– నేటి నుంచి చాంపియన్స్ ట్రోఫీ
– ఆరంభ మ్యాచ్‌లో పాక్, కివీస్ ఢీ
ప్రపంచ క్రికెట్ ఐసీసీ ఈవెంట్లతో కళకళలాడుతోంది. ఇటీవల 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లు అభిమానులను అలరించగా.. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ దూసుకొచ్చింది. ఏడేండ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్ ఆతిథ్యం అందిస్తుండగా.. రన్నరప్ టీమ్ ఇండియా తన మ్యాచులను దుబారులో ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచ టాప్-8 జట్లు పోటీపడుతున్న ఈ సమరంలో టైటిల్ కోసం చాంపియన్లు తలపడుతున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ ఆరంభ మ్యాచ్‌తో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి షురూ కానుంది.
నవతెలంగాణ-కరాచి
ఎనిమిది మేటి జట్లు
ఓ ఐసీసీ టోర్నమెంట్ ముంగిట అగ్ర జట్లు ఆ ఫార్మాట్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవటం బహుశా ఇదే ప్రథమం. చాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుండగా.. భారత్, ఇంగ్లాండ్ సహా పలు దేశాలు టీ20 ఫార్మాట్‌లోనే ఎక్కువగా మ్యాచులు ఆడాయి. 50 ఓవర్ల ఆటకు ఆశించిన ప్రాధాన్యత దక్కలేదు. అయినా, చాంపియన్స్ ట్రోఫీ వేటలో సమర శంఖం పూరించేందుకు మేటి ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి. గత ప్రపంచకప్‌లో టాప్-8లో నిలిచిన జట్లు మాత్రమే అర్హత సాధించటంతో శ్రీలంక, వెస్టిండీస్ వంటి జట్లు ఈ టోర్నీకి దూరం అయ్యాయి. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్ట్‌లు భారత్, పాకిస్థాన్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్‌లు తాజా టోర్నీలో పోటీపడుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ, నాకౌట్ దశలో సాగనుంది. ఎనిమిది జట్లను తొలుత రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గనిస్థాన్‌లు గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర మూడు జట్లతో ఓసారి తలపడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
పాకిస్థాన్‌కు సవాల్
పాకిస్థాన్‌లో పండుగ వాతావరణం మొదలైంది. 1996 ఐసీసీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పాక్‌లో మళ్లీ ఓ ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించటం ఇదే ప్రథమం. దశాబ్ద కాలం పాటు స్వదేశంలో ద్వైపాక్షిక క్రికెట్‌కు దూరమైన పాకిస్థాన్ 29 ఏండ్ల నిరీక్షణ తర్వాత మెగా టోర్నమెంట్‌కు వేదికగా నిలిచింది. 1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఓ ఆసక్తికర సంబంధం ఉంది. 1992 ప్రపంచకప్ విజేతగా నిలిచిన పాకిస్థాన్.. డిఫెండింగ్ చాంపియన్‌గా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. తాజాగా 2017లో చాంపియన్స్ ట్రోఫీ సాధించిన పాకిస్థాన్ మరోసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మెగా ఈవెంట్‌కు వేదికైంది. భద్రత ఏర్పాట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన సవాల్. ప్రణాళిక ప్రకారంగా మూడు స్టేడియాల్లోనే టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. రావల్పిండి, కరాచి, లాహోర్‌లో స్టేడియాలను ఆధునీకరించారు. క్రికెట్‌ను పాకిస్థాన్‌లో విపరీతంగా అభిమానిస్తారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ క్రికెట్ పాక్ గడ్డపై రావటంతో అభిమానుల్లో హంగామా మొదలైంది. పొరుగు దేశం, దాయాది భారత్ తన మ్యాచులు దుబారులో ఆడటం పాకిస్థాన్‌కు నిరాశే మిగిల్చింది.
కొత్త చాంపియన్‌ను చూస్తామా?
ఐసీసీ ఈవెంట్లలో కొత్త చాంపియన్ అనగానే తొలుత వినిపించే మాట దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్. ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు దారుణ రికార్డుంది. కానీ చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు మాజీ చాంపియన్లు. 1998 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో పైచేయి సాధించింది. 1998లో బంగ్లాదేశ్, 2000లో కెన్యా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం అందించాయి. పాకిస్థాన్ (2017), ఆస్ట్రేలియా (2006, 2009), భారత్ (2002, 2013) చాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్లు. మాజీ చాంపియన్లు శ్రీలంక (2002), వెస్టిండీస్ (2004)లు 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేదు.
మూడో టైటిల్ వేటలో భారత్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా మంచి రికార్డుంది. 2017 చాంపియన్స్ ట్రోఫీలోనూ టీమ్ ఇండియా టైటిల్ ఫేవరేట్. కానీ ఫైనల్లో పాకిస్థాన్ అనూహ్యంగా రాణించింది. అప్పటివరకు సూపర్‌గా ఆడిన కోహ్లిసేన టైటిల్‌కు అడుగు దూరంలోనే నిలిచింది. 2000 చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ పరాజయం పాలైంది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు తలొగ్గింది. 2013 చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా ధోని సారథ్యంలో దక్కించుకుంది. 2002 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వరుసగా రెండు రోజులు వర్షం అంతరాయం కలిగించటంతో శ్రీలంకతో కలిసి భారత్ టైటిల్‌ను పంచుకుంది.
ముందే ముగిసిన ఆరంభ వేడుకలు
ఐసీసీ టోర్నమెంట్లకు ఆరంభ వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్థాన్ టోర్నమెంట్ ఆరంభానికి మూడు రోజులు ముందే ఓపెనింగ్ సెర్మానీ చేసేసింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని అట్టహాసంగా ఆరంభించిన పీసీబీ.. లాహోర్ కోట వద్ద ఆరంభ వేడుకలు చేసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీ గెలుపు గుర్రాలు ఆరంభ వేడుకలకు హాజరయ్యారు. ఐసీసీ ఈవెంట్లకు సహజంగా కనిపించే మరో సంప్రదాయం సైతం ఈసారి కనుమరుగైంది. టోర్నీలో పోటీపడుతున్న అన్ని జట్ల కెప్టెన్లు ట్రోఫీతో గ్రూప్ ఫోటో దిగుతారు. కెప్టెన్లు అందరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడతారు. కానీ 2025 చాంపియన్స్ ట్రోఫీకి ఈ కార్యక్రమాలు ఏమీ షెడ్యూల్ చేయలేదు.