– రాష్ట్రాల అసెంబ్లీలపై ప్రభావం
– పలు రాష్ట్రాల్లో ఐదేండ్లు పూర్తి కాకుండానే మళ్లీ ఎన్నికలకు
– ‘జమిలీ’పై ఇప్పటికే నివేదిక సమర్పించిన భారత మాజీ రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనున్నది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించే ఏకకాల ఎన్నికలపై ఇప్పటికే తన నివేదికను ప్రస్తుత రాష్ట్రపతి ద్రైపది ముర్ముకు సమర్పించింది. దీంతో ఇప్పుడు ఏకకాల ఎన్నికల పైనా రాజకీయ వేదికపై చర్చ నడుస్తున్నది. దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణను కేంద్రానికి వదిలేస్తూ కమిటీ తన నివేదికలో ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.
అయితే, కేంద్రం ఒకవేళ ఏకకాల ఎన్నికలకు వెళ్తే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన, ఎన్నిక కాబోయే ప్రభుత్వాల ఐదేండ్ల పాలన గడువుపై ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ 2029లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయిస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనేక రాష్ట్రాల అసెంబ్లీలు 2029లో వాటి ఐదేండ్లు ముగిసేలోపే రద్దు చేయబడతాయి. ”ఒకే దేశం, ఒకే ఎన్నికలు”పై ఉన్నత స్థాయి కమిటీ ఏకకాల ఎన్నికలకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలో నిర్ణయించటానికి కేంద్రానికి వదిలివేస్తూ రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించింది. ఒకవేళ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే.. ఏకకాల ఎన్నికలు అనివార్య మవుతాయని నిపుణులు చెప్తున్నారు.ఒకవేళ 2029లో ఏకకాల ఎన్నికలు జరిగితే పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. గతేడాది 10 రాష్ట్రాలలో ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు 2028 వరకు అధికారంలో కొనసాగుతాయి. అనంతరం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఏర్పడబోయే కొత్త ప్రభుత్వాలు దాదాపు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలం అధికారంలో ఉంటాయి.
ఇందులో తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్నాటక, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. ఇక యూపీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో 2022లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తిరిగి 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున. అవి రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం అధికారంలో ఉండనున్నాయి. అలాగే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లో 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చినా కూడా ప్రభుత్వాలు మూడేండ్ల పాటు మాత్రమే కొనసాగుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా మాత్రమే షెడ్యూల్ ప్రకారం లోక్‌సభతో పాటు ఎన్నికలకు వెళ్తాయి.
ఏకకాల ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరగకుండా చూసుకోవటానికి లోక్‌సభ కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83కి, రాష్ట్ర అసెంబ్లీ వ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172కి సవరణలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఇది రాష్ట్రపతి నోటిఫికేషన్‌ను అనుసరించే అవకాశం ఉన్నది. సవరణలు పార్లమెంటు ఆమోదం పొందటంలో విఫలమైతే, నోటిఫికేషన్ చెల్లదని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా, సవరణలు ఆమోదించబడితే, ఏకకాల ఎన్నికలు అనివార్యమవుతాయని వారు వివరిస్తున్నారు.