వాళ్లు గెలిస్తే దేశం నాశనమే

If they win, the country will be destroyed– బీజేపీని బొంద పెట్టాలి..
– ప్రజాసమస్యలపై పనిచేస్తున్న జహంగీర్‌ను గెలిపించండి
– బహిరంగ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సంస్థాన్‌ నారాయణపురం
మోడీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ.జహంగీర్‌ను గెలిపించాలని కోరుతూ శుక్రవారం రాత్రి యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో దేశం రావణకాష్టంలా మండిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తోందన్నారు. పొరపాటున కూడా బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వొద్దని, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు ఎర్రజెండా పార్టీలు దేశవ్యాప్తంగా 28 పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడినట్టు చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీని గిట్టుబాటు ధర అడిగినందుకు 765 మంది రైతులని కాల్చి చంపిందన్నారు. వారి ఆగడాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పంపిస్తుందన్నారు. పేదల సంక్షేమాన్ని మరిచి అదానీ, అంబానీలకు లక్షల కోట్లు దోచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులంతా రాజకీయాల్లోకి వచ్చి భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. శతకోటీశ్వరులై చట్టసభలకు పోతున్నారన్నారు. వారు వాళ్ల సంపదను కాపాడుకోవడానికే చూస్తారు తప్ప పేదల గురించి పట్టదని చెప్పారు. అందుకే ఈ ఎన్నికల్లో పేదప్రజల పక్షాన నికరంగా పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది సీపీఐ(ఎం) మాత్రమే అని అన్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పనిచేస్తున్న భువనగిరి పార్లమెంట్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పెట్ట రాములు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌ బాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, నాయకులు జి.శ్రీనివాసచారి, డోడ యాదిరెడ్డి, దొంతగాని పెద్దులు, తుమ్మల నర్సిరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యులు మర్రి వసంత, ఖమ్మం జిల్లా నాయకులు సత్యనారాయణ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రాపర్తి వెంకటేష్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ కేసిరెడ్డి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love