దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పత్రికలు ఈ గ్రంథాలయానికి అందించారు. అదేవిధంగా ఈ గ్రంథాలయ నిర్వహణకు శశైవ దశ నుండి ఉన్నతికి కషి సల్పారు. ఈ కషికి గాను ఈ గ్రంథాలయం పేరు ‘దేశోద్ధారక ఆంధ్రభాష నిలయం’ అని నామకరణం చేశారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు.
ప్రథమ వార్షికోత్సవాన్ని అక్షయ సంవత్సరం అశ్వ శుద్ధ విజయదశమి రోజున అత్యంత వైభవంగా పండిత ముకుంద మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. సభాధ్యక్షులు గ్రంథాలయ స్థితిగతులను తెలుగు భాష స్థితిగతులను ఉపన్యసించారు. తర్వాత రోజున అడ్లూరి సీతారామశాస్త్రి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు గంటల పాటు శబ్ద జ్ఞానోత్పత్తి, పుస్తక పఠనం పత్రికా పఠనం గురించిన ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. మొక్కరాల అప్పారావు నిజాం రాష్ట్ర చరిత్రను వ్యాసం రూపంలో చదివి వినిపించాలని, ఈ భాషా నిలయం గ్రామసభ సభ్యుల సహాయ సహకారాలతో వద్ధి చెందాలని కోరారు. చింతపట్ల సత్యనారాయణ నిజాం ప్రభువు, దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గార్ల చిత్రపటాలు వేసి వారు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చక్కటి ప్రతిభ కనబరిచిన శ్రీ కర్నాటి నాగవరావు అనే విద్యార్థికి ప్రథమ బహుమానం ఇచ్చి విద్యను ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, విజయదశమి రోజులలో గ్రంథాలయ సభ్యులు సరస్వతి ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రంథాలయంలో కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు
రుద్రం కోట వాస్తవ్యులు వలివేల సింగయ్య పంతులు, వాలివెల వెంకట రామారావు, కొత్తపల్లి నరసయ్య, మట్లకుంట వీరభద్రం, కారా సూర్యనారాయణ, రావి సోమయ్య, జూపల్లి ధర్మ లింగయ్య, అమరవరపు సోమయ్య, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జమలాపురం సుబ్బారావు పంతులు, దేశపాండ్య గౌరీదేవి పేట వాస్తవ్యులు వలివేలు అన్నము రాజు కోటగిరి పిచ్చయ్య, శ్రీ బుద్ధరాజు వెంకటపతి రాజు, గ్రంథాలయ పోషకులుగా ఉండేందుకు అంగీకరించారు. వీరితోపాటు బూర్గంపాడు అశ్వరావుపేట అమరవరం ప్రముఖులు కొందరు వార్షికంగా విరాళాలు ఇస్తామన్నారు. రాను రాను సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. చుట్టుపక్కల గ్రామాలను కూడా జనాలు గ్రంథాలయానికి విచ్చేసి విజ్ఞాన కార్యక్రమాలను తిలకించేవారు. గ్రంథాలయ పోషకులు వేలూరి సుబ్రహ్మణ్యం, మంత్రి ప్రగడ వెంకయ్య ఈ గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలను పత్రికలను అందించారు.
నాడు ఈ గ్రంథాలయం మొదటి సంవత్సరంలో 930 పుస్తకాలు వున్నాయి. రెండవ సంవత్సరంలో ఆంధ్ర గ్రంథములు. 1128, సంస్కతం 43, ఇంగ్లీషు166, ఉర్దూ13, హిందీ 19 మొత్తం 1363 కలవు. మొదటి సంవత్సరం నందు 60 రూపాయలు విలువ చేసే పుస్తకాలను ఖరీదు చేశారు. వేలూరు సుబ్రహ్మణ్యం 40 పుస్తకాలు, మంత్రి పగడ వెంకట శేషగిరిరావు 25 పుస్తకాలు, మంత్రిపగడ వెంకయ్య 15 పుస్తకాలు, 35 రూపాయల విలువ చేసే పుస్తకాలు ఖరీదు చేసేందుకు పోతన జయంతి సందర్భంగా వాగ్దానం చేశారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ మహాకవి సంపుటములలో వేలూరు సుబ్రహ్మణ్యం, శర్మ, రావి భద్రయ్య, యమజాల వెంకట శాస్త్రి, ముప్పాల రాయనం దొరలు గ్రంథాలయానికి బహూకరించారు. రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్ హెడ్మాస్టర్ జయంతి గంగన్న వీరేశలింగం మహాకవి సంపుటములను సగం ధరకే ఇప్పించారు.
గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంజిని, జన్మభూమి, త్రిలీజగా, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కష్ణ పత్రిక తదితర పత్రికలు కోటగిరి వెంకట అప్పారావు, మాజెటి రామచంద్రరావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీ కష్ణ జయంతి సందర్భంగా గ్రంథాలయ యాత్ర చేపట్టి విరాళాలు సేకరించి గ్రంధాలయం ఉన్నతికి కషి చేశారు. 24-12-1925 భద్రాచలం దేవస్థాన పండితులు అట్లూరి సీతారామశాస్త్రి విద్య గురించి విస్తత ఉపన్యాసం ఇచ్చారు. మొక్కరాల అప్పారావు సాంద్ర సుదర్శన్‌రావు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ద్వితీయ సంవత్సరం సభ వినాయక చవితి రోజున 1927 లో మక్కరాల అప్పారావు అధ్యక్షతన మహాజనసభను ఘనంగా నిర్వహించారు. వర్తకులు నిర్మల ప్రకాశం, అల్లూరి వీరభద్ర రాజు ప్రధాన పోషకులుగా, మహారాజశ్రీ కొటారు అప్పారావు సీతారాం రావు సోదరుడు, కుకునూరు అప్పయ్య, సంగీత నాట్యకళా సంపన్నుడు బ్రహ్మశ్రీ ముకుంద రామ్మూర్తి, చిలుకూరి సుబ్బారావు, వేలూరు సుబ్రహ్మణ్యం పోషకులుగా ఈ గ్రంథాలయ అభివద్ధికి మాతభాష మీద ఉన్నటువంటి అభిమానంతో కషి చేశారు. ఈ సమావేశం నందు గ్రంథాలయ అభివద్ధికి కావలసిన కార్యక్రమాలు, గ్రంథాలయానికి పాఠకులను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రంథాలయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ప్రజలందరినీ సాయంత్రం పూట గ్రంథాలయంకు వచ్చి రేడియో వార్తలు, వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు తెలుసుకోవాలని కోరారు. దానికి తగిన తీర్మానాలు కూడా ఈ కార్యక్రమంలో తీసుకున్నారు. అందరి సమ్మతంతో కార్యనిర్వాహక సంఘ సభ్యులను ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా వేలూరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా పండిత ముకుంద రామ్మూర్తి, చిలుకూరి సుబ్బరాయ కవి, మొక్కరాల అప్పారావు., కార్యదర్శులుగా కొత్తపల్లి వెంకట రామలక్ష్మి, నారాయణ శర్మ (గ్రంథాలయ అధికారిగా కూడా సేవలు అందించారు) సహాయ కార్యదర్శిగా కోటారు సీతారామారావు, కోశాధికారిగా నిర్మల ప్రకాశం… వీరితోపాటు సభలో కొటారు అప్పారావు, మల్లాది సుబ్బయ్య శాస్త్రి, కుక్కునూరు అప్పయ్య, అల్లూరి వీరభద్ర రాజు, రావి భద్రయ్య, విన్నపాల ధర్మారావు, రావి అప్పయ్య, ఊటుకూరు రామదాసు తదితరులు పాల్గొన్నారు. నిర్మల ప్రకాశం వివాహ కట్నం కింద గ్రంథాలయానికి ఎనిమిది రూపాయల విలువ చేసే రెండు చిన్న బీరువాలను బహుకరించారు.
ఈ గ్రంథాలయంలో 1950 వరకు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, శతకాలు, కీర్తనలు, హరికథలు, వచన కావ్యాలు, వివిధ చరిత్రలు, ఉపన్యాసాలు, విమర్శలు, వివిధ శాస్త్రములు, సాహిత్య గ్రంధంలు, కథలు, వినోదాలు, ప్రహాసనాలు, వేదాంత గ్రంథాలు, నివేదికలు, సంచికలు గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయానికి అడ్లూరి సీతారామశాస్త్రి, శతావధాని శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి, వీరభద్రం పేస్ కార్, శేషాద్రి రమణ కవులు, పువ్వాడ వెంకటప్పయ్య, జనమంచి సీతారామస్వామి, కోన వెంకటరాయ శర్మ విచ్చేసి గ్రంథాలను చేస్తున్న సేవలను కొనియాడారు. గ్రంథాలయానికి వస్తున్న చదవరులను దష్టిలో ఉంచుకొని నూతన గ్రంథాలయ భవనానికి విరాళాల సేకరణకు పూనుకున్నారు. విరాళాల ద్వారా 80 రూపాయలు సేకరించారు.
1952 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి సంచిక కూడా ముద్రించారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1975 అర్థ శత దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించి గ్రంథాలయానికి సాహయ సహకారాలు అందించిన వారందరిని సత్కరించారు.
1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించుకున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది కారణం ఆర్థికలేమీ, మానవనరుల కొరత. దీనితోపాటు నేటి అవసరాలకు అనుగుణంగా పుస్తక సంపద లేకపోవడం. 1980-85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపదంత అంతరించిపోయింది. 1983 కాలంలో ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లి గ్రామ గ్రంథాలయంగా సేవలందించింది.
సరిగ్గా 100 సంవత్సరాల కింద విజ్ఞాన వెలుగులు విరజమ్మి అనేకమందికి విజ్ఞాన భిక్ష, అక్షర బిక్షను ప్రసాదించి, ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో ఇలాంటి గ్రంథాలయాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన గ్రంథ సంపద ఆయా జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో, ప్రాంతీయ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలలో కొలువుదీరాయి. అలాంటి గ్రంథ సంపదను డిజిటలైజ్ చేసి నాలుగు కాలాలపాటు భద్రంగా ఉండే విధంగా ప్రయత్నం చెయ్యాలి.
పుస్తకం వర్ధిల్లాలి, గ్రంథాలయాలు వెలుగొందాలి.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327