గెలిస్తే కదా.. సీఎం అయ్యేది

గెలిస్తే కదా.. సీఎం అయ్యేది– కొడంగల్‌ సభలో రేవంత్‌పై కేసీఆర్‌ నిప్పులు
– అలా అనుకుని ఓట్లేస్తే మళ్లీ మొదటికే..
– రెండుచోట్లా ఓడిపోతాడు
– బీఆర్‌ఎస్‌దే విజయం
– నేనెప్పుడూ పదవుల గురించి ఆశపడలేదు
– ధరణిని తీసేస్తే రైతులు ఆగమే..
– కాంగ్రెస్‌ అంటేనే దళారుల రాజ్యం : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవ తెలంగాణ- మహబూబ్‌ నగర్‌ / తాండూరు/కొడంగల్‌/పరిగి
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని, ముఖ్యంగా రేవంత్‌రెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ చిత్తుగా ఓడిపోతారని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టంచేశారు. కేసీఆర్‌ బతికున్నంత కాలం తెలంగాణలో మతతత్వవాదులకు తావు లేదని సెక్యులర్‌ విధానాన్ని కాపాడుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి ధరణి తొలగిస్తే తెలంగాణలో భూమాత కాదు భూమేత వస్తుందని అన్నారు. బుధవారం కొడంగల్‌, తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తాను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా కాబట్టే రైతుల కష్టాలు, బాధలు తనకు తెలుసన్నారు. రేవంత్‌రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా.. పొలం దున్నారా.. అవన్నీ తెలియవు కాబట్టే ఉచిత విద్యుత్‌, రైతు బంధుపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15మంది ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది అంటూ వ్యాఖ్యానించారు. ఆయన సీఎం అవుతారని ఓటేస్తే.. కొడంగల్‌ పరిస్థితి మొదటికే వస్తుందని అన్నారు. భూకబ్జాదారుడైన రేవంత్‌.. సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ అంటేనే దళారుల రాజ్యం అని, వారి పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మన భూములు మనకు కాకుండా చేసే కుట్ర కాంగ్రెస్‌ చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 పింఛన్‌ ఇస్తే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 2000 ఇచ్చినట్టు తెలిపారు. త్వరలోనే దానిని పెంచుతామన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి, ఎవరు గెలిస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుందో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని దళితులంతా ధనికులు అయ్యే వరకు దళిత బంధు పథకం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అలాగే, వచ్చే ఏడాది మిషన్‌ మేడ్‌లో పేదలకు ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. తనకు పదవులపై ఆశలేదని, తెలంగాణను ఆగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్‌ అంటేనే దళారుల రాజ్యం
కాంగ్రెస్‌ ధరణి తొలగిస్తే రైతులు ఆగం కావడమే కాక సంక్షేమ పథకాలు పక్కదారి పడతాయన్నారు. దాంతో దళారీ వ్యవస్థ వచ్చి రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైపాస్‌ రోడ్డు పూర్తికావడంతో పాలమూరుకు రవాణా సమస్య తగ్గిందన్నారు. మినీ ట్యాంక్‌బండ్‌, కెేసీఆర్‌ పార్క్‌ వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు దివిటీపల్లి దగ్గర రూ.10వేల కోట్లతో అమరరాజా బ్యాటరీ కంపెనీ రావడం శ్రీనివాస్‌ గౌడ్‌ కృషికి నిదర్శనమన్నారు.

Spread the love