– కోస్ట్ గార్డ్ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌పై
– కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం
న్యూఢిల్లీ: కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలనే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కోస్ట్ గార్డుకు చెందిన మహిళా అధికారులకు సంబంధించిన శాశ్వత కమిషన్‌ను ఇప్పటికీ ఎందుకు ఏర్పాటుచేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు(కేంద్ర ప్రభుత్వం) ఏర్పాటు చేయటం చేతకాకపోతే చెప్పండి.. మేం ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు. త్వరగా శాశ్వత కమిషన్‌లో మహిళా కోస్ట్ గార్డు అధికారులకు చోటు కల్పించాలని చీఫ్ జస్టిస్.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణీని ఆదేశించారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయవల్సిందిగా కోస్ట్‌గార్డును కోరుతామని అటార్నీ జనరల్.. సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా నేవి, ఆర్మీతో పోల్చితే కోస్ట్‌గార్డు భిన్నమైనదని అటర్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఇక.. ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 19 విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.