కృషి ఉంటే మనుషులు రుషులవుతారు… మహా పురుషులవుతారు’ అనే సినీ గీతం మనందరికీ తెలిసిందే. నిజమే కదా మనం ఏదైనా సాధించాలంటే దానికోసం కృషి చేయాలి. పట్టుదలతో శ్రమించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. అలా కాకుండా మన ప్రయత్నం ఏమీ లేకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారని అలాగే కూర్చుంటే ఎదురు చూస్తూ మోస పోవడం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.
నేలలో నాటిన విత్తనం జీవం పోసుకుని మొక్కగా నిలబడేదాకా నీరు పోయాలి. తర్వాత అదే నీటిని వెతుక్కుని తన వెళ్లను నలుమూలలకు విస్తరింపజేసుకుని బలంగా ఎదుగుతుంది. మహావృక్షంగా తయారతువుంది. అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదల, స్వయంకృషితో తనలోని జ్ఞానాన్ని, మేదస్సును పెంచుకోవాలి. ఈ పుట్టుక మనది. బతుకు మనది. మన ఆలోచనలకు అనుగుణంగా కష్టసుఖాలు అనుభవించేది మనమే. అలాంటప్పుడు ఒకరి సాయం కోసం ఎదురు చూడటం ఎందుకు? వేరొకరి అభిప్రాయాలపై ఆధారపడటం ఎందుకు? ఈ జీవిత ప్రయాణంలో మనకు తోడుగా మనతో కలిసి నడిచేవారుంటారు. మన ఆనందాన్ని పంచుకునేవారు ఉంటారు. కానీ మన బాధలను మోసేవారుండరు. పంచుకొనే వారు ఉండరు. అందుకే మన కష్టాలను మనమే భరించాలి.
శారీరక వైకల్యం ఉన్నవారు కూడా ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుని, బాధలను భరిస్తూ తమ మేధాశక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు శారీరకంగా, మానసికంగా బాగున్నవాళ్లు కష్టాలు వచ్చినపుడు కుంగిపోవడం ఎందుకు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశగా ఎదురుచూడటం కన్నా ఎవరికి వారే మనోబలంతో కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. మనకు సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం మనమే నిలబడాలి. ఆ సమస్యలకు అసలు కారణాలు శోధించాలి.
జీవితంలో ప్రతి మనిషికీ సమస్యలు తప్పవు. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. ఈ ప్రయాణంలో గెలవడాలు, ఓడిపోవడాలు ఉండవు. అనుభవాలు, గుణపాఠాలే ఉంటాయి. ముందు మనం ఈ విషయం గుర్తించాలి. ఒక్క సారి అనుకున్న లక్ష్యం చేరలేకపోతే ఆ అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. మాంసాహారిన్ని తినే జంతువులు ఆకలిని తట్టుకోలేక గడ్డి తినవు కదా! అలాగే మనిషి కూడా విలువలు మర్చిపోయి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకోకూడదు. మనలోని వివేకాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. దీని కోసం మనకు ఎవరు తోడై వస్తారో వాళ్లను కలుపుకు పోవాలి. ఒంటరిగా ఏదీ సాధించలేమని తెలుసుకోవాలి.
లక్ష్య సాధనలో ప్రతి జీవి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంది. విజయ శిఖరాలను చేరాలనుకునేవారు ఎలాంటి అవరోధాల్నీ పట్టించుకోకూడదు. ‘నీలోని బలహీనతలను పదేపదే గుర్తు చేసుకుని బాధపడటం అవివేకం. నీ బలం ఏంటో తెలుసుకో. ఉన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగేందుకు నీ బలమే నీకు తోడ్పడుతుంది’ అంటారు స్వామి వివేకానంద. మనిషి తాను బలహీనుడినని ఎప్పుడూ భావించకూడదు. తోడ్పాటు కోసం ఎదురు చూడక ప్రయత్నశీలుడై గమ్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. తమకు తాము సాయం చేసుకునే వారిని ఎలాంటి ఆటంకాలైనా ఏమీ చేయలేవు.